You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రష్యా - యుక్రెయిన్ యుద్ధం అప్‌డేట్స్: 'మరియుపూల్ వీధుల్లో సేకరించిన మృతదేహాల సంఖ్య 1,207'
మరియుపూల్‌లో కనీసం 1,207 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ నగర డిప్యూటీ మేయర్ వెల్లడించారు.
"వీధుల్లో సేకరించిన మృతదేహాల సంఖ్య అది" అని సెర్గి ఓర్లోవ్ బీబీసీకి చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నగరం బయట ఉన్న స్మశాన వాటికలను చేరుకోవడం కష్టం కాబట్టి, 47 మందికి సామూహిక ఖననం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
మరియుపూల్ నుంచి ప్రజలను తరలించే వీలు లేకపోయిందని, సహాయం కూడా అందించలేకపోతున్నామని ఓర్లోవ్ అన్నారు.
బుధవారం నగరం నుంచి ప్రయివేటు కార్లలో బయలుదేరిన 100 మంది పౌరులు వెనక్కు మరలవలసి వచ్చిందని, చెక్ పోస్టుల దగ్గర రష్యన్ సైనికులు "నేరుగా కార్లకు గురి పెట్టలేదుగానీ, చుట్టుపక్కల కాల్చడంతో" భయపడి జనం వెనక్కు మళ్లారని ఆయన తెలిపారు.
వొలదిమీర్ జెలియెన్‌స్కీ: 'యుక్రెయిన్‌ను అత్యున్నత ప్రమాణాలతో పునర్నిర్మించుకుంటాం'
యుక్రెయిన్ యుద్ధంపై మిత్రదేశాలు వాస్తవిక పరిష్కారాలు చూపించాలని, అభిప్రాయాలు చెప్పడం కాదని ఆ దేశ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ అన్నారు.
ప్రపంచ నేతలంతా యుక్రెయిన్ యుద్ధం, నాటోలో సభ్యత్వం గురించి చర్చిస్తున్నారని, వీరిలో ఎవరెవరు యుక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నారో తనకు తెలుసునని ఆయన అన్నారు.
యుద్ధం 15వ రోజుకు చేరుకుందని, యుక్రెయిన్ పౌరులు తమ దేశం కోసం అవిరామంగా పోరాడుతున్నారని, ముఖ్యమైన ప్రాంతాల్లో రష్యన్ సైన్యాన్ని తిప్పికొడుతున్నారని చెప్పారు.
మరియుపూల్ ఆస్పత్రి భవనంపై జరిగిన దాడిలో ఒక పసిబిడ్డ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, దాడి సమయంలో ఆస్పత్రిలో రోగులు లేరని రష్యా చెబుతున్న మాటలు అవాస్తవమని అన్నారు.
"రష్యన్లు మానవతా సంక్షోభాన్ని సృష్టించారు. ఆక్రమణదారులు మా నగరాలకు, దేశానికి కలిగించిన హాని చూస్తే నా హృదయం ముక్కలైపోతోంది. రష్యన్లు యుక్రెయిన్ పౌరులను అవమానించాలని కంకణం కట్టుకున్నారు. వాళ్ల ముందు మోకరిల్లి వారి చేతుల మీదుగా ఆహారం, నీరు అందుకునేలా చేయాలనుకుంటున్నారు.
మేము బానిసలం కాలేదు. ఎప్పటికీ కాము కూడా. ఎందుకంటే ఇది (యుక్రెయినియన్ల పోరాటం) మా స్ఫూర్తి, మా భవిష్యత్తు.
యుద్ధం ముగిసిన తరువాత, మేం యుక్రెయిన్‌ను అత్యున్నత ప్రమాణాలతో పునర్నిర్మించుకుంటాం. ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రష్యన్ల దాడి గుర్తులను పూర్తిగా చెరిపేస్తాం" అని జెలియెన్‌స్కీ అన్నారు.
