మొజాంబిక్‌: దంతాలు లేని ఏనుగుల సంఖ్య పెరుగుతోంది.. కారణమేంటి?

మొజాంబిక్‌లోని గొరంగోసా నేషనల్ పార్క్‌లో ఒకప్పుడు కొన్ని ఏనుగులు మాత్రమే దంతాలు లేకుండా ఉండేవి. అయితే, ఇప్పుడు వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఇక్కడి అంతర్యుద్ధానికి డబ్బులు సమకూర్చుకునేందుకు దంతాల కోసం ఏనుగులను వేటాడటంతో, అవి పరిణామం చెందాయని సైన్స్ మ్యాగజైన్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం చెబుతోంది.

అంతర్యుద్ధానికి ముందు, ఇక్కడ 18.5శాతం ఆడ ఏనుగులకు దంతాలు ఉండేవి కాదు.

అయితే, 1990ల తర్వాత పుట్టిన ఏనుగుల్లో దంతాలు లేనివి 33 శాతం వరకు ఉన్నాయి.

1977 నుంచి 1992 మధ్య మొజాంబిక్‌లో అంతర్యుద్ధం చెలరేగింది. ప్రభుత్వ దళాలు, కమ్యూనిస్టు వ్యతిరేక దళాల మధ్య భారీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఈ రెండు దళాలు డబ్బుల కోసం ఏనుగు దంతాలను విక్రయించేవి. దీంతో మొజాంబిక్‌లోని 90 శాతం ఏనుగులు కనుమరుగు అయ్యాయి.

అంతర్యుద్ధ సమయంలో దంతాలు లేని ఏనుగులను వదిలిపెట్టేవారు. దీంతో ఇవి ఇతర ఏనుగులతో కలిసి దంతాలులేని ఏనుగు పిల్లలకు జన్మనిచ్చి ఉండొచ్చు.

ప్రస్తుతం దంతాలున్న వాటితోపాటు దంతాలులేని ఏనుగుల జన్యువులనూ పరిశోధకులు విశ్లేషించారు. ఆడ ఏనుగుల్లో ఎక్కువగా కనిపించే ఈ లక్షణానికి (దంతాలు లేకపోవడం) ఎక్స్ క్రోమోజోమ్‌లో ఒక ఉత్పరివర్తనంతో సంబంధముందని తేలింది. కడుపులో ఉన్నప్పుడు ఈ క్రోమోజోమ్ మగ ఏనుగు పిల్లలకు ప్రాణాంతకంగా మారుతుందని వెల్లడైంది.

ఇలాంటి పరివర్తనంతో దీర్ఘకాలంలో ఈ జంతువులపై దుష్ప్రభావాలు చూపే అవకాశముందని అధ్యయనకర్తల్లో ఒకరైన ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రింగిల్ వివరించారు.

‘‘దంతాలు లేకపోవడమనే లక్షణంతో సంబంధమున్న క్రోమోజోమ్‌.. మగ ఏనుగు పిల్లలకు ప్రాణాంతకంగా మారడంతో, మొత్తంగా పుట్టే ఏనుగు పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో ఈ ఏనుగులు మళ్లీ మునుపటి సంఖ్యకు చేరుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు కేవలం అక్కడ 700 ఏనుగులు మాత్రమే ఉన్నాయి’’అని ఆయన అన్నారు.

‘‘దంతాలు లేకపోవడంతో అంతర్యుద్ధ సమయంలో మంచే జరుగుండొచ్చు. కానీ ఆ లక్షణం వల్ల అంతే మూల్యం కూడా చెల్లించుకోవాల్సి రావొచ్చు’’

మరోవైపు దంతాలు ఉండే ఏనుగులతో పోలిస్తే దంతాలు లేనివి భిన్నంగా ఆహారాన్ని తీసుకుంటున్నట్లు కూడా తాజా అధ్యయనంలో తేలింది.

అయితే, దీర్ఘకాలంలో మళ్లీ దంతాలుండే ఏనుగుల సంఖ్యను పెంచొచ్చని ప్రింగిల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)