You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పిప్లాంత్రి: ఆ ఊరిలో అమ్మాయిలదే రాజ్యం
- రచయిత, భవ్య డోరె
- హోదా, బీబీసీ ట్రావెల్
శ్యామ్ సుందర్ పాలీవాల్ ఆ కాయను పగలగొట్టగానే ఎర్రగా రక్త వర్ణంలో ఉన్న గింజలు బయటకు వచ్చాయి. ఆ సిందూరం చెట్టు ఫలాన్ని ఆయన రెండు చేతుల్లో పట్టుకుని చూపించారు.
భారతీయ మహిళలు అనాదిగా నుదుటి మీద పెట్టుకునే కుంకుమను అందించే ఆ చెట్టు నిజానికి ఆ ప్రాంతంలో పెరగదు. కానీ, ఇప్పుడు పిప్లాంత్రిలో పెరుగుతున్న రకరకాల చెట్లలో సిందూరం ఒకటి. ఇంతకీ పిప్లాంత్రి అంటే ఏమిటి? రాజస్థాన్‌లోని ఆరు పల్లెలను కలిపి పిప్లాంత్రి అంటారు.
శ్యాం సుందర్ పాలీవాల్ 2005లో ఆ గ్రామ అధికారిగా ఎన్నికయ్యే నాటికి ఆ ప్రాంతమంతా పాల రాతి కోసం తవ్వకాలు జరుగుతూ, చుట్టు పక్కల ప్రాంతమంతా పచ్చదనం లేక ఎడారిని తలపించేలా ఉండేది. చాలా ప్రాంతాలలో లాగే, అమ్మాయిలను అక్కడ ఒక ఆర్ధిక భారంలా చూస్తూ వారిని తక్కువగా చూసేవారు.
కానీ, శ్యాం సుందర్ పాలివాల్ 17 ఏళ్ల కూతురు కిరణ్ 2007లో డీహైడ్రేషన్ తో మరణించింది. గుండెలు పగిలే బాధ ఉన్నప్పటికీ ఆమె జ్ఞాపకార్ధం ఆ కుటుంబం ఆ గ్రామం మొదట్లో ఒక చెట్టును నాటారు. పిప్లాంత్రి నాయకుడిగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ఆయన భావించారు.
మరి కొన్ని రోజుల్లోనే చుట్టు పక్కల గ్రామాలు కూడా ఆయన పంథాను అనుసరించడం మొదలు పెట్టాయి.
ఇదే సంప్రదాయం ఈ ఊరిలో ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ఆ ఊళ్లో ఆడపిల్ల పుట్టిన ప్రతి సారి ఆ బిడ్డకు గుర్తుగా గ్రామస్థులు 111 చెట్లను నాటుతారు. ఈ సంఖ్యను హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం వలన పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతున్నారు.
'ఒక అమ్మాయి పేరు మీద చెట్టు నాటినప్పుడు, ఊరిలోని ఉన్న ప్రతి అమ్మాయి పేరు మీద ఎందుకు ఇదే పని చేయకూడదు" అని పాలీవాల్ అన్నారు.
ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉసిరి, మామిడి, గంధం, రావి, వెదురు లాంటి రకాలతో కూడిన 3,50,000 చెట్లు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో 1000 హెక్టారుల స్థలం నిస్సారంగా ఉండేది.
పాలీవాల్ కి వచ్చిన ఈ చిన్న ఆలోచన ఒక పెద్ద పర్యావరణ-స్త్రీవాద ఉద్యమంగా మారిపోయింది.
చెట్లు నాటడంతో పాటు ఆడపిల్లల తల్లితండ్రులందరూ తమ పిల్లలు స్కూలు చదువు పూర్తి చేసుకునే వరకు, 18 సంవత్సరాల లోపు వివాహం చేయమని అఫిడవిట్ పై కూడా సంతకం చేస్తారు.
ప్రతి అమ్మాయికి 31,000 రూపాయలతో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కూడా వేసి అది ఆమె 18 సంవత్సరాలు నిండేసరికి వాడుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. ఆ డబ్బును ఆమె చదువుకు గాని, పెళ్ళికి కానీ వినియోగిస్తారు.
