You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అరుదైన పక్షులను వేటాడుతున్న గల్ఫ్ దేశాల రాజ కుటుంబీకులు
- రచయిత, సాహిర్ బలోచ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ తీర ప్రాంత పట్టణం పాస్ని దగ్గర కార్లు అద్దెకిచ్చే ఆఫీసు దగ్గర ఇద్దరు సైనికాధికారులు ఆగారు. అందులో ఒకరు అరబ్ షేక్ ను పంజగుర్ ప్రావిన్సుకు తీసుకెళ్లేందుకు ఒక మంచి కారు అద్దెకు దొరుకుతుందేమోనని కనుక్కున్నారు.
కారు లభిస్తుందని చెప్పి ఆ సంస్థ యజమాని వారితో పాటు ఆయన కొడుకు హనీఫ్ ను తోడుగా ఇచ్చి పంపారు.
ఆ వాహనాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రిన్స్ సురూర్ బిన్ మొహమ్మెద్ అల్ నహ్యాన్ కోసం తీసుకున్నారు.
ఆయన హౌబరా పక్షులను వేటాడటం కోసం అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజగుర్ ప్రావిన్సుకు వెళ్లాలని అనుకున్నారు. ఈ పక్షుల మాంసాన్ని తింటే లైంగిక ఆసక్తి, కోరికలు పెరుగుతాయని కొందరు భావిస్తారు.
హనీఫ్ షేక్ తో కలిసి మొదటిసారి వెళ్లినప్పటి నుంచి వారిద్దరి మధ్య దీర్ఘకాలిక స్నేహం ప్రారంభమైంది. హనీఫ్ కు అప్పుడు 31 సంవత్సరాలు. అప్పటి నుంచి 37 సంవత్సరాలుగా ఈ పక్షుల వేటకు ప్రతీ సంవత్సరం పాకిస్తాన్ వచ్చే రాజ కుటుంబీకులకు ఆయన సహాయకులుగా ఉంటున్నారు.
టర్కీ పక్షి పరిమాణంలో ఉండే ఈ పక్షులు అంతరించిపోతుండటంతో వీటిని చంపడం వివాదాస్పదమైన విషయంగా ఉంది. కానీ, వీటిని విలాసాల కోసం వేటాడుతూనే ఉన్నారు.
పాకిస్తాన్ లో కొన్ని అధికారిక శక్తులు గల్ఫ్ దేశాల్లో ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఈ రహస్య వేటను కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఈ రాజ కుటుంబీకుల పర్యటనలు ఉద్యోగావకాశాలను, పెట్టుబడులను తీసుకునివస్తాయని వీటిని సమర్ధించేవారు అంటారు.
కానీ, వీటి నుంచి పాకిస్తాన్ కి చేకూరే లాభం గురించి మాత్రం ఎటువంటి స్పష్టత లేదు.
అయితే, రాజ కుటుంబీకులు ఈ పర్యటనలను కేవలం వ్యక్తిగత ఆనందం కోసం చేస్తారని కొంత మంది వేటాడే సమూహాలకు చెందిన వ్యక్తులు అంటారు.
బలూచిస్తాన్ ప్రాంతంలో ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో విచ్చేసే రాజ కుటుంబీకులకు హనీఫ్ స్వాగతం పలుకుతారు.
ఈ ప్రాంతం గ్వాదర్ రేవు పట్టణానికి ఒక గంట ప్రయాణ దూరంలో ఉంటుంది.
వారు రాజకుటుంబీకుల రాక కోసం చేసే ఏర్పాట్లు చూసేందుకు హనీఫ్ బీబీసీని ఆహ్వానించారు.
అతిధులకు పాస్ని దగ్గర ఎంతో ఘనంగా స్వాగతం పలుకుతారు. ఇక్కడి స్థానికులకు కనీస అవసరాలు కూడా అందని కలలాగే ఉంటాయి.
విలాసవంతమైన భవనం దగ్గరకు మమ్మల్ని ఇద్దరు వ్యక్తులు తీసుకుని వెళ్లారు. వారి వాహనం మీదున్న నంబర్ ప్లేట్ మాత్రం యుఎఈలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. అది చూసి మాకు అబూదాబీలో ఉన్నామనే భావన కలిగింది.
ఆయన ఇంటి ప్రవేశం దగ్గర అమర్చిన గద్దతో కూడిన అబూ దబీ రాజ వంశీకుల చిహ్నం ఈ భావనను మరింత బలపరిచింది.
ఒక వైపు పేదరికం తాండవిస్తుంటే మరో వైపు ఒయాసిస్ లో కూర్చున్నట్లు మాకు అనిపించింది.
