ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న జుగాడ్ జీప్.. ఎక్స్ఛేంజ్ కింద బొలెరో వాహనాన్ని ఇస్తానన్న పారిశ్రామికవేత్త- News Reel

జుగాడ్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సృష్టించే వారికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ.. తరచూ ట్వీట్లు చేసే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను తాజాగా ఈ 'జీప్' భలే ఆకట్టుకుంది.

మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకు కోరిక తీర్చేందుకు తుక్కుతో ఈ జీపును తయారు చేశారు. ఈ జీపుపై అయిదుగురు ప్రయాణిస్తుండగా తీసిన వీడియో వైరల్ అయింది. దానిని చూసిన ఆనంద్ మహీంద్రా, ఆ జీపును తమకు ఇచ్చేస్తే, ఎక్స్ఛేంజ్ కింద మహింద్రా బొలెరో వాహనాన్ని ఇస్తానని ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

మియన్మార్‌: పచ్చరాళ్ళ గనిలో పెను ప్రమాదం, 100 మంది గల్లంతు

మియన్మార్‌లోని పచ్చరాళ్ల గనిలో భారీ మట్టి పెళ్లలు విరిగిపడటంతో దాదాపు 100 మంది గల్లంతయ్యారు.

గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు సమీపంలోని కుంటలో గాలిస్తున్నాయి. ఒకరు చనిపోయినట్టు నిర్ధరించారు.

ఉత్తర కాచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ ప్రాంతంలో, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 4 గంటలకు ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద పచ్చరాళ్ల గనులు మియన్మార్‌లో ఉన్నాయి. వీటి వ్యాపారం ఏటా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది.

వేలాది మంది ప్రజలు ఈ గనుల వ్యర్థాల్లో పచ్చరాళ్ల కోసం వెతుకుతూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇక్కడి గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

"25 మంది గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించాం. ఒకరి శవం దొరికింది" అని రెస్క్యూ టీమ్ సభ్యుడు కోనై చెప్పారు. 100 మంది వరకు గల్లంతయ్యారని కోనై చెప్పారు.

ఎత్తైన కుప్పల మీద ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదమని తెలిసినా కొందరు కుప్ప కిందకు దిగుతుంటారు. పై నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు జారిపడినప్పుడు పైన, కింద ఉండేవాళ్లు తీవ్రంగా గాయపడుతుంటారు.

హాకీ: ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి భారత జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో భారత్‌ జట్టు జపాన్‌ చేతిలో ఓడిపోయింది. అయితే మూడో స్థానం కోసం భారత్-పాక్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 4-3తో పాకిస్తాన్ పై గెలిచింది.

పెనాల్టీ కార్నర్‌ ద్వారా హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించారు. అయితే, ఆ వెంటనే పాకిస్తాన్ గోల్ చేయడంతో స్కోర్ సమం అయ్యింది. మొదటి హాఫ్ వరకు స్కోరు 1-1 కొనసాగింది. రెండో హాఫ్‌లో పాక్‌ గోల్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లడంతో స్కోరు 2-1కు చేరింది. తర్వాత భారత్ కూడా ఒక గోల్ చేసి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్‌లో భారత్‌ రెండు గోల్స్‌ చేయగా, పాకిస్తాన్‌ ఒక గోల్‌ చేసింది. దీంతో భారత్ 4-3 తేడాతో విజయం సాధించింది.

గ్రూప్‌ మ్యాచ్‌లో కూడా పాకిస్తాన్ పై భారత జట్టు విజయం సాధించింది. మరోవైపు జపాన్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయింది. అయితే సెమీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)