You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘జగనన్న అమ్మ ఒడి’లా అమెరికా కూడా ఓ పథకం తీసుకురాబోతోందా?
ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న అమ్మ ఒడి' పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తారు.
ఇలాంటి ఓ పథకమే తెచ్చేందుకు అమెరికా కూడా యోచిస్తోంది. ప్రతి చిన్నారికి నెలనెలా 300 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.21 వేల భృతి ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. కరోనావైరస్ సహాయ ప్యాకేజీలో భాగంగా దీన్ని చేపట్టే ఆలోచన చేస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లోకెల్లా అమెరికాలోనే బాలల్లో పేదరికం ఎక్కువగా ఉంది.
అయితే, ప్రస్తుతమున్న విధానాలు 'అత్యవసర సాయం' చేయడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాయని, శాశ్వత మార్పు తెచ్చేలా వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార ప్రతినిధి ఇటీవల వ్యాఖ్యానించారు.
కానీ, పిల్లలకు భృతి అందించే ఇలాంటి కార్యక్రమాన్ని కొన్నేళ్లు కొనసాగిస్తే శాశ్వత మార్పునకు అవసరమైన పునాదులు పడతాయని అమెరికాలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నవారు అంటున్నారు.
''ఇది అత్యవసర సాయమే, కానీ, తాత్కాలికం కాదు. చిన్నారుల్లో పేదరికం అమెరికాలో ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి సహాయ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఆ అసమానతలను తొలగించవచ్చు. ఆ తర్వాత శాశ్వత మార్పు తెచ్చే దిశగా పనిచేయొచ్చు'' అని ఫస్ట్ ఫోకస్ ఆన్ చిల్డ్రెన్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ బడ్జెట్ అండ్ ట్యాక్స్ మిషెల్ డలాఫియర్ అన్నారు.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో లోపాలేంటి?
బ్రిటన్ సహా అభివృద్ధి చెందిన చాలా దేశాలు దశాబ్దాలుగా బాలల సంక్షేమం కోసం నెలవారీ భృతి ఇచ్చే పథకాలను అమలు చేస్తూ వస్తున్నాయి.
కానీ, ఇలాంటి సంక్షేమ పథకాల వల్ల జనంలో ఉదాసీనత పెరుగుతుందన్న భావన అమెరికా రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా ఉంది. సంక్షేమ పథకాలకు బదులుగా బాలల పోషణపై పన్ను మినహాయింపు ఇచ్చే విధానాలను ఆ దేశం అమలు చేస్తోంది.
ఒక్కో చిన్నారిపై 2 వేల డాలర్ల (రూ.1.45 లక్షలు) దాకా పన్ను మినహాయింపు ఇచ్చే విధానాన్ని అమెరికాలో 1997లో తీసుకువచ్చారు. అయితే, ఒక కుటుంబానికి ఎంత వరకూ పన్ను మినహాయింపు దక్కుతుందన్నది ఆ కుటుంబ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధానం వల్ల తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు తక్కువ ప్రయోజనం కలుగుతుందని, అవసరం ఉన్నవారికి న్యాయం జరగడం లేదని విమర్శకులు అంటున్నారు.
దాదాపు 33 శాతం చిన్నారులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందడం లేదని, వాళ్లంతా పేద, నల్లజాతి, హిస్పానిక్ జాతుల వాళ్లు అని ఇదివరకు ఓ అధ్యయనం తేల్చింది. 2,500 డాలర్ల కన్నా తక్కువ వార్షిక కుటంబ ఆదాయం ఉన్న కారణంగా పది శాతం మంది చిన్నారులు అసలు ఈ ప్రయోజనం పొందేందుకు అనర్హులుగా మారిపోయారని లెక్కగట్టింది.
ఏం మారుతాయి?
ఆరేళ్లలోపు చిన్నారులపై 3,600 డాలర్ల (రూ.2.61 లక్షలు) వరకూ, 18ఏళ్ల లోపు బాలబాలికలపై 3,000 డాలర్ల (రూ.2.17 లక్షలు) వరకూ పన్ను మినహాయింపును పెంచాలని డెమొక్రటిక్ పార్టీ ప్రణాళికలు వేసింది.
అల్పాదాయ కుటుంబాలకు నెలవారీ భృతి కల్పించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇక తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్న కుటుంబాల్లో 75 వేల డాలర్లకు మించి ఆదాయం ఉన్నా, తల్లిదండ్రులకు కలిపి 1.5 లక్షల డాలర్లకు మించి ఆదాయం ఉన్నా ప్రయోజనాలు వర్తించకుండా చేయాలనుకుంటున్నారు.
పన్ను మినహాయింపును పెంచి, నెలవారీ భృతిని కల్పించడం ద్వారా బాలల్లో పేదరికం రేటు 40 శాతం మేర తగ్గుతుందని, దాదాపు 40 లక్షల మంది చిన్నారులు పేదరికం నుంచి బయటపడతారని పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నవాళ్లు అంటున్నారు.