ఈ రాజ కుటుంబీకులు రావడం వలన కొంత మంది స్థానికులకు పని దొరుకుతుంది. కొంత మంది పనివారు షేక్ పెంపుడు గద్దలను చూసుకుంటూ ఉండగా, మరి కొందరు వంటింటిని శుభ్రం చేస్తూ, పెద్ద గారేజ్లో వాహనాలను సరి చేస్తూ కనిపించారు.
మమ్మల్ని ఒక వ్యక్తి అత్తరు పరిమళంతో నిండిన అతిధి నివాసానికి తీసుకుని వెళ్లారు.
"మా ప్రదేశం మీకు నచ్చిందా అని హనీఫ్ మమ్మల్ని అడిగారు".
ఆయన మాకు చుట్టూ చూపిస్తూ షేక్ చేసే పర్యటనల గురించి వివరించారు.
"మేము మొదటి సారి కారు ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. 1988 నాటికి నేను మా నాన్నగారు కలిసి షేక్ కి సంబంధించిన 20 కార్లను నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. ఆయన మమ్మల్ని నమ్మారు. రాజ కుటుంబీకుల పర్యటనల వల్ల కనీసం 35 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది" అని చెప్పారు.
వారు రావడానికి 3 నెలల ముందు నుంచే స్థానికులను ఉద్యోగంలో పెట్టుకుంటారు.
కొంత మంది సిబ్బంది గద్దలు, పావురాలను చూసుకుంటే, కొంత మంది తోటను చూసుకుని నిమ్మకాయలు పండిస్తారు. కొంత మంది దుస్తుల సంగతి, కొందరు వంట, శుభ్రం చేసే పనులు, వాహనాల పనులు చూసుకుంటారు.
షేక్ కంటే ముందే ఒక వ్యక్తి మోటార్ బైక్ మీద వెళ్లి హౌబురా పక్షులు ఎక్కడున్నాయో చూసి వచ్చిన తర్వాత షేక్ వాటిని వేటాడటానికి వెళతారు. దీంతో షేక్ వాటిని వెతుక్కునే పని ఉండదు.
హనీఫ్ ముగ్గురు కొడుకులు కూడా ఈ పనుల్లో సహాయం చేస్తారు.
పెద్ద కొడుకు గారేజ్ పనులు చూసుకుంటారు. రెండవ కొడుకు షేక్ కాపలాదారునిగా, ఆయన భద్రతకు ఇంఛార్జిగా ఉంటారు. మూడవ వ్యక్తి హౌబురా పక్షులను స్థానికులు వేటాడి బ్లాక్ మార్కెట్ లో అమ్మకుండా కాపలా కాస్తారు.
పాకిస్తాన్ 1973 నుంచి రాజ కుటుంబీకులను తమ దేశానికి ఆహ్వానిస్తోంది. ఈ హౌబురా పక్షులను వేటాడటానికి చాలా మంది ప్రైవేటు వ్యక్తులు కూడా గల్ఫ్ దేశాల నుంచి వస్తూ ఉంటారు. ఇది శీతాకాలంలో బలూచిస్తాన్ వైపు వచ్చే వలస పక్షి.
అయితే, రాజ కుటుంబీకుల వేటను 1989లో పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికం చేస్తూ వివిధ రాజ కుటుంబాలకు వేటాడేందుకు వివిధ ప్రదేశాలను కేటాయించింది.
పాస్ని, పంజగుర్, గ్వాదర్ ప్రాంతాలను యుఏఈ రాజకుటుంబీకుల కోసం కేటాయించారు. ఆవరన్ జిల్లాలో ఉన్న జల్ జావ్ ప్రాంతాన్ని ఖతార్ షేక్ లకు ఇచ్చింది. ఛాఘి ప్రాంతాన్ని సౌదీ అరేబియా రాజ వంశీకులకు కేటాయించింది.
హాజి లాంటి కుటుంబాల వారు వీరికి సంరక్షకులుగా ఉంటూ వారి క్షేమం చూసుకుంటారు.
1970లలో వేటాడే వ్యక్తులు హౌబురా పక్షులు ఉండే ప్రాంతాల్లోనే వేచి ఉండేవారు. ఈ వేట వారం రోజుల పాటు సాగేది.
రాజ కుటుంబీకులు ఆ పక్షులను వేటాడి, అక్కడే వండుకుని తిని వెనక్కి వెళ్లేవారు.
కానీ, బలూచిస్తాన్ ప్రాంతంలో వేర్పాటువాదుల తిరుగుబాటు గత కొన్నేళ్లుగా పెరుగుతూ రావడంతో ఎడారి మధ్యలో ఉండటం భద్రతకు ముప్పుగా అనిపించింది. చాలా మంది రాజ కుటుంబీకులు హోటళ్లలో కానీ, లేదా వారికిష్టమైనట్లు కట్టిన హనీఫ్ లాంటి వారి ఇళ్లల్లో కానీ ఉంటారు. అక్కడ నుంచి పక్షులను వేటాడేందుకు వెళ్లడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
అయితే, సంప్రదాయ పద్దతిలో ఈ హౌబురా పక్షులను ముందు గద్దలు వేటాడతాయి. ఆ తర్వాత పక్షి గొంతును కత్తితో కోసి దానిని పట్టుకుంటారు. కొంత మంది వేటగాళ్లు పక్షులను తుపాకీతో కాల్చి చంపుతారు.
