You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచంలో అత్యంత అందమైన దోమ ఇదేనా?
- రచయిత, జోనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
మీరు దీని అందాన్ని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
ఈ అద్భుతమైన దోమ.. అందమైన ఈకలతో ఉన్న కాళ్లు, ప్రకాశవంతమైన రంగులతో మెరుస్తూ మైమరిపించేలా ఉంటుంది.
మధ్య, దక్షిణ అమెరికాలో కనిపించే సబతేస్ జాతి దోమల్లో ఇది ఒకటి.
ప్రత్యేక ఆకృతి కలిగిన ఈ దోమ కొన్ని వ్యాధులకి వాహకంగా ఉండటం బాధాకరం.
ఈ ఫొటోను కెనడాలోని ఒంటారియోకి చెందిన గిల్ విజెన్ తీశారు. ఈ ఏడాది వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో ఆయన ప్రశంసలు పొందారు.
57 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఇంకా ఏ ఏ ఫొటోలు విమర్శకుల ప్రశంసలు పొందాయో చూడండి.
గిల్ శిక్షణ పొందిన ఎంటమాలజిస్ట్ కాబట్టి ఈ అంశంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఇలాంటి ఫొటో తీయాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటూ పక్కా ప్రణాళిక, సహనం అవసరం.
సబతేస్ దోమలు అనూహ్యమైనవి, ఉత్తేజకరమైనవి కావడంతో వాటిని ఫోటో తీయడం చాలా కష్టం అని గిల్ చెప్పారు. ముఖ్యంగా ఈ ఫోటోను తీసిన ఈక్వెడార్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ వాతావరణంలో, ఇలాంటి ఫోటోలను తీయడం మరింత కష్టం అన్నారు.
అతి సూక్ష్మ కదలికలకు, కాంతి తీవ్రతలో మార్పులకు కూడా దోమ ప్రతిస్పందిస్తుందని గిల్ పేర్కొన్నారు.
దీని అర్థం మీరు ఈ తరహా దోమలను ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కదలకుండా ఉండాలి. అలాగే ఫ్లాష్‌ని ఉపయోగిస్తే దోమ తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి.
"ఈ దోమలు యెల్లో ఫీవర్, డెంగ్యూ జ్వరం వంటి అనేక వ్యాధులకు ముఖ్యమైన వాహకాలుగా ఉంటాయి. ఫోటో తీసే సమయంలో ఈ దోమతోపాటు మరిన్ని దోమలు నన్ను కుట్టాయి. దీంతో నాకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువే. కానీ, నేను ఇంకా సజీవంగానే ఉన్నాను" అని గిల్ అన్నారు.
ఈ నక్క ఫోటోను అమెరికాకు చెందిన జానీ ఆర్మ్‌స్ట్రాంగ్ తీశారు.
అలస్కాలోని కోడియాక్ నేషనల్ వైల్డ్ లైఫ్ రెఫ్యూజ్‌లోని కార్లుక్ సరస్సులో సాల్మన్ చేపల కోసం ఆడ నక్క వెతుకుతూ ఉండగా ఫోటో తీశారు.
గిల్ పిడికిలి నుంచి రక్తం పీల్చేటప్పుడు దోమ వెనుక కాళ్లు ఎలా ఎత్తుగా ఉన్నాయో గమనించండి. చుట్టూ ఏం జరుగుతుందో దానికి సంపూర్ణ అవగాహన ఉంటే ప్రమాదం ఎదురైనప్పుడు త్వరగా తప్పించుకోవచ్చు.
ప్రపంచంలో 3,300 కంటే ఎక్కువ రకాల దోమలు ఉన్నాయి. వీటిని కొద్దిమందే ఇష్టపడతారు.
మనలో చాలా మంది దోమలను చెదరగొట్టే సమయంలో వాటిని సూక్ష్మంగా పరిశీలించము. అలా చేస్తే, అనేక రంగు రంగుల క్రమాలను, వెంట్రుకలను గమనించవచ్చు అని వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీలను నిర్వహిస్తున్న లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో సీనియర్ క్యూరేటర్ ఎరికా మెక్‌అలిస్టర్ చెప్పారు.
ఆడ సబతేస్ దోమలు గుడ్లు పెట్టడానికి ముందు మాత్రమే రక్తం తాగుతాయి. మిగతా సమయాల్లో పుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదిస్తాయి. దీంతో ఇవి పరపరాగ సంపర్కం జరగడానికి ఉపయోగపడుతాయని ఎరికా మెక్‌అలిస్టర్ అన్నారు.
రక్తం తాగే అందమైన దోమ అని గిల్ తన ఫోటో క్యాప్షన్‌గా పేర్కొన్నారు.
ప్రశంసలు పొందిన ఇతర ఫోటోలు కింద ఉన్నాయి.
నీటిలో ఈదుతున్న చిరుతలు..
ఈ ఫొటోను బుద్ధిలినీ డి సొజా తీశారు.
కెన్యాలోని మసాయ్ మరాలో తలెక్ నదిలో ఈదుతున్న మగ చిరుతలను డి సొజా తన కెమేరాలో బంధించారు.
నది ప్రవాహం చాలా ఉదృతంగా ఉన్నప్పటికీ ఇవి ఈదగలుగుతున్నాయి.
టాక్సిక్ డిజైన్
రొమేనియాకు చెందిన ఘోర్గే ఈ ఫోటో తీశారు.
రొమేనియాలోని అపుసేని పర్వతాల సమీపంలోని జీమనా లోయలో కాలుష్యం బారిన పడిన ఒక నది ఫొటోను డ్రోన్‌తో చిత్రీకరించారు.
లాక్‌డౌన్ చిలుకలు
ఈ ఫోటోను శ్రీలంకకు చెందిన గగన మెండీస్ తీశారు.
తండ్రి చిలుక ఆహారం తీసుకురావడంతో గూటిలోని చిలుకలు తలలు బయటకు పెట్టి చూస్తున్నాయి.
పదేళ్ల వయసున్న గగన మెండీస్ కొలంబోలోని తన ఇంటి బాల్కనీ నుంచి ఈ ఫోటో తీశారు.
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీల్లో విజేతను అక్టోబర్ 12న ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)