'మరియుపూల్ నగరంలోని ఇళ్లపై మళ్లీ బాంబులు పడుతున్నాయి'
మరియుపూల్ నగరంలోని ఇళ్లపై మళ్లీ బాంబులు పడుతున్నాయని సిటీ కౌన్సిల్ టెలిగ్రాంలో తెలిపింది.
దీని కారణంగా, మనవాతా సహాయం అందించేందుకు మరియుపూల్‌కు బయలుదేరిన కాన్వాయ్ వెనుదిరిగిందని యుక్రెయిన్ డిప్యుటీ ప్రధాని సోషల్ మీడియాలో వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
వ్యూహాత్మకంగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఈ ఓడరేవు నగరాన్ని స్వాధీనం చేసుకోవడంలో రష్యా విఫలమైందని, అందుకే ఇక్కడి నుంచి పౌరులను తరలించే ప్రయత్నాలను రష్యా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని యుక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు సోషల్ మీడియాలో అన్నారు.
మరియుపూల్‌లో గత కొద్ది రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక ప్రసూతి ఆస్పత్రిపై బాంబు దాడి జరిగింది. అందులో ఒక పసి బిడ్డ సహా ముగ్గురు చనిపోయారని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
'మానవతా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి'
యుక్రెయిన్, రష్యా విదేశాంగ మంత్రులు ఈరోజు టర్కీలోని అంటాల్యాలో సమావేశమయ్యారు.
తాజా చర్చల తరువాత యుక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, యుక్రెయిన్‌లో మానవతా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపారు.
"యుక్రెయిన్‌లో యుద్ధం ముగించే దిశలో చర్చలను కొనసాగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యుక్రెయిన్ పౌరుల కష్టాలు తొలగించడానికి, మా భూభాగాలకు రష్యా ఆక్రమణ నుంచి విముక్తి కలిగించడానికి ఈ రకమైన చర్చలు కొనసాగించేందుకు సిద్ధం" అని ఆయన తెలిపారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ, పశ్చిమ దేశాలు, యుక్రెయిన్‌కు ఆయుధాలు సరఫారా చేయడం ద్వారా "ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాయని" అన్నారు. ఇది "వాళ్ల నియమాలు, విలువలను ఉల్లంఘిచడమే" అని అన్నారు.
రష్యా యుక్రెయిన్‌పై దాడి చేయలేదని, రష్యా దృష్టిలో ఇది దురాక్రమణ కాదని, కేవలం "ప్రత్యేక సైనిక చర్య" అని అన్నారు.
మరియుపూల్‌లో 24 గంటల పాటు కాల్పులను విరమించాలని, అత్యవసరంగా మానవతా సహాయం అందించేందుకు వీలు కల్పించాలని డిమిట్రో కులేబా అన్నారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ విషయాలను క్రెమ్లిన్‌కు తెలియజేస్తారని, మరియుపూల్‌లో త్వరలోనే మానవతా సహాయం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
'మరియుపూల్‌లోని ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో ఒక బిడ్డతో సహా ముగ్గురు చనిపోయారు'
బుధవారం మరియుపూల్‌లోని ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో ఒక బిడ్డతో సహా ముగ్గురు చనిపోయారని నగర డిప్యుటీ మేయర్ బీబీసీతో చెప్పారు.
కనీసం 17 మంది గాయపడ్డారని, వారిలో గర్భిణులు కూడా ఉన్నారని సమాచారం.
"ఈ ఆస్పత్రి గురించి వారికి కచ్చితంగా తెలిసి ఉండవచ్చు. నగరంలో రష్యా సేనలు ధ్వంసం చేసిన మూడవ ఆస్పత్రి ఇది" అని సెర్గీ ఆర్లావ్ బీబీసీకి చెప్పారు.
"అంతకు ముందు రోజే, కోవిడ్ రోగుల కోసం కేటాయించిన 300 పడకలతో కూడిన ఆస్పత్రిని కూడా ధ్వంసం చేశారు" అని ఆయన చెప్పారు.
