టోక్యో ఒలింపిక్స్: షార్క్‌లు, మొసళ్ల మధ్య ఒక మహిళ సాహసం

    • రచయిత, పీటర్ బాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“పడవలను తుక్కుతుక్కు చేయడంలో వాటికి అవే సాటి” అని ఒలింపిక్‌ కయాకర్‌ జో బ్రిగ్డెన్‌-జోన్స్‌ ‘బుల్ షార్క్స్’ గురించి చెప్పారు.

“నీళ్లు ఒక్కసారిగా పెద్ద ఎత్తున పైకి చిమ్మాయంటే దిగువన సొర చేప ఉన్నట్లే లెక్క’ అంటూ చెప్పుకొచ్చారు.

పదునైన దంతాలు కలిగి వేటాడే స్వభావం ఉన్న ఈ జీవుల నడుమ శిక్షణ పొందిన విషయాన్ని చాలా ప్రశాంతంగా వివరించారు ఈ ఆస్ట్రేలియన్‌ కయాకర్‌.

130 కిలోల బరువు, 2.4 మీ (7.9 అడుగులు) పొడవైన ఈ మాంసాహారుల మధ్య నీటిలో గడపడం చాలామందికి ఆందోళన కలిగించే విషయమే.

ఆకస్మికంగా దాడి చేసే సొర చేపలే కాకుండా జో ఒలింపిక్‌ ప్రయాణంలో మరిన్ని అసాధారణమైన అంశాలున్నాయి.

మొసళ్లు సంచరించే ప్రాంతంలో శిక్షణ తీసుకోవడం, కరోనా మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌గా సేవలందించడంతో పాటు సైడ్ బిజినెస్‌గా మొదలెట్టిన కప్‌కేక్‌ల వ్యాపారానికి కూడా ఆమె సమయాన్ని కేటాయించారు.

పొద్దున్న కయాకింగ్‌, రాత్రిళ్లు షిఫ్ట్‌ వర్క్‌

ఒలింపిక్స్​కు ఆడటం ఆమెకిది రెండోసారి. టోక్యో క్రీడలకు శిక్షణ తీసుకుంటూనే, మరోవైపు పారామెడిక్​గా ఆమె ప్రజలకు సేవలు అందించేవారు.

నదుల్లో కయాకింగ్ శిక్షణకు హాజరవ్వడం, జిమ్‌లో కసరత్తులు చేయడం, అత్యవసర సేవల్లో భాగంగా నైట్‌ షిఫ్ట్‌లు, ఓవర్‌ టైమ్‌ కూడా చేయడం.. మామూలు విషయమేం కాదు. ఇదంతా కరోనా మహమ్మారికి ముందు జరిగిన కథ.

“ఆ తర్వాత కరోనా గురించి వినడం, దాని గురించి మాట్లాడుకోవడం, ఆ మహమ్మారి వచ్చి నెత్తిన పడడం అన్నీ జరిగిపోయాయి. ఒలింపిక్‌ ట్రయల్స్‌ రానుండటంతో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) వాడకం తప్పనిసరి అయ్యింది. తెలియని శత్రువుతో ప్రమాదం పొంచి ఉందనిపించేది" అని జో చెప్పుకొచ్చారు.

గత ఏడాది ఒలింపిక్ క్రీడలు వాయిదా పడటానికి కొన్ని వారాల ముందే జో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. అయితే ఒలింపిక్స్ వాయిదా పడడం జోను కుంగదీసింది.

“ఆ సమయంలో నా హృదయం ముక్కలైంది. తీవ్ర నిరాశకు గురయ్యాను. కానీ, అందుకు గల కారణాలను నేను అర్థం చేసుకున్నాను. అయితే, నా జీవితాన్ని ఒకే లక్ష్యానికి ప్రతి రోజు అంకితమిస్తూ నేను పడిన శ్రమ, త్యాగాలు చిన్నవేం కావు. అదంతా 12 నెలలపాటు వాయిదా పడడం నాకు చాలా బాధ కలిగించింది” అని ఆమె చెప్పారు.

ముఖ్యంగా టోక్యో–2020 ఒలింపిక్స్‌ తర్వాత రిటైర్‌ కావాలనుకున్న ఈ 33 ఏళ్ల అథ్లెట్‌కు ఆ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడటం ఓ ఎదురుదెబ్బలాంటిదే.

ఒక్క స్థానంతో వెనుకబడడం, భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి రావడం కారణంగా 2008, 2016 ఒలింపిక్స్‌లలో పాల్గొనే అవకాశం ఆమె చేజారిపోయింది. దీంతో తన సుదీర్ఘ కెరీర్‌ చివరిలో టోక్యో–2020కి అర్హత సాధించడం ఓ మంచి పరిణామంగా భావించారు.

“వయసు మీద పడిన అథ్లెట్‌ని కావడం, మరో పక్క గాయాలు.. ఇంకా 12 నెలలు శరీరం సహకరిస్తుందా అని ప్రతి రోజు ఆలోచించడం చాలా కష్టంగా ఉండేది” అని ఆమె చెప్పారు.

ఆట మాత్రమే జీవితం కాదని తెలుసు’

తన 13వ ఏట కెరీర్‌ను ప్రారంభించిన జో ఒక స్పోర్ట్స్ టాలెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో సెలక్ట్ కాకపోతే అక్కడితో తన కెరీర్ ముగుస్తుందని భయపడ్డారు. కానీ, జో ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు ఆమె ఫిటెనెస్, బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె కయాకింగ్‌లో రాణించగలరని భావించారు.

ఆ సమయంలో కయాకింగ్ అంటే ఏమిటో కూడా జోకి తెలియదట. అయితే, తొందరగానే ఆటపై మక్కువ పెంచుకున్నానని ఆమె చెప్పారు.

జో ఇష్టపడే అంశం మరొకటి కూడా ఉంది.

“వైద్యపరమైన అంశాలపై ఎప్పుడూ ఆసక్తి ఉండేది. సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని నాకు చాలా కోరిక. ఓ పారామెడిక్‌గా విధులు నిర్వర్తించడం సరదాతో పాటూ తృప్తినిచ్చే పనిగా భావించాను. సమయం, శక్తి రెండింటి వినియోగం అధికంగా ఉన్నా, ఓ అత్యున్నత స్థాయి అథ్లెట్‌గా శిక్షణ పొందటానికి అది సాయపడింది” అని జో వెల్లడించారు.

“నా కెరీర్‌ని కొన్ని దశలుగా చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కోసారి శారీరకంగా పూర్తిగా కోలుకుండానే మళ్లీ శ్రమపడాల్సి వచ్చేది. ఎందుకంటే, నేను నా విధులకు తప్పనిసరిగా హాజరవ్వాల్సి వచ్చేది లేదా నైట్‌ షిఫ్ట్‌లు చేయాల్సి వచ్చేది”

“కానీ, ఆ ఒత్తిడిని నేను స్వీకరించాను. ఎందుకుంటే క్రీడల్లో రాణించలేకపోతే, బయట మరో జీవితం కూడా ఉందని నాకు తెలుసు. అందుకే ఇంకా పాడ్లింగ్‌ చేయగలుగుతున్నాను” అని ఆమె తెలిపారు.

కప్‌కేక్ వ్యాపారం

ఓ వైపు టోక్యో ఒలింపిక్స్‌ ఏడాది పాటు వాయిదా పడటం, మరోవైపు ఆస్ట్రేలియాలో కఠిన కరోనా నిబంధనలు అమలు చేయడంతో శిక్షణకు జో చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆమె తన బృందంలోని మిగిలిన వారితో కలిసి శిక్షణ తీసుకోవడానికి మరో రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో పారామెడిక్‌ ఉద్యోగం బదిలీ ఉత్తర్వులు వచ్చే వరకు వేచి ఉన్నారు.

ఈ సమయంలోనే జో సైడ్‌ బిజినెస్‌గా కప్‌కేక్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. కేకుల తయారీ, స్వీట్ల పట్ల తనకున్న అభిరుచితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్టు ఆమె తెలిపారు.

మొసళ్ల బెడద..

జో శిక్షణ పొందుతున్న నదిలో గతంలో అనేకమార్లు మొసళ్లు తిరుగాడినట్లు రికార్డ్ ఉంది.

“మా శిక్షణా సమయంలో మొసళ్లను చూడలేదు. అది మంచిదే అయ్యింది. కానీ, మొసళ్ల ఫామ్‌కు మేం వెళ్లాం. మేము శిక్షణ పొందుతున్న రోయింగ్‌ క్లబ్‌ వద్ద గతంలో పట్టుకున్న ఓ భారీ మొసలిని సిబ్బంది మాకు చూపించారు" అని జో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)