విరాట్‌ కోహ్లీ: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో బెంగళూరు ఓటమి: ప్రెస్ రివ్యూ

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసిందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

విరాట్‌ కోహ్లీ చివరి కెప్టెన్సీలోనూ ఈ జట్టు రాత మారలేదు. ఆరంభ మ్యాచ్‌ల్లో చూపిన జోరును అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పునరావృతం చేయలేకపోయింది.

అయితే వారి ఓటమికి ప్రధాన కారణం కోల్‌కతా స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (4-0-21-4, 15 బంతుల్లో 3 సిక్సర్లతో 26) ఆల్‌రౌండ్‌ షో.

ఆర్‌సీబీ ప్రధాన బ్యాట్స్‌మెన్ భరత్‌, కోహ్లీ, డివిల్లీర్స్‌, మ్యాక్స్‌వెల్‌ వికెట్లను తీసిన నరైన్‌.. బ్యాటింగ్‌లోనూ చేసిన పరుగులే కీలకమయ్యాయి.

దీంతో సోమవారం జరిగిన ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. బుధవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో దిల్లీతో మోర్గాన్‌ సేన తలపడుతుంది.

గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్లో తలపడుతుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు చేసింది.

కోహ్లీ (39), దేవ్‌దత్‌ (21) ఓ మాదిరిగా రాణించారు. ఫెర్గూసన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసి గెలిచింది. సిరాజ్‌, హర్షల్‌, చాహల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నరైన్‌ నిలిచాడని పత్రిక వివరించింది.

సమంతను సోదరిలా భావిస్తా, నాగచైతన్యకూ తెలుసు: ప్రీతమ్ జుకాల్కర్

సమంతతో ఎఫైర్ ఉందని వస్తున్న వార్తలపై స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ స్పందించారని ఆంధ్రజ్యోతి పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

స్టయిలిస్ట్‌ ప్రీతమ్‌ జుకాల్కర్‌తో సమంతకు ఎఫైర్‌ ఉందని సోషల్‌, వెబ్‌ మీడియాలో విసృతంగా వదంతులు వచ్చాయని పత్రిక చెప్పింది. దాంతో ప్రీతమ్‌ జుకాల్కర్‌ స్పందించక తప్పలేదని కథనంలో రాశారు.

''సమంతను సోదరిలా భావిస్తా. తనను జీజీ అని పిలుస్తా. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అటువంటి మా మధ్య సంబంధం ఎలా అంటగడతారు? సమంతకు ఐలవ్యూ ఎలా చెప్పావని నన్ను కామెంట్‌ చేస్తున్నారు. సిస్టర్‌ మీద ప్రేమను వ్యక్తం చేయకూడదా?

నాగచైతన్య నాకు కొన్నేళ్లుగా తెలుసు. సమంతకు, నాకు మధ్య ఉన్న అనుబంధం కూడా తెలుసు. మా గురించి అలా కామెంట్‌ చేయవద్దని చెబుతాడని ఆశించా.

అతడు ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసినా ఎంతో మార్పు వస్తుంది. వదంతులు వ్యాప్తి చేస్తున్న అభిమానులు చైతన్య చెబితే తప్ప ఆగరు'' అని ప్రీతమ్‌ జుకాల్కర్‌ ఆ ఆంగ్ల పత్రికతో చెప్పారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

ఇంటి నుంచి బయట అడుగుపెడితే చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆవేదన చెందారని ఆంధ్రజ్యోతి వివరించింది.

అమ్మ ఒడికి 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి

2022 నుంచి అమ్మ ఒడి పథకానికి విద్యార్థుల హాజరును అనుసంధానం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారని సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.

పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే 'అమ్మ ఒడి' పథకం ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆ దిశగా తల్లులు, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తెచ్చామని, విద్యాకానుకను కూడా అమలు చేస్తున్నామని, వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15 వేలకుపైగా పాఠశాలలను మౌలిక వసతులతో తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి తెలిపారు.

అమ్మ ఒడి పథకం స్ఫూర్తి కొనసాగేలా పిల్లలంతా బడి బాట పట్టాలన్నారు. పాఠశాలల నిర్వహణ, విద్యార్ధుల హాజరు, అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలపై సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విస్త్రృత స్థాయి సమీక్ష నిర్వహించారని పత్రిక రాసింది.

అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75% హాజరు ఉండాలన్న నిబంధన గతంలోనే విధించామని, అయితే కోవిడ్‌ వల్ల ఇన్నాళ్లూ అమలు చేయలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చెప్పారు.

