బార్బడోస్: రాణి పాలనకు స్వస్తి... గణతంత్ర దేశంగా ఆవిర్భావం

బార్బడోస్ మంగళవారం కొత్త గణతంత్ర దేశంగా మారింది. దీంతో ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ పాలన నుంచి బార్బడోస్ బయటకు వచ్చినట్లయింది.

కరీబియన్ ద్వీపానికి ఇది ఒక చరిత్రాత్మక రోజు. ''మన వలస గతాన్ని పూర్తిగా విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది'' అని బార్బడోస్ ప్రధానమంత్రి మియా మోట్లీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

బార్బడోస్‌లోని నేషనల్ హీరోస్ స్క్వేర్‌లో జరిగిన అప్పగింత కార్యక్రమానికి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ హాజరయ్యారు. క్వీన్ ఎలిజబెత్ ప్రతినిధిగా ఆయన అక్కడికి వెళ్లారు. బ్రిటీష్ సామ్రాజ్య మూలాలున్న కామన్వెల్త్ దేశాల్లో బార్బడోస్ కూడా కొనసాగుతుంది.

బార్బడోస్ కొత్త రిపబ్లిక్ దేశంగా ఏర్పాటైనప్పటికీ, బ్రిటీష్ సామ్రాజ్య మూలాలున్న 53 భూభాగాలతో కూడిన కామన్వెల్త్ కమ్యూనిటీలో ఒకటిగా కొనసాగుతుంది.

ఈ కమ్యూనిటీలో 15 దేశాలకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ సార్వభౌమాధికారిగా వ్యవహరిస్తారు. సోమవారం వరకు బార్బడోస్‌ కూడా ఆమె పాలనలోనే ఉంది.

ఎలిజబెత్ రాణిగా ఉన్న భూభాగాలు 15000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయి. ఇవి లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను, చిన్న ద్వీపం తువలు నుంచి వేరు చేస్తాయి. తువలు అనేది రాణి పాలనలో ఉన్న మారుమూల ప్రాంతం.

రెండో ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటీష్ పాలనలో ఉన్న చాలా దేశాలు, కాలనీలు స్వాతంత్ర్యాన్ని పొందినప్పటికీ, అందులోని చాలా దేశాలు రాజ్యాంగ రాచరిక దేశాలుగా మారాయి. ఇవి తమ దేశాధినేతగా రాణి ఎలిజబెత్‌ను భావిస్తాయి.

అమెరికా ఖండంలో ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి. ఇందులో చాలావరకు కరీబియన్ ద్వీపాలు. ఈ గ్రహం మీద రెండో అతిపెద్ద రాష్ట్రం, అమెరికాలో అత్యంత పెద్దదైన కెనడా కూడా ఈ జాబితాలో ఉంది.

మిగిలినవి ఆంటిగ్వా బార్బుడా, బహమాస్, బెలిజ్, గ్రెనడా, జమైకా, సెయింట్ కీట్స్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్.

బ్రిటీష్ మోనార్క్ అనేది కామన్వెల్త్‌లోని 53 దేశాల స్వేచ్ఛకు చిహ్నం. ఈ కామన్వెల్త్ సమూహంలో సభ్యులుగా ఉన్న దేశాలు రాణి ఎలిజబెత్‌కు లొంగిఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ దేశాలు రాణిని, తమ ప్రధాన రాజకీయ వ్యక్తిగా భావిస్తాయి.

కాలనీలు, భూభాగాలు

పైన పేర్కొన్న దేశాలకు మనం ''బ్రిటీష్ ఓవర్సీస్ టెరిటరీస్‌'' అని పిలవబడే భూభాగాలను కూడా జోడించాలి. బ్రిటీష్ ఓవర్సీస్ టెరిటరీస్ అనేవి ఇంకా స్వతంత్రంగా మారని భూభాగాల సమూహం.

పశ్చిమార్థగోళంలోని మాల్వినాస్/ఫాక్‌ల్యాండ్స్, ఆంగ్యులా, బెర్ముడా, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, కేమాన్ ఐలాండ్స్, మోంట్‌సెరాట్, టర్క్స్, కైకస్ ఐల్యాండ్స్ ఈ జాబితాలో ఉన్నాయి.

రాజ్యాంగబద్ధ రాచరిక దేశాల్లో, దేశాధినేతగా రాణి ఎలిజబెత్‌కు గౌరవహోదా దక్కుతుంది. ఆమె ప్రతినిధిగా ఉంటారు. ఆమె పాత్ర, ఆయా దేశాల న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.

కానీ ఒకానొక సమయంలో రాణి ఎలిజబెత్, ఒక దేశాన్ని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొన్నారు.

''దేశాధినేతగా క్వీన్‌ను తప్పించి ఆమె స్థానంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌ను నియమించడానికి'' రాజ్యాంగ సవరణను ఆమోదించాలని 2016లో జమైకా గవర్నర్ ప్యాట్రిక్ అలెన్ ప్రతిపాదించారు.

కానీ ఆ సవరణ జరగనంతకాలం ఎలిజబెత్, యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు మిగిలిన ఇతర 15 దేశాలకు రాణిగా కొనసాగుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)