కెనడా లాంటి దేశాల్లో ఈ తరహా కార్యక్రమాలు మొదలుపెట్టిన తొలి ఏడాదుల్లోనే పేదరికం రేటు 20 శాతం మేర తగ్గిందని అంటున్నారు.
ఇక రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ మిట్ రోమ్నీ లాంటి వాళ్లు కూడా ఈ తరహా నెలవారీ భృతి ఇచ్చే కార్యక్రమాలు రావాలని అంటున్నారు. అమెరికాలో జననాల రేటు రికార్డు స్థాయికి పడిపోతున్న తరుణంలో ఇవి కుటుంబ హితమైన కార్యక్రమాలు అని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడే ఎందుకు?
పన్ను మినహాయింపు ట్రంప్ పాలనలో 2017లో ఒక్కో చిన్నారిపై వెయ్యి డాలర్ల నుంచి రెండు వేల డాలర్ల వరకూ పెరిగింది. 2025లో తిరిగి ఇది వెయ్యి డాలర్లకు తగ్గాల్సి ఉంది.
కానీ, కరోనా సంక్షోభం కారణంగా అమెరికాలో ప్రతి ఆరు కుటుంబాల్లో ఒక కుటుంబంలోని చిన్నారులకు సరైన ఆహారం లభించడం లేదని మిషెల్ డలాఫియర్ అన్నారు.
నెలవారీ భృతి కల్పించడం ద్వారా అమెరికా కూడా ఈ అంశంలో మిగతా అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరినట్లవుతుందని కొలంబియా యూనివర్సిటీలోని సెంటర్ ఆన్ పావర్టీ, సోషల్ పాలసీ పరిశోధకురాలు మేగన్ కుర్రన్ అన్నారు.
బ్రిటన్‌లో కుటుంబంలో మొదటి సంతానానికి 84.20 పౌండ్లు (రూ.8,500), ఆ తర్వాత పుట్టినవారికి 55.80 పౌండ్లు (రూ.5,600) చొప్పున నెలవారీ భృతి ఇస్తున్నారు. వార్షిక ఆదాయం 50 వేల పౌండ్లు (రూ.50 లక్షలు) దాటితే, ఈ ప్రయోజనాలు తగ్గిపోతాయి.
కెనడాలో ఆరేళ్లలోపు చిన్నారులకు రూ.32 వేల వరకూ... 18 ఏళ్ల లోపు బాలబాలికలకు రూ.27 వేల వరకూ నెలవారీ భృతి అందిస్తున్నారు. వార్షిక ఆదాయం రూ.17 లక్షలు మించిన కుటుంబాలకు ఈ ప్రయోజనం తగ్గిపోతుంది.
అయితే కుటుంబ సంక్షేమ విధానాలతోపాటు పిల్లల పోషణ, మాతృత్వ, పితృత్వ సెలవుల విధానాల్లోనూ అమెరికా వెనుకబడి ఉందని కుర్రన్ అభిప్రాయపడ్డారు.
''నెలవారీ భృతితోనే అంతా మారిపోదు. కానీ, పిల్లల అవసరాలు తీర్చేందుకు కుటుంబాలకు ఇది కొంత ఆసరాగా నిలుస్తుంది. ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు దేశంలో చాలా ఉన్నాయి'' అని ఆమె అన్నారు.
అమల్లోకి వస్తుందా?
ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపులను కొనసాగిస్తే, నెలవారీ భృతిని ఎంత మంది ఎంచుకుంటారన్నదానిపై డెమొక్రటిక్ పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
పైగా ఇప్పటికే పన్ను మినహాయింపులను పెంచిన తర్వాత ఏటా 120 బిలియన్ డాలర్లు ప్రభుత్వం వీటిపై వెచ్చించాల్సి వస్తోంది.
అయితే, పన్ను మినహాయింపును, మరికొన్ని ప్రయోజనాలను పూర్తిగా తీసేసి, నెలవారీ భృతి కల్పించాలని రోమ్నీ ప్రతిపాదిస్తున్నారు. అయితే, అలా చేస్తే అల్పాదాయ వర్గాలకు నష్టం జరుగుతుందని విమర్శకులు అంటున్నారు.
పన్ను మినహాయింపు పెంపును రిపబ్లిక్ పార్టీలో చాలా మంది నేతలు సమర్థిస్తున్నారు. ఈ విధానాన్ని సమూలంగా మార్చే ప్రతిపాదనను మాత్రం వారు వ్యతిరేకిస్తున్నారు.
''పిల్లలపై పన్ను మినహాయింపును నెలవారీ భృతిగా మార్చే ప్రతిపాదనను మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదో కనీస ఆదాయ పథకం అవుతుంది. ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులకు పన్ను మినహాయింపు ఇవ్వకుండా... ఓ సంక్షేమ కార్యక్రమం