యుక్రెయిల్‌పై దాడి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సార్లు వివిధ వైద్య కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
అయితే, యుక్రెయిన్ సేనలు ఆస్పత్రి నుంచి రోగులను, సిబ్బందిని ఖాళీ చేయించాయని రష్యా చెబుతోంది.
రష్యా యుద్ధ నేరానికి పాల్పడిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్స్కీ అన్నారు.
'ఖార్కియెవ్‌లో జరిగిన రష్యన్ బాంబు దాడుల్లో నలుగురు మరణించారు'
ఖార్కియెవ్‌లో జరిగిన రష్యన్ బాంబు దాడుల్లో నలుగురు మరణించినట్లు యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ దాడి యుక్రెయిన్‌కు ఆగ్నేయంగా ఉన్న స్లోబోజాన్స్కీ గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ దాడిలో గాయపడిన అయిదేళ్ల చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
శిధిలాల నుంచి మృతదేహాలను వెలికి తీసే చర్యలు కొనసాగుతున్నాయి.
ఖార్కియెవ్‌లో మరొక షాపింగ్ మాల్ పై కూడా దాడి జరిగింది. అయితే, ఈ దాడిలో ఎన్ని మరణాలు చోటు చేసుకున్నాయనే విషయం తెలియలేదు.
రిజర్వ్ దళాలను రంగంలోకి దించిన రష్యా - యూకే రక్షణ శాఖ
యుక్రెయిన్‌లో పోరాటం చేసేందుకు రష్యా రిజర్వ్ దళాలను పంపిస్తోందని యూకే రక్షణ శాఖ ఇంటెలిజెన్స్ సమాచారం తెలిపింది. రిజర్వ్ బలగాలను యుద్ధ రంగంలోకి పంపేది లేదని ఇప్పటి వరకు రష్యా చెబుతూ వచ్చింది.
యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని బ్రిటన్ విడుదల చేసింది.
"ఒక వైపు యుద్ధంలో మరణిస్తున్నవారి సంఖ్యపెరుగుతుండగా, సైన్యంలో తలెత్తుతున్న లోపాలను పూరించుకునేందుకు రష్యా రిజర్వ్ బలగాలతో పాటు ఇతర చోట్ల నుంచి కూడా సేనలను సమకూరుస్తోంది".
ఇప్పటి వరకు యుక్రెయిన్ పోరాటంలో 5000 మంది రష్యన్ సేనలు మరణించినట్లు యూకే అంచనా వేసింది.
రష్యన్ బాంబు దాడిలో యుక్రెయిన్ వాసి సెర్హియీ పెరిబైనిస్ భార్య, ఇద్దరు పిల్లలు మరణించినట్లు తెలిసింది. అయితే, ఈ వార్త ఆయనకు ట్విటర్‌లో కనిపించిన మృతదేహాల ఫోటోల ద్వారా తెలిసింది.
"వారి వస్తువులను చూసి వారిని గుర్తుపట్టాను" అని ఆయన న్యూ యార్క్ టైమ్స్ పత్రికకు చెప్పారు.
ఇర్పిన్ పట్టణం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూ సెర్హియీ భార్యతో పాటు వారిద్దరి పిల్లలు కూడా మరణించారు. ఆ పిల్లల వయసు 18, 9 సంవత్సరాలు. 2014లో యుక్రెయిన్ సైన్యానికి రష్యన్ వేర్పాటువాదులకు మధ్య జరిగిన పోరాటం నుంచి తప్పించుకునేందుకు వారు తూర్పు యుక్రెయిన్ నుంచి కీయెవ్ లో స్థిరపడేందుకు వలస వెళ్లారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మారక చిహ్నం పక్కనే మరణించిన కుటుంబ సభ్యుల ఫోటో ఉన్నట్లు న్యూ యార్క్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో కనిపించింది.
