You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రష్యా నుంచి వచ్చే నార్డ్ స్ట్రీమ్-2 గ్యాస్ పైప్‌లైన్‌ను ఆపేయాలని జర్మనీ నిర్ణయం, అసలేంటీ పైప్‌లైన్? దీనికున్న ప్రాధాన్యమేంటి?
రష్యా నుంచి జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్‌ను ధ్రువీకరించే ప్రక్రియను ఆపివేయాలని జర్మనీ నిర్ణయించింది.
రష్యా తాజా చర్యల వల్ల నార్డ్ స్ట్రీమ్-2 గ్యాస్ పైప్‌లైన్ ధ్రువీకరణ ముందుకెళ్లడం సాధ్యం కాదని జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ స్పష్టం చేశారు.
"ఇందులో సాంకేతిక అంశాలు చాలా ఉన్నాయని అనిపించవచ్చు. కానీ, ఇక ఈ పైప్‌లైనుకు ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వడం కుదరదు. ధ్రువీకరణ లేకుండా నార్డ్ స్ట్రీమ్ 2 తన సరఫరాను ప్రారంభించలేదు" అని జర్మనీ చాన్సలర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
ఈ నిర్ణయం వల్ల జర్మనీకి సహజవాయువు సరఫరా లోటు ఏమీ ఉండదని, కాకపోతే రష్యా నుంచి వచ్చే నార్డ్ స్ట్రీమ్-2 పైప్‌లైను వల్ల దేశంలో గ్యాస్ నిల్వలు రెట్టింపు అయ్యేవని ఆ దేశ వైస్ చాన్సలర్, ఆర్థిక మంత్రి రాబర్ట్ హాబెక్ మీడియాతో చెప్పారు.
అయితే, దీనివల్ల రాబోయే కొన్ని రోజుల్లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన అంగీకరించారు.
ఈ పైప్ లైను నిర్మాణం పూర్తయినప్పటికీ, దాని ద్వారా గ్యాస్ సరఫరా కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి, దాని ప్రభావం యూరప్ ఇంధన సరఫరాపై పెద్దగా ఉండదని యూరోపియన్ కమిషన్ కూడా ప్రకటించింది.
జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని యుక్రెయిన్ స్వాగతించింది.
"ప్రస్తుత పరిస్థితులల్లో ఇది నైతికంగా, రాజకీయంగా, ఆచరణాత్మకంగా సరైన చర్య. కష్ట సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడమే అసలైన నాయకత్వానికి అర్థం. జర్మనీ చర్యలు ఆ విషయాన్ని నిరూపిస్తున్నాయి" అని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా ట్వీట్ చేశారు.
రష్యా, జర్మనీ దేశాల మధ్య ఈ పైప్‌లైన్ నిర్మాణం గత సెప్టెంబరులో పూర్తయింది, కానీ ఇంకా అది పనిచేయడం లేదు.
యుక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే భారీ ఆంక్షలు విధిస్తామని అమెరికా, ఐరోపా దేశాలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఈ భారీ ఆంక్షల్లో నోర్డ్ స్ట్రీమ్-2 పైప్‌లైన్‌ను రద్దు ఒకటి.
యుక్రెయిన్‌పై రష్యా దండెత్తితే నోర్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్‌ను మూసేయిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరి మొదటి వారంలోనే హెచ్చరించారు.
తాజాగా, యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమర్ జెలెన్‌స్కీ ఈ పైప్‌లైన్‌ను తక్షణం పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు.
సముద్రం లోపల 1225 కి.మీ. పైప్‌లైన్
జర్మనీకి సహజవాయువు ఎగుమతులను రెట్టింపు చేయడానికి రష్యా నిర్మించిందే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్. 2011 నుంచి వినియోగంలో ఉన్న నార్డ్ స్ట్రీమ్‌కు సమాంతరంగా ఇది సాగుతుంది.
బాల్టిక్ సముద్రం లోపల నుంచి వెళ్లే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ పొడవు 1,225 కిలోమీటర్లు. ఇది సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలోని రష్యా తీరం నుంచి జర్మనీలోని లుబ్మిన్ వరకు సహజవాయువును తీసుకెళ్తుంది.
దీని నిర్మాణానికి ఐదేళ్లు పట్టింది. ఇది 2021 సెప్టెంబరులో పూర్తయ్యింది. దీనికి వెయ్యి కోట్ల యూరోలు అంటే సుమారు 85 వేల కోట్ల రూపాయల వ్యయమైంది.
ఈ ప్రాజెక్టులో సగం వ్యయాన్ని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన దిగ్గజం గ్యాజ్‌ప్రోమ్ భరించింది. మిగతా వ్యయాన్ని షెల్, ఫ్రాన్స్‌కు చెందిన ఎంజీ, ఇతర పాశ్చాత్య ఇంధన సంస్థలు వెచ్చించాయి.
యూరప్‌లో ఇంధన ధరలు తగ్గించవచ్చు
ఐరోపాలో 2.6 కోట్ల కుటుంబాలకు తగినంత సహజవాయువు సరఫరా చేసేందుకు నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ నిర్మించారు. కానీ, ఇది ఇంకా వినియోగంలోకి రాలేదు.
నార్డ్ స్ట్రీమ్, నార్డ్ స్ట్రీమ్ 2.. ఈ రెండు పైప్‌లైన్లు కలిసి ఏటా 110 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను యూరప్‌కు తీసుకెళ్లగలవు.
అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఏడాదిలో వాడే మొత్తం గ్యాస్‌లో పావు భాగానికి పైగా గ్యాస్‌ను ఈ రెండే సరఫరా చేయగలవు.
నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ పూర్తి సామర్థ్యం మేరకు గ్యాస్ సరఫరా చేస్తే, యూరప్‌లో గ్యాస్ కొరతను అధిగమించవచ్చు. అధికంగా ఉన్న ఇంధన ధరలను తగ్గించవచ్చు.
ఎవరు అనుకూలం?
నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్‌కు రష్యా, జర్మనీ గట్టి మద్దతుదారులు.
తాను మరింత సహజవాయువును ఎగుమతి చేయాలని రష్యా కోరుకోవడం. జర్మనీ కూడా యుక్రెయిన్, పోలండ్ గుండా ఏర్పాటైన పైప్‌లైన్లతో వచ్చే గ్యాస్ కంటే తక్కువ ధరకు గ్యాస్ పొందాలని, సరఫరా వ్యవస్థ కూడా మెరుగ్గా ఉండాలని భావించడమే దీనికి కారణం.
రష్యా పశ్చిమ భాగంలో పెద్దయెత్తున సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని యూరప్‌కు భారీగా ఎగుమతి చేసి లబ్ధి పొందాలని రష్యా చూస్తోంది.
పోలండ్, యుక్రెయిన్ భూభాగాల గుండా వెళ్లే ఉపరితల పైప్‌లైన్లపై ఆధారపడటం కంటే కూడా సముద్రం లోపల నుంచి వెళ్లే పైప్‌లైన్‌తో యూరప్‌కు గ్యాస్ సరఫరా చేయాలని రష్యా భావిస్తోంది.
ఉపరితల పైప్‌లైన్ వ్యవస్థలు పాతబడిపోతున్నాయి. అవి అంత సమర్థంగా కూడా లేవు. దీనికితోడు పోలండ్, యుక్రెయిన్ ట్రాన్సిట్ ఫీజుల రూపంలో పెద్దయెత్తున వసూలు చేస్తున్నాయి. దీనివల్ల గ్యాస్ ధర అధికమవుతోంది.
యూరప్‌లో రష్యాకు అతిపెద్ద గ్యాస్ వినియోగదారు జర్మనీయే. జర్మనీ గ్యాస్ అవసరాల్లో 35 శాతం వరకు రష్యా నుంచే దిగుమతి అవుతోంది. అందుకే కొత్త సరఫరాల కోసం జర్మనీ ఎదురుచూస్తోంది.
ఎవరు వ్యతిరేకం?
నార్డ్ స్ట్రీమ్- 2ను రష్యాను ఆనుకొని ఉండే యుక్రెయిన్, పోలండ్‌లతోపాటు అమెరికా, బ్రిటన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇది వినియోగంలోకి వస్తే, ఐరోపాకు గ్యాస్ సరఫరాలపై రష్యాకు నియంత్రణ ఇంకా పెరుగుతుందనే ఆందోళన ఈ దేశాలకు ఉంది. ఈ పైప్‌లైన్‌ను ప్రమాదకరమైన రాజకీయ ఆయుధంగా యుక్రెయిన్ అభివర్ణించింది.
2006లో రష్యా, యుక్రెయిన్ మధ్య ఒక ఆర్థిక వివాదం వల్ల, యుక్రెయిన్ గుండా యూరప్ వెళ్లే గ్యాస్ సరఫరాలను రష్యా నిలిపివేసింది. దీంతో మధ్య యూరప్, తూర్పు యూరప్‌లలో శీతాకాలంలో తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడింది.
పైప్‌లైన్ యాజమాన్యంపై రష్యా, జర్మనీ మధ్య ఇంకా అంగీకారం కుదరలేదు.
రష్యా ఉక్రెయిన్ మీద దండెత్తడం వల్ల నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ ఒక వేళ రద్దు కాకపోయినా, దాని ఎదుట ఒక పెద్ద చట్టపరమైన అడ్డంకి కూడా ఉంది.
జర్మనీ నియంత్రణ అధికారులు ఈ పైప్ లైన్ ఆపరేటింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించారు.
నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైనులో, ఆ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే మొత్తం గ్యాస్‌లో రష్యా సంస్థ గాజ్‌ప్రోమ్‌కు 50 శాతం వాటా ఉండడమే దీనికి కారణం.
దీనివల్ల రష్యాకు గ్యాస్ సరఫరా మీద చాలా ఎక్కువ నియంత్రణ ఉంటుందని జర్మనీ గతంలో చెప్పింది. పైప్‌లైన్ యాజమాన్యాన్ని మరో కంపెనీకి అఫ్పగించాలని అది కోరుతోంది.
అన్నీ సవ్యంగా జరిగినా 2022 వేసవిలోగా ఈ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ వినియోగంలోకి వచ్చే అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి:
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- ఏపీ డీజీపీ బదిలీ వివాదం: గౌతమ్ సవాంగ్‌ను హఠాత్తుగా ఎందుకు బదిలీ చేశారు, తెరవెనుక కారణాలేంటి?
- 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఘోస్ట్ సిటీ.. ‘భయానకం. కానీ, ఇదే వాస్తవం’
- యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)