5జీ సిగ్నళ్లతో విమాన ప్రమాదాలు జరుగుతాయా

వీడియో క్యాప్షన్, 5జీ సిగ్నళ్లతో విమాన ప్రమాదాలు జరుగుతాయా

అమెరికాలోని ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ సంస్థలు 'ఏటీ అండ్ టీ', 'వెరైజోన్ ' కొన్ని విమానాశ్రయాలలో తమ 5జీ సేవల విస్తరణను వాయిదా వేయడానికి అంగీకరించాయి.

బుధవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్థల 5జీ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. గతంలో కూడా ఇది రెండుసార్లు వాయిదా పడింది.

ఈ కొత్త సాంకేతికత వల్ల వేలాది విమానాలు ఆలస్యం అవుతాయని అమెరికాకు చెందిన పది ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు చెబుతున్నాయి.

5జీ అనేది మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ తదుపరి తరం. దీనివల్ల మరింత వేగంగా డేటాను డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ పరికరాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.

ఈ టెక్నాలజీ ఎక్కువగా రేడియో సిగ్నల్స్‌పై ఆధారపడుతుంది. అమెరికాలో, 5జీ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీలు 'సీబ్యాండ్' స్పెక్ట్రమ్‌లో భాగంగా ఉన్నాయి.

5జీలో వాడే రేడియో తరంగాలు, విమానాల్లోని రేడియో ఆల్టీమీటర్లలో ఉపయోగించే తరంగాలకు దగ్గరగా ఉంటాయి. అల్టీ మీటర్ల ద్వారా భూమి నుంచి విమానం ఎత్తును కొలుస్తారు. భద్రత, నావిగేషన్ సిస్టమ్‌ల డేటా కోసం వీటిని వాడతారు.

5జీ స్పెక్ట్రమ్‌లో వాడే రేడియో తరంగాల వల్ల విమానాల్లోని ఈ పరికరాల పనితీరుకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)