"ఇక్కడేమి జరుగుతుందో ప్రపంచమంతా తెలుసుకోవలసిన అవసరముంది" అని సెర్హియీ అన్నారు. యుక్రెయిన్ లో యుద్ధం మొదలుకాకముందే అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు ఆయన దేశం వదిలి వెళ్లారు.
కీయెవ్ తిరిగి వెళ్లేందుకు, ఆయన రష్యాకు వెళ్లి అక్కడి నుంచి పోలండ్ చేరాల్సి వచ్చినట్లు చెప్పారు.
"మీరు స్పెషల్ ఆపరేషన్ అని పిలుస్తున్న ఈ యుద్ధంలో నా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. దీనిని మేము యుద్ధం అనే పిలుస్తాం" అని ఆయన పోలండ్ సరిహద్దుల్లో ఉన్న రష్యన్ సేనలకు చెప్పారు.
"నన్ను మీరేమైనా చేసుకోండి. కోల్పోవడానికి ఇక నా దగ్గరేమి మిగిలి లేదు" అని వారితో చెప్పారు.
"ఈ అనుభవం ఒక హరర్ సినిమాలా ఉంది" అని అంటూ ఆయన ఫేస్ బుక్ పోస్ట్ లో రాశారు.
"మీ భార్య నేల పై ఒక నల్లని సంచిలో మూట కట్టి పడి ఉంటే చూడటం చాలా కష్టంగా ఉంటుంది" అని ఆయన రాశారు.
ఆయన కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. "వారి కోసం చివరి వరకు పోరాడతాను. దీని పై కోర్టు తీర్పు ఇచ్చేలా చూస్తాను" అని అన్నారు.
మరియుపూల్ లో పిల్లల ఆస్పత్రి పై జరిగిన దాడిని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గూటియెరెజ్ ఖండించారు. "ఇది భయానకం" అని వర్ణించారు.
"యుద్ధంతో సంబంధం లేని పౌరులు దీనికి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది" .
"ఈ అర్ధం లేని హింస ఆగాలి. రక్తపాతాన్ని ఆపండి" అని అంటూ అని ఆయన ట్వీట్ చేశారు.
కాల్పుల విరమణ అమలులో ఉండాల్సిన సమయంలో రష్యా వైద్య కేంద్రం పై దాడి చేసిందని యుక్రెయిన్ ఆరోపించింది.
నెమ్మదిగా సాగుతున్న రష్యన్ సేనల కదలికలు
తూర్పు యుక్రెయిన్ లోని దోనెత్క్క్, స్లోబోజాన్స్కీ, తవ్రీయాలోని కొన్ని జిల్లాల్లో రష్యన్ దాడులను యుక్రెయిన్ సేనలు ఎదుర్కొంటున్నాయి. యుక్రెయిన్ సేనలు ఖార్కియెవ్, ఆక్టిర్కా నగరాలకు పహరా కాస్తున్నాయి.
దక్షిణాన మరియుపూల్‌లో కూడా రక్షణ కొనసాగుతోంది.
గత రెండు రోజుల్లో యుక్రెయిన్ ఫైటర్ జెట్లు, క్షిపణులు, రష్యాకు చెందిన నాలుగు ఎస్ యూ 25 విమానాలను, రెండు హెలికాఫ్టర్లను కూల్చేశాయి.
రష్యా కదలికలు నెమ్మదిగా సాగుతున్నాయి. కానీ, దోపిడీలు గణనీయంగా పెరిగాయి.
కీయెవ్ ను కాపాడుకునేందుకు యుక్రెయిన్ సైన్యం తిరుగుదాడిని ప్రారంభించిందని ఇంటీరియర్ మంత్రి సలహాదారుడు చెప్పినట్లు యుక్రెయిన్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ సస్ప్లీన్ పేర్కొంది.