భారతీయ గ్రామాలు నీటి నిర్వహణను మెరుగుపర్చుకుంటూ పచ్చదనంతో ఎలా విలసిల్లవచ్చో చెప్పడానికి పిప్లాంత్రి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
పాములు, తేళ్లు గురించి హెచ్చరిస్తూ పాలివాల్ నన్ను ఊరి మొదట్లో ఉన్న ఒక కదంబ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్లారు. అది ఆయన ఈ ఊరిలో నాటిన మొదటి చెట్టు. ఇప్పుడు ఆ చెట్టు చుట్టూ మరిన్ని చెట్లు ఉన్నాయి.
ఊళ్లో అమ్మాయిలు పుట్టిన ప్రతి సారి గ్రామస్థులు 111 చెట్లను నాటడంతో పాటు ప్రతి సంవత్సరం ఆగస్టులో అంతకు సంవత్సరం ముందు పుట్టిన పిల్లలందరి కోసం ఒక ప్రత్యేక చెట్లు నాటే ఉత్సవాన్ని జరుపుకుంటారు. 5,500 మంది జనాభా ఉండే గ్రామంలో సుమారు ఏటా 60 మంది అమ్మాయిలు పుడతారని పాలీవాల్ చెప్పారు.
అమ్మాయిలు పెరిగి పెద్దయ్యాక వారి పేర్ల మీద నాటిన చెట్లకు వాటిని సోదరుల్లా భావించి రాఖీ కడతారు.
మరో వైపు గ్రామాధికారులు, ఇతర అధికారులు తమ పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ఒక రావి చెట్టు దగ్గర ప్రమాణం చేస్తారు.
"ఈ ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తుల పేర్లు చెబుతూ చారిత్రకంగా ఈ ప్రాంతంలో యుద్ధ వీరులు ఉండేవారు. ఈ ప్రాంత ప్రజలు ఓటమిని అంగీకరించరు. మేము కూడా ఓటమిని అంగీకరించం" అని పాలివాల్ చెప్పారు.
"పూర్వం వారు దాడులను ఎదుర్కొనే వారు. మేము జబ్బులను, కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు పోరాడుతున్నాం" అని అన్నారు.
పిప్లాంత్రిలో చెట్లు పెరగడంతో భూగర్భ జలాల స్థాయి కూడా పెరిగింది. ఇక్కడ మహిళల పరిస్థితులు మారి సాంస్కృతికంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
నికిత పాలివాల్ పేరు మీద కూడా ఈ ఊర్లో చెట్లు నాటారు. ఆమె ఇప్పుడు డాక్టర్ చదివి పేదవారి కోసం పని చేయాలని అనుకుంటున్నారు. "మేము కూడా మా కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నాం" అని అన్నారు.
"మనం పని చేస్తూ ఉంటే మిగిలిన వారు నెమ్మదిగా వచ్చి చేరుతారు" అని శ్యాంసుందర్ అన్నారు.
కానీ, దీనికి ఒక గ్రామం మొత్తం పని చేయవలసి వస్తుంది.
మొక్కలు వేయడానికి గ్రామంలో ఉన్న చాలా మంది మహిళలు నేలను సిద్ధం చేస్తున్నారు.
ఉత్సవంలా చెట్లను నాటడం సంవత్సరానికి ఒకే సారి జరుగుతుంది కానీ, గ్రామంలో నిరంతరం చెట్లను నాటుతూనే ఉంటారు.
నానుభాయ్ పాలివాల్ కి ఇద్దరూ కొడుకులే. "కానీ, ఊరిలో అమ్మాయిలకు మర్యాద ఇవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచి నాకు మనవరాళ్లు పుట్టాలని కోరుకున్నాను" అని చెప్పారు.
ఇప్పుడు ఆమెకు ఇద్దరు మనమరాలు ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పుడు చెట్లను నాటారు.
"ఇంతకు ముందు వాళ్ళను భారంగా చూసేవాళ్ళం. కానీ , ఇప్పుడు మేమలా ఆలోచించటం లేదు.
"మాకు కొడుకులు కావాలనే కోరిక లేదు. ఆమె చెట్ల వైపు చూపిస్తూ చుట్టూ చూసారు. ఇదొక చిన్న గ్రామం. మేము చాలా కష్టపడ్డాం. మేము దీనిని ప్రత్యేకంగా చేసాం. ఇలా మాకు పని, ఆదాయం కూడా దొరుకుతోంది" అని ఆమె చెప్పారు.
