కోవిడ్ వ్యాక్సీన్: రెండు డోసులు తీసుకున్న వారి నుంచి కూడా వైరస్ వ్యాపిస్తోందా?

వ్యాక్సీన్ రెండు డోసులు వేసుకున్న తరువాత కూడా జనం కోవిడ్-19 బారిన పడుతున్నారు. అలా వైరస్ బారిన పడిన వారు అది తమ ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యులకు అంటుకోవడానికి కారణం కావచ్చు.

బ్రిటన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం తర్వాత నిపుణులు ఈ ప్రమాదం గురించి హెచ్చరికలు చేస్తున్నారు.

టీకా వేయించుకోని వారు వైరస్‌ వ్యాపించడానికి ఎంత కారణం అవుతారో, వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్న వారు కూడా అలాగే మారుతారు.

టీకా వేసుకున్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, లేదంటే తక్కువగా కనిపిస్తూ ఉండచ్చు. కానీ, వాళ్లు తమ ఇంట్లో వ్యాక్సీన్ వేసుకోని వారికి ఆ ఇన్ఫెక్షన్ వచ్చేలా చేయవచ్చు. అలా జరిగే అవకాశం 38 శాతం ఉంటుందని తేలింది.

ఇంట్లోని వారు టీకా రెండు డోసులు వేయించుకుని ఉన్నట్లయితే ఈ అవకాశం 25 శాతానికి తగ్గుతుంది.

వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సీన్ వేయడం ఎందుకు ముఖ్యమో తాము చేసిన లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అధ్యయనంలో గమనించామని చెబుతున్నారు.

టీకాలు తీసుకోని వారు, తమను కాపాడుకోవడానికి తమ చుట్టూ వ్యాక్సీన్ వేసుకున్నవారిపై ఆధారపడడం వల్ల ఉపయోగం లేదని వారు హెచ్చరిస్తున్నారు.

టీకా ఎంత వరకు ఉపయోగం?

కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రం కాకుండా, దానివల్ల చనిపోయే ప్రమాదం లేకుండా చేయడంలోనే టీకా ఉపయోగపడుతుంది. కానీ, కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి మాత్రం ఉపయోగపడదు.

ముఖ్యంగా బ్రిటన్‌లో అధికంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ లాంటి వాటిని టీకా అడ్డుకోలేక పోవచ్చు. కాలక్రమేణా వ్యాక్సీన్ ద్వారా వల్ల లభించే రక్షణ కూడా తగ్గిపోతుంది. దానిని పెంచుకోడానికి బూస్టర్ డోస్ అవసరం అవుతుంది.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో. ఇంట్లో ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ అధ్యయనం 2020 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ మధ్యలో లండన్, బోల్టన్‌లోని 440 ఇళ్లలో నిర్వహించారు. ఆ ఇళ్లలో ఉన్న సభ్యులకు పీసీఆర్ టెస్టులు చేశారు.

అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం...

వ్యాక్సీన్ వేసుకోనివారితో పోలిస్తే, వ్యాక్సీన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ.

టీకా రెండు డోసులు వేసుకున్న వారు కూడా ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు

కానీ, వ్యాక్సీన్ తీసుకున్న వారిలో వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. అయితే, వారిలో వైరల్ లోడ్ అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ టీకా వేసుకోని వారిలో ఉన్నట్లే ఉంటుంది.

దీనిని బట్టి వారి ద్వారా ఆ ఇంట్లో టీకా వేసుకోని మిగతా సభ్యులకు వైరస్‌ ఎంత సులభంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

చలికాలంలో మరింత ప్రమాదం

"వ్యాక్సీన్ వేసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, అప్పటి వరకూ టీకా వేసుకోని వారు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా, తీవ్రంగా జబ్బు పడకుండా ఉండాలంటే వారు త్వరగా టీకా వేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలికాలంలో అందరూ వీలైనంత ఎక్కువగా ఇళ్లలోనే ఉంటారు" అని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూకే ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ అజిత్ లాల్వానీ చెప్పారు.

"రెండో డోసు వేసుకున్న కొన్ని నెలలకే ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం మళ్లీ పెరుగుతుందని మేం ఈ అధ్యయనంలో గుర్తించాం. అందుకే అర్హులైన వారు వెంటనే బూస్టర్ డోస్ వేయించుకోవాలి" అని తెలిపారు.

"కొత్త వేరియంట్ల నేపథ్యంలో మా అధ్యయనంలో వెల్లడైన ఫలితాలు టీకా ప్రభావం గురించి కీలక సమాచారం వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా, వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా కరోనా కేసులు పెరగడానికి డెల్టా వేరియంట్ ఎందుకు కారణం అవుతుంది అనేది ఈ రీసెర్చ్ చెబుతోంది’’ అని ఈ అధ్యయనం సహ రచయిత ఇంపీరియల్ డాక్టర్ అనికా సింగనాయగమ్ అన్నారు.

"కరోనా ఇన్ఫెక్షన్‌కు కళ్లెం వేయాలంటే, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, టెస్టింగ్ లాంటి వాటికి ఇప్పటికీ అంతే ప్రాధాన్యం ఉంది. వ్యాక్సీన్ వేసుకున్న తర్వాత కూడా మీరు ఇవన్నీ కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి" అని అనికా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)