"రాత్రంతా చాలా కష్టంగా గడిచింది. కానీ, కీయెవ్ దగ్గర రష్యా దాడులను యుక్రెయిన్ సైన్యం ఎదుర్కొంది" అని ఇంటీరియర్ మంత్రి సలహాదారుడు వాదిం దెనిసెంకో చెప్పినట్లు పేర్కొంది.
"మేము అయిదు ట్యాంకులను సిద్ధంగా ఉంచాం. గురువారం ఉదయం కీయెవ్ శివార్లలో పోరాటం జరుగుతున్న శబ్దాలు వినిపించాయి. అయితే, దీని గురించి అదనపు సమాచారం లేదు" అని చెప్పారు.
ఈ వివరాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
యుక్రెయిన్‌లో హ్యూమానిటేరియన్ జోన్లను సంరక్షించేందుకు అమెరికా, యూఎన్ సేనలు యుద్ధరంగంలోకి అడుగుపెట్టాల్సిన అవసరముందని అమెరికా మాజీ భద్రతా సలహాదారు జేమ్స్ జెఫ్రీ పిలుపునిచ్చారు.
యుక్రెయిన్ ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరాలని చెబుతూ, ఐక్యరాజ్యసమితి సేనలు యుద్ధరంగంలోకి అడుగుపెట్టడం వల్లే 2006లో దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ ఆక్రమణకు అంతం పలికిందని గుర్తు చేశారు.
యుక్రెయిన్ హ్యూమానిటేరియన్ జోన్ల పై సైనిక చర్యలు జరగకుండా చూడాలని చెప్పారు.
"ఐక్యరాజ్యసమితి ఆమోదించి యుక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించిన సేనల పై రష్యా దాడి చేయాలని నిర్ణయిస్తే తప్ప ఎటువంటి పోరాటం మొదలవ్వదు" అని ఆయన డిఫెన్స్ వన్ లో రాశారు.
"రష్యా నాటో పట్ల ప్రదర్శిస్తున్న వ్యతిరేకత వల్ల నాటో యుక్రెయిన్‌కు సహాయం చేసే స్థితిలో లేదు" అని జెఫ్రీ అన్నారు. కానీ, ఆయన చెప్పిన వ్యూహంతో అమెరికా సేనలు రంగంలోకి దిగుతాయని అన్నారు.
సిరియాలో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రష్యా సేనలు పోరాడుతున్నప్పుడు అమెరికా రహస్య స్థావరాలను ఏర్పరుచుకుని తీవ్రవాదుల పై పోరాడిన మాదిరిగానే ప్రస్తుతం ప్రతిపాదించిన వ్యూహం కూడా ఉంటుందని ఆయన వివరించారు.
అయితే, "ఈ వ్యూహం యుద్ధంలో గెలుపొందేందుకు యుక్రెయిన్‌కు పూర్తిగా సహాయపడకపోవచ్చు కానీ, రష్యా సంపూర్ణ విజయం సాధించకుండా ఉండేందుకు పని చేస్తుంది" అని అన్నారు.
యుక్రెయిన్‌లో అత్యవసర సహాయ చర్యల నిమిత్తం అమెరికా చట్టసభ 1,360 కోట్ల డాలర్ల నిధుల విడుదలను ఆమోదించింది.
సుమీ ప్రాంతంలోనున్న ఓకిర్యుకా నగరంలో రష్యన్ దళాలు రాత్రంతా వైమానిక దాడులు నిర్వహించినట్లు, స్థానిక అధికారి చెప్పారు.
యుక్రెయిన్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 12.30 గంటల సమయంలో (తెల్లవారితే గురువారం) బాంబు దాడిలో నివాస ప్రదేశాలు, గ్యాస్ పైప్ లైన్ ధ్వంసమైనట్లు స్థానిక అధికారి దిమిత్రో జివిట్స్కీ చెప్పారు.
ఈ దాడి జరిగిన 10 నిమిషాలకే సుమీ శివార్లలో ఉన్న బిటిట్సియా గ్రామం పై కూడా బాంబు దాడులు జరిగినట్లు చెప్పారు.
