You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫెర్టిలిటీ మిక్సప్: 30 ఏళ్ల కూతురిలో తమ జీన్స్ లేదని తెలుసుకున్న తల్లిదండ్రులు, ఆపై ఏం చేశారంటే
తండ్రి తాలూకూ డీఎన్‌ఏ లక్షణాలు, కూతురు డీఎన్‌ఏలో కనిపించకపోవడంతో అమెరికాకు చెందిన దంపతులు, అక్కడి సంతాన సాఫల్య కేంద్రం (ఫర్టిలిటీ సెంటర్)పై కేసు వేశారు.
తమ కూతురు జెస్సికా కోసం డీఎన్ఏ కిట్ కొనడంతో తాజాగా ఈ రహస్యం బయటపడిందని మైక్, జీనైన్ హార్వే దంపతులు వెల్లడించారు.
తండ్రి మైక్‌కు చెందిన ఇటాలియన్ వారసత్వమే తనలోనూ ఉందని నమ్మిన జెస్సికా, డీఎన్‌ఏ పరీక్షకు హాజరైంది. ఈ పరీక్ష ద్వారా ఆమెలో తండ్రి మూలాలు లేవని బహిర్గతమైంది.
మైక్ దంపతులు చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సదరు ఫెర్టిలిటీ క్లినిక్ పేర్కొంది.
తన 30వ పుట్టినరోజును ఇటలీలో జరుపుకుకొనేందుకు జెస్సికా ప్రణాళికలు వేసుకుంటోంది. ఆమె ఇటలీకి వెళ్లేకంటే ముందే, క్రిస్మస్ కానుకగా 'ఆన్సెస్ట్రీ.కామ్ డీఎన్‌ఏ టెస్టింగ్ కిట్'ను ఆమె తల్లిదండ్రులు కొనుగోలు చేశారు.
తమ దూరపు బంధువులను, చుట్టరికాలను కనుగొనడానికి ఈ డీఎన్‌ఏ ఫలితాలను ఉపయోగించుకోవాలని మైక్, జీనైన్ జంట ఎప్పటినుంచో అనుకుంటున్నారు.
కానీ వారిని ఈ పరీక్షా ఫలితాలు షాక్‌కు గురిచేశాయి.
''డీఎన్ఏ ఫలితం వచ్చినప్పుడు నేను సాధారణంగా పనిచేసే డెస్క్ దగ్గర కూర్చొన్నా. తెరచి చూస్తే... అక్కడ ఐరిష్, వెల్ష్, జర్మన్ కనబడుతున్నాయి. ఇటాలియన్ మూలాల కోసం నేను వెతుకుతున్నా.. కనీసం సిసిలియన్ అని అయినా ఉందేమో అని చూశా. కానీ అక్కడ లేదు? ఇదేంటి అని ఆశ్చర్యపోయా'' అని ఆమె యూఎస్ వార్తా సంస్థ సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
తన తండ్రికి, తనకు అసలు సంబంధమే లేదని... తామిద్దరి మధ్య ఉన్న బయోలాజికల్ సంబంధం 'సున్నా' శాతం అని పరీక్షల్లో తెలిసినట్లు ఆమె చెప్పారు.
1991లో ఒహియోలోని ఒక ఆసుపత్రిలో మైక్, జీనైన్ దంపతులు.... 'ఇంట్రాయుటెరిన్ ఇన్‌సెమినేషన్' (ఐయూఐ) అనే సంతానోత్పత్పి చికిత్సను చేయించుకున్నారు. దీంతో అదే ఏడాది వారు జెస్సికాకు జన్మినిచ్చారు.
ఈ సంతానోత్పత్తి చికిత్సలో, గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరచడానికి గర్భాశయంలోకి నేరుగా స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేస్తారు.
తమ సంతానోత్పత్తి చికిత్సలో ఏదో పొరపాటు జరిగినట్లు గడిచిన 30 ఏళ్లలో ఒక్కసారి కూడా తమకు అనుమానం రాలేదని వారు చెప్పారు.