అమ్మాయిలను గౌరవించడం మాత్రమే కాకుండా పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి వాడుతూ, స్థానికులకు ఆదాయం వచ్చే విధంగా చేస్తున్న ఈ పని గ్రామం మొత్తం అనుసరిస్తున్న వ్యూహంలో కీలకమైన పాత్ర వహిస్తోంది.
"సహజ వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చడమే మా మార్గం" అని శ్యాం సుందర్ అన్నారు.
ఈ గ్రామం మహిళల కోపరేటివ్ లను కూడా స్థాపించింది. వీరు కలబంద, కొన్ని జూసులు, ఆహార పదార్ధాలు, తయారు చేసి గ్రామంలో అమ్ముతారు. ఈ ఉత్పత్తులను మరింత పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు.
"అన్నిటినీ అనుసంధానం చేయాలి. చెట్లను నాటాలంటే మంచి నేల, నీరు ఉండాలి. ఆలా ఉంటే పక్షులు వస్తాయి. పచ్చదనం వలన వర్షాలు కురుస్తాయి" అని ఆయన అన్నారు.
"ఎవరైనా మరణించినప్పుడు కూడా ఈ గ్రామంలో 11 చెట్లు నాటుతాం".
"ఎక్కడైతే గనుల కోసం భూమిని, కొండలను తవ్వడం మొదలుపెట్టారో అక్కడ వినాశనం జరిగింది. ఈ పరిస్థితిని మార్చడానికి మేము పని చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.
ఈ గ్రామంలో భూగర్భ జల సంరక్షణ పధకాలు కూడా చేపట్టారు. ఆ గ్రామం చెట్లు నాటక ముందు నాటి పరిస్థితి నేటి పరిస్థితులను చూపిస్తూ ఉన్న పోస్టర్లు గ్రామం అంతా కనిపిస్తున్నాయి.
దూరంగా చెరువులు కూడా కనిపిస్తున్నాయి. రకరకాల పక్షులు కూడా కనిపించాయి.
"2007కి ఇప్పటికి నేను చాలా తేడాను గమనించాను. ఒక వ్యక్తి మార్పుకు ఎలా నాంది పలికారో అనేదానికి నిదర్శనంగా ఈ గ్రామం నిలుస్తుంది" అని జిల్లా పరిపాలనా విభాగాల ప్రధాన అధికారి నిమిష గుప్త చెప్పారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేస్తే అవి అద్భుతాలు సృష్టించగలవు" అని అన్నారు. కానీ, అన్ని గ్రామాలు నిధులను సరిగ్గా వినియోగించుకోలేవు అని అన్నారు.
పిప్లాంత్రి నమూనా గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఒక శిక్షణా కేంద్రాన్ని స్థాపించింది.
ఒక్కొక్కసారి ఈ ప్రాంతపు అభివృద్ధిని చూడటానికి రోజుకు 50-60 మంది వస్తూ ఉంటారు.
శిక్షణ తీసుకోవడానికి వచ్చే వారి కోసం ఈ గ్రామంలో వసతి గృహాలను కూడా నిర్మించారు.
"చెట్లను నాటడం సంస్కృతిలో భాగం చేయడం ద్వారా విజయం సాధించాం" అని ఆమె చెప్పారు.
ఆ గ్రామంలో పుట్టిన రోజులు కూడా చెట్ల మధ్య జరుపుకుంటున్నారు.
ఇక్కడ పాఠశాలల్లో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తి 33:19 ఉంది. ఎవరూ మధ్యలో స్కూలు మానేయలేదని స్థానిక స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు.
సంగీత పాలివాల్ ఆ ఊరికి 12 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని వచ్చారు. ఆమె అప్పటికి చదువుకోలేదు. కానీ, ఆమె కూతురు చదువుకోవాలని ఆమె ఆశిస్తున్నారు. ఆమె పుట్టింట్లో ఆమె చీర కొంగును తల పై కప్పుకునేవారు. కానీ, ఇక్కడ అలా కాదు. ఇక్కడకు వచ్చాక ఆమె కాలేజీ డిగ్రీ పూర్తి చేసి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు.
ఆమె డ్రైవింగ్ కూడా చేస్తారు.
"పరిస్థితులు మారాయి" అని ఆమె అన్నారు
(ప్రపంచాన్ని ప్రేమించడానికి 50 కారణాలు" అనే సిరీస్ లో భాగంగా బీబీసీ ట్రావెల్ అందిస్తున్న కథనం)
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)