ఈ దాడుల్లో జరిగిన మరణాల గురించి సమాచారం లేదు.
రష్యా మిలిటరీ ఈ దాడుల గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
గురువారం ఉదయం 9 గంటల నుంచి పౌరులను బయటకు తరలించేందుకు మూడు మానవతా కారిడార్లను తెరుస్తారని జివిట్స్కీ ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా విపరీతంగా బాంబు దాడులకు లోనవుతున్న సుమీ నుంచి బుధవారం సుమారు 5000 మందిని తరలించారు.
సుమారు 6000మంది రష్యన్ సైనికులు మరణించారంటున్న అమెరికా
యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి సుమారు 5000-6000 మంది మరణించారని అమెరికా అధికారిక అంచనా వేసింది. ఈ సమాచారాన్ని అమెరికాలో బీబీసీ పార్టనర్ సీబీఎస్ న్యూస్ తెలిపింది.
రష్యా సైనికులు 15,000 - 18,000 మంది గాయపడి ఉంటారని అంచనా వేస్తోంది. మరణించిన వారి కంటే గాయపడిన వారి సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండవచ్చనే లెక్కతో ఈ అంచనా వేసింది.
పేరు వెల్లడి చేసేందుకు ఇష్టపడని అమెరికన్ అధికారి ఒకరు, ఈ దాడిలో చోటు చేసుకున్న మరణాల సంఖ్య గణనీయంగా ఉందంటూ, మరణాల రేటును రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన వినాశనంతో పోల్చారు.
ఈ పోరాటంలో 12,000 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు యుక్రెయిన్ చెబుతోంది. అయితే, యుక్రెయిన్‌లో 500 కంటే తక్కువ మంది సైనికులు మరణించినట్లు రష్యా గత వారంలో చెప్పింది.
అయితే, ఇరుపక్షాలు చేసే వాదనలను నిరూపించడం కూడా కష్టమే.
రష్యా వైమానిక దాడిలో మరియుపూల్‌లోని ప్రసూతి, పిల్లల ఆస్పత్రి విధ్వంసానికి గురైనట్లు యుక్రెయిన్ తెలిపింది. ఈ దాడికి గురై అనేక మంది ఆస్పత్రి సిబ్బంది, రోగులు శిథిలాల్లో చిక్కుకున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు. ఈ దాడి యుద్ధ నేరమేనని అన్నారు.
ఈ దాడికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. ఆస్పత్రి తీవ్రంగా ధ్వంసమైనట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ దాడిలో కనీసం 17 మంది ఆస్పత్రి సిబ్బంది, రోగులు గాయపడినట్లు స్థానిక అధికారి ఒకరు తెలిపారు.
అయితే, మృతుల సంఖ్యను ధ్రువీకరించలేదని దొనెట్స్క్ ప్రాంతీయ నిర్వహణ అధికారి పావ్లో కిరిలెంకో తెలిపారు. ఎంత మంది పిల్లలు గాయపడ్డారనే విషయం కూడా ఇంకా స్పష్టంగా తెలియదు.
రష్యా కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఈ దాడికి పాల్పడిందని ఆయన అన్నారు.
ఈ దాడి తీవ్రమైన నష్టాన్ని చేకూర్చిందని మరియుపూల్ సిటీ కౌన్సిల్ తెలిపింది. ధ్వంసమైన భవనాలు, కార్లు, హాస్పిటల్ బయట భారీ గుంత కనిపిస్తున్న వీడియోను విడుదల చేసింది.
"ఈ ఆధునిక కాలంలో పిల్లల ఆస్పత్రిపై బాంబు వేయడం ఎలా సాధ్యమయిందో మాకర్థం కావడం లేదు. ఇది నిజమని ప్రజలు నమ్మలేకపొతున్నారు" అని మరియుపూల్ డెప్యూటీ మేయర్ సెర్హీ ఆర్లావ్ బీబీసీకి చెప్పారు.