డీఎన్‌ఏ పరీక్షా ఫలితం చూసిన తర్వాత, మాకు సంబంధం లేని మరొకరి జీవితంతో ముడిపడినట్లు అనిపిస్తోంది అని జీనైన్ హర్వే ఈ వారం ప్రారంభంలో ఒక వార్తా సమావేశంలో చెప్పారు.
''మీరు ఇన్నాళ్లు మీ సొంతమని భావించినది... మీరు నమ్మింది... ఏదీ నిజం కాదని తెలుసుకోవడం, వివరించడం చాలా కష్టం'' అని మైక్ చెప్పారు.
ఎవరో అపరిచితుని జన్యుపదార్థాన్ని తీసుకొచ్చి జీనైన్ హ్యారీ గర్భంలో ప్రవేశపెట్టారని సుమ్మా హెల్త్ సిస్టమ్ ఆసుపత్రిపై, వైద్యుడు నికోలస్ స్పిర్టోస్‌పై నమోదు చేసిన దావాలో మైక్, జీనైన్ దంపతులు ఆరోపించారు.
అలాగే జెస్సికాకు చెందిన జీవసంబంధ లక్షణాలున్న తండ్రిని (బయోలాజికల్ ఫాదర్) కూడా తాము గుర్తించినట్లు ఆ దావాలో వీరు పేర్కొన్నారు. తాము చికిత్స తీసుకున్న సమయంలో, అదే ఆసుపత్రిలో ఆయన కూడా సంతాన సాఫల్య చికిత్సను తీసుకున్నారని దావాలో తెలిపారు.
తన బయోలాజికల్ ఫాదర్‌తో కూడా మాట్లాడినట్లు జెస్సికా తెలిపారు. ఎట్టకేలకు తనకు కూడా ఒక బిడ్డ పుట్టిందని తెలుసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని అతను తనతో అన్నట్లు జెస్సికా పేర్కొన్నారు.
''ఈ ఆరోపణను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆ కుటుంబంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో మేం అర్థం చేసుకున్నాం. మేం ఇంకా ఆ కుటుంబాన్ని కలవలేదు. ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు'' అని సీబీఎస్ న్యూస్‌తో సుమ్మా హెల్త్ సిస్టమ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఫెర్టిలిటీ చికిత్స సందర్భంగా ఇలాంటి పొరపాట్లు జరగడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కాలిఫోర్నియాకు చెందిన దంపతులు కూడా 2019లో తమకు జన్మించిన బిడ్డకు తమకు ఎలాంటి పోలికలు లేవని పేర్కొంటూ సదరు ఆసుపత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐవీఎఫ్ చికిత్స ద్వారా వారు బిడ్డను పొందారు.
డీఎన్ఏ పరీక్ష ద్వారా తమ బిడ్డ ఎవరి గర్భంలో పెరిగిందో తెలుసుకున్నారు. ఆ దంపతులతో చర్చించి బిడ్డలను మార్చుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రధాని మోదీ పర్యటనలో కనిపించని కేసీఆర్, బీజేపీ నేతల విమర్శలు
- 600 రోజులుగా జూమ్‌లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది
- WORDLE: ఈ సరదా గేమ్ మరో సుడోకు అవుతుందా?
- కొండబడి: "9 గూడెంలలో ఒక్కడే పదోతరగతి వరకూ వెళ్లాడు.. దీంతో బడే గూడెంకు వెళ్లింది" కొండబడి: "9 గూడెంలలో ఒక్కడే పదోతరగతి వరకూ వెళ్లాడు.. దీంతో బడే గూడెంకు వెళ్లింది"
- ధర్మ సంసద్: రెండు సభలు, ఒకే రకమైన తీవ్రమైన ఆరోపణలు, రెండు రాష్ట్రాల చర్యల్లో తేడా ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)