అగ్నిపర్వతం: లావా సముద్రంలో కలిస్తే ఏమవుతుంది

సముద్రంలో లావా కలిసినప్పుడు, అదొక సుందర దృశ్యంగా కనిపించొచ్చు. కానీ అది ప్రాణాంతకం కూడా కావొచ్చు.

అక్కడ విడుదలయ్యే వాయువులు విషపూరితమైనవి. నీరు సలసలా కాగుతుంటుంది.

స్పానిష్ కెనరీ ద్వీపం లా పామాలోని కంబ్రే వియజా అగ్నిపర్వతంలో నుంచి విడుదలైన లావా, అట్లాంటిక్ సముద్రంలో కలిసినప్పుడు కూడా సరిగ్గా ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది.

కరిగిన శిలల ఎర్రటి లావా ప్రవాహాలు నీటిలో కలిసే ముందు డెల్టాను ఏర్పరుస్తాయి. నీటిలో లావా కలిసిన తర్వాత పెద్ద ఎత్తున వాయువులు వెలువడుతాయి. ఆ వాయువులతో పాటు రాళ్లు కూడా 250 మీటర్ల దూరం వరకు ఎగిరిపడుతుంటాయి.

హానికరమైన వాయువులు

సముద్రంలో ప్రవేశించే లావా ప్రమాదాలను సృష్టించగలదు. దానికి దగ్గరగా ఉన్న వ్యక్తులను గతంలో తీవ్రంగా గాయపరిచినట్లు లేదా వారి మరణానికి కారణమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యుఎస్‌జీఎస్) తెలిపింది.

వేడిగా ఉండే మాగ్మా (కరిగిన రాతి/శిలాద్రవం), చల్లటి నీటి కలయిక హానికరమైన దట్టమైన పొగను సృష్టిస్తుంది.

"మాగ్మా సముద్రంలో కలిసినప్పుడు, అది ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో ఉప్పు నీరు ఆవిరైపోతుంది. దీనికి కారణం ఉష్ణోగ్రతలలో ఉన్న భారీ వ్యత్యాసం. లావాలో 900 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉంటుంది. నీటి ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరలో ఉంటుంది" అని కెనరీ ద్వీపంలోని లాస్ పల్మాస్ డి గ్రాన్ కనేరియా విశ్వవిద్యాలయంలో జియాలజీ ప్రొఫెసర్ జోస్ మంగాస్ చెప్పారు.

"నీటిలో క్లోరైడ్స్, సల్ఫేట్లు, కార్బోనేట్లు, ఫ్లోరైడ్, అయోడిన్ తదితరాలు ఉంటాయి. దీంతో విషపూరిత వాయువులు కూడా అస్థిరంగా మారి, మరింత పెరుగుతాయి" అని మంగాస్ బీబీసీకి చెప్పారు.

ఈ వాయువులు చర్మం, కళ్లు, శ్వాసకోశాలకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇందుకు హవాయి అగ్నిపర్వతాలకు దగ్గరగా ఉన్న సముద్ర ప్రాంతాలను మంగాస్ ఉదాహరణగా చెప్పారు. ఇక్కడ అనుకోకుండా విష వాయువులు పీల్చుకుని చనిపోయిన సందర్శకులు చాలా మంది ఉన్నారని తెలిపారు.

ఈ వాయువుల వల్ల సమీప ప్రాంతాలలో దుర్వాసన వస్తుంది. కానీ అది మెల్లగా తగ్గిపోతుంది.

హవాయిలోని కిలౌయా అగ్నిపర్వతం నుండి ప్రవహిస్తున్న లావా కపోహో బే వద్ద సముద్రంలో కలవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చెలరేగుతున్న దట్టమైన పొగను చూడొచ్చు.

ఎగిరే రాళ్లు, పేలుళ్లు

సముద్ర వాలు వెంట లావా ఏర్పడటం, అస్థిర డెల్టాను సృష్టించడం వల్ల మరొక ప్రమాదం పొంచి ఉంటుంది. నీటితో లావా వేగంగా చల్లబడినప్పుడు, డెల్టా విచ్ఛిన్నమై కుప్పకూలుతుంది. కొన్నిసార్లు ఈ పేలుళ్లతో లావా, రాళ్ల ముక్కలు భూమి లేదా సముద్రం వైపు ఎగిరిపడతాయి.

డెల్టా కూలిపోయే సమయం లేదా పరిమాణాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేయలేరు.

యుఎస్‌జీఎస్ ప్రకారం, లావా సముద్రంలో కలిసే ప్రదేశానికి ప్రజలు కనీసం 300 మీటర్ల దూరంలో ఉండాలి. వారు పడవల్లో ఉన్నప్పటికీ ఈ దూరాన్ని పాటించాలి. గతంలో విస్పోటనం సమయంలో శిలలు, శకలాలు ఇంతే దూరం లోపల పడేవి.

డెల్టా విచ్ఛిన్నమైనప్పుడు శిలల లోపల దాగి ఉన్న విష వాయువులు విడుదలయ్యే అవకాశం ఉందని నేషనల్ జియోగ్రాఫిక్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిడాడ్ కాంప్లూటెన్స్ డి మాడ్రిడ్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నహెక్టర్ లామోల్డా ఆర్డెజ్ పేర్కొన్నారు.

యుఎస్‌జీఎస్ ప్రకారం, లావా ఏర్పరచిన డెల్టాలు మామూలుగా చూస్తే స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ, అవి చాలా సున్నితంగా ఉంటాయి.

1993లో హవాయిలో డెల్టా కూలి, ఓ ఫొటోగ్రాఫర్ సముద్రంలోకి పడిపోయారు. ఆయన ఆచూకీ దొరకలేదు.

ఎగిసిపడుతున్న వేడి రాళ్లు, లావా, శిథిలాల నుంచి పారిపోయే ప్రయత్నంలో డజన్ల కొద్దీ సందర్శకులు గాయాల పాలయ్యారు.

2018లో, హవాయిలో, బేస్ బాల్ సైజులో ఉన్న లావా పర్యాటకుల పడవ పైకప్పుకు తగలడంతో 23 మంది గాయపడ్డారు.

స్కాల్డింగ్ తరంగాలు

లావా డెల్టా ఉపరితలంపై ఉండే నీళ్లు కూడా తక్కువ ప్రమాదకరమైనవి కావు.

గతంలో ఆ ప్రాంతాలకు దగ్గర నిల్చున్న వ్యక్తులకు నీరు, ఆవిరి వల్ల రెండో డిగ్రీ స్థాయి కాలిన గాయాలయ్యాయని యుఎస్‌జీఎస్ తెలిపింది.

డెల్టా కూలిపోతే ఏర్పడే అలల వల్ల ఆ ప్రాంతంలోని పడవలకు ప్రమాదం పొంచి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

బీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)