రష్యన్ దాడిని యుద్ధ నేరంగా పరిగణిస్తూ జెలియెన్‌స్కీ రష్యన్ భాషలో ప్రసంగాన్ని చేశారు.
"రష్యా ఎటువంటి దేశం? ఆసుపత్రులు, ప్రసూతి వార్డులకు భయపడి వాటిని నాశనం చేస్తోంది" అని అడిగారు.
అమాయక పౌరులపై రష్యా సేనలు ఆటవికంగా ప్రవర్తించడాన్ని వైట్ హౌస్ ఖండించింది.
"నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, పోరాడలేనివారిని లక్ష్యంగా చేసుకోవడం కంటే హీనమైన చర్య మరొకటి ఉండదు" అని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు.
రష్యా సేనలు గత కొన్ని రోజుల నుంచి మరియుపూల్ నగరాన్ని చుట్టుముట్టాయి. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, పౌరులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అనేక సార్లు విఫలమయ్యాయి.
"ప్రస్తుతం మరియుపూల్‌లో ప్రజలు కరెంటు, ఆహారం, మంచినీరు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది డీహైడ్రేషన్ కు గురై చనిపోతున్నారు" అని యుక్రెయిన్ రెడ్ క్రాస్ కు చెందిన ఒలేనా స్టోకోజ్ చెప్పారు.
అక్కడి నుంచి ప్రజలను తరలించేందుకు తమ సంస్థ కారిడార్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
రష్యా దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి మరియుపూల్‌లో సుమారు 1170 మంది పౌరులు మరణించినట్లు డెప్యూటీ మేయర్ ఆర్లావ్ చెప్పారు. బుధవారం 47 మందిని సామూహిక సమాధి చేసినట్లు తెలిపారు.
అయితే, ఈ మరణాల సంఖ్యను బీబీసీ ధ్రువీకరించలేదు.
యుక్రెయిన్‌లో ఇప్పటి వరకు 516 మంది పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. నిజానికి మరణాల సంఖ్య ఇంత కంటే ఎక్కువ ఉండొచ్చని చెబుతోంది.
మరోవైపు, యుక్రెయిన్‌లో పౌర సంబంధిత మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని రష్యా చెబుతోంది.
మానవతా కారిడార్లు
దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మానవతా కారిడార్ల ద్వారా సుమారు 48,000 మందిని బయటకు తరలించినట్లు ప్రభుత్వ అధికారి కిర్లో టిమోషెన్కో చెప్పారు.
దేశం విడిచి పెట్టి వెళ్లినవారిలో అత్యధికంగా 43,000 మంది ఒక్క సుమీ నగరం నుంచే ఉన్నారు. ఈ నగరం రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉంది.
కీయెవ్ శివార్ల నుంచి సుమారు 3500 మందిని తరలించారు. ఇర్పిన్ నుంచి కూడా కొంత మంది పౌరులను తరలించారు. ఈ నగరాల పై రష్యా సేనల బాంబు దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి.
1000 మందికి పైగా పౌరులు ఎనెర్హొదర్ నుంచి జాపోరిజియాకు వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- యోగి ఆదిత్యనాథ్: విద్యార్థి నాయకుడి నుంచి 'ముఖ్యమంత్రీ మహారాజ్' వరకు సాగిన ప్రయాణం
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం తెలుగు సినీ పరిశ్రమ హబ్‌గా మారుతుందా... అవకాశాలేంటి, అవరోధాలేంటి?
- భావన మేనన్: లైంగిక దాడికి గురైన అయిదేళ్లకు గొంతు విప్పిన నటి, ఆమె ఏం చెప్పారంటే...
- భగవంత్ మాన్: కమెడియన్, పొలిటీషియన్... కాబోయే పంజాబ్ సీఎం
- ‘కమలం అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్’ - యూపీ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో చర్చ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)