కోవిడ్‌ రెండో వేవ్‌ రావడంతో పరీక్షలే నిర్వహించలేని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఈ ఏడాది కూడా జూన్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

2022 నుంచి 'అమ్మ ఒడి' పథకానికి విద్యార్ధులహాజరును అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పిల్లలను చదువుల బాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ఉద్దేశమని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలనే 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే మనం నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు.

ఈ విద్యా సంవత్సరం (2021-22)లో 75 శాతం హాజరు నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారని సాక్షి వివరించింది.

డబ్బు లేకపోతే లాక్ ఎందుకు - నోట్ రాసిన దొంగ

కలెక్టర్ ఇంటికే కన్నం వేసిన ఒక దొంగ ఇంట్లో పెద్దగా డబ్బు దొరక్కపోవడంతో, లోపల ఏం లేనప్పుడు లాక్ ఎందుకు వేశారని నోట్ పెట్టినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.

తాళంవేసిన ఓ ప్రభుత్వాధికారి ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ భారీ మొత్తంలో డబ్బును దోచుకుందామనుకున్నాడు. అయితే, ఆ ఇంట్లో కొంత డబ్బే అతడికి దొరికింది.

దీంతో నిరాశకు గురైన ఆ చోరుడు.. ఏకంగా ఆ అధికారికే ఓ లేఖ రాసిపెట్టి వెళ్లాడు. ఆ లేఖను సోమవారం స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాకు విడుదల చేశారు.

ఇంతకీ దొంగ రాసిన ఆ లేఖలో ఏమున్నదంటే.. 'జబ్‌ పైసే నహీ థే.. తో.. లాక్‌ నహీ కర్నా కలెక్టర్‌ (కలెక్టర్‌ గారూ.. ఇంట్లో డబ్బు లేనప్పుడు.. ఇంటికి తాళం వేయకూడదు) అని రాసి ఉంది.

ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ త్రిలోచన్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా సింగ్‌ ఇంట్లో నుంచి వెళ్తూ ఆ దొంగ రూ.30 వేల నగదు, కొన్ని నగలను తీసుకుపోయినట్టు పోలీసులు తెలిపారని నమస్తే తెలంగాణ రాసింది.

గత జన్మ గుర్తొచ్చింది సెలవు కావాలన్న ఇంజనీర్

మధ్యప్రదేశ్‌లో ఒక సబ్ ఇంజనీర్ తనకు గత జన్మ గుర్తొచ్చిందని సెలవు కావాలని ఉన్నతాధికారులను అడిగాడని ఈనాడు దిన పత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.

మధ్యప్రదేశ్‌లో ఓ సబ్ ఇంజినీర్ వింత కారణాలతో ప్రతి ఆదివారం 'డే ఆఫ్' కావాలని తన పైఅధికారులను అభ్యర్థించారు. ఆ దరఖాస్తులో ఆయన పేర్కొన్న అంశాలను చూడగా విస్తుపోవడం వారి వంతైంది.

అగర్ మాల్వా జిల్లాలోని సంశేర్ జనపద్ పంచాయతీ చీఫ్‌కు .. సబ్ ఇంజినీర్ రాజ్ కుమార్ యాదవ్ ఈ లేఖ రాశారు.

అందులో తనకు కొద్దిరోజుల క్రితమే గత జన్మ గురించి తెలిసిందని చెప్పారు. తన జీవిత రహస్యాన్ని కనుగొనడానికి, ఆత్మను శోధించేందుకు ఉపయోగపడేలా ప్రతి ఆదివారం తనకు 'డే ఆఫ్' ఇవ్వాలని కోరారని పత్రిక చెప్పింది.

"నా గత జన్మలో ప్రస్తుత ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. పాండవుల్లో ఒకరైన నకులుడు. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. నా గత జన్మ గురించి తెలిశాక.. ఇకపై నేను నా జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. శాశ్వతమైన ఆత్మ కోసం శోధించాలనుకుంటున్నాను." అని రాశాడని తెలిపింది.

తాను ఈ లేఖ రాసింది నిజమేనని విలేకర్లతో రాజ్‌కుమార్ యాదవ్ ఆదివారం తెలిపారు. ఇటీవల తనకు వచ్చిన కల ద్వారా గత జన్మ జ్ఞాపకాలు తెలిశాయని చెప్పారు.

"ఆదివారం సెలవు రోజైనా మమ్మల్ని తరచూ డ్యూటీకి హాజరు కావాలని పిలుస్తారు. కానీ ఆ రోజు నేను ఆత్మశోధన చేయాలనుకుంటున్నాను. అందుకే ఆదివారం నాకు సెలవు కావాలని కోరుతూ లేఖ రాశాను" అని రాజ్‌కుమార్ యాదవ్ చెప్పారని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)