హౌబురా బస్టర్డ్ పక్షులను ఆసియన్ హౌబురాస్ అని కూడా అంటారు. ఇవి ఒకప్పుడు అరేబియా ద్వీపం దగ్గర ఎక్కువగా ఉండేవి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య 50,000 నుంచి 100,000 వరకు ఉండవచ్చని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ డి కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐ యు సి ఎన్) అంచనా వేసింది. వీటిని అంతరించిపోతున్న జాతుల జాబితా రెడ్ లిస్ట్ లో చేర్చింది.
రాజ కుటుంబీకులను వేటకు అనుమతించడాన్ని మిత్ర దేశాల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని పాకిస్తాన్ లో చాలా మంది అంటారు. పాకిస్తాన్ పెట్టుబడులకు, రుణాలకు గత కొన్నేళ్లుగా గల్ఫ్ దేశాలపై ఆధార పడుతూ వస్తోంది.
ఈ ఇబ్బందికరమైన అంశానికి స్వస్తి చెప్పాలని అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదని పాకిస్తాన్ ఫారిన్ ఆఫీసు మాజీ ప్రతినిధి అన్నారు.
"ఇలాంటి పర్యటనలతో దేశానికి దౌత్యపరంగా ఎటువంటి ఉపయోగం ఉండవు కానీ, వాటిని భరించడం తప్పదు" అని అన్నారు.
రాజకుటుంబీకులను వేటకు అనుమతించడం వలన గత 25 ఏళ్లలో పాకిస్తాన్ కి చేకూరిన లాభం ఏమీ లేదని ఆయన అన్నారు.
షేక్ వేట కోసం చేసే పర్యటన ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య ఏర్పడిన స్వల్ప బీటలను సరిచేస్తుందేమో అనే ఆశతో ఈ శీతాకాలంలో కూడా షేక్ రాక కోసం పాకిస్తాన్ ఎదురు చూసింది. యుఏఈలో పని చేసేందుకు వీసాలు నిరాకరించిన దేశాల జాబితాలో 2020లో ఆ దేశం పాకిస్తాన్ ని కూడా చేర్చింది.
ఈ చర్యను ఇజ్రాయెల్ స్టేటస్, కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్ పై ఒత్తిడి పెట్టేందుకు చేసే ప్రయత్నం అని విశ్లేషకులు అంటారు.
అయితే, ఈ వాదనలను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండిస్తారు. యుఏఈతో సంబంధాలలో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని అంటారు.
మరోవైపు రాజ కుటుంబీకుల వేట కొనసాగుతూనే ఉంది.
పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఈ వేటను 2015లో నిషేధించాలని చూసింది. కానీ, ఒక్క సంవత్సరంలోనే ఈ నిషేధాన్ని ఎత్తేసారు.
ఈ నిషేధం అమలులో ఉన్నప్పుడు కూడా కొంత మంది రాజకుటుంబీకులకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేసింది.
పశ్నికి షేక్ లు రావడం మంచి చేస్తుందని హాజీ అంటారు.
షేక్ రాక వలన స్థానికులకు ఉద్యోగాలు దొరకడం మాత్రమే కాకుండా, ఆయన చుట్టు పక్కల బావులు తవ్వించి, పాఠశాలలు, ఆసుపత్రులు కూడా కట్టిస్తున్నారు. కాకపొతే, ఈ పాఠశాలల్లో చదువు చెప్పడానికి టీచర్లు ఉండటం లేదు, ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు ఉండటం లేదు.
"షేక్ కేవలం నిర్మాణాలు చేయించగలరు. సిబ్బందిని నియమించే బాధ్యత ఆయన చూసుకోలేరు. అది ప్రభుత్వ భాద్యత" అని హనీఫ్ అన్నారు.
కానీ, హాజీ మాత్రం ఆయన కొడుకులు ఈ పనిని కొనసాగించటానికి ఇష్ట పడటంలేదు.
"నేను షేక్ కి సేవకుడిని. కానీ, నేను చేసిన పనిని నా పిల్లలు చేయాలని అనుకోవడం లేదు. వారికిష్టమైన రీతిలో వారు వెళ్లి వారికిష్టమైన వ్యాపారాలు చేసుకుని వారికి సొంతంగా పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
"నేను నా జీవితం అంతా ఈ పనిని చేస్తూ బ్రతకడం నాకు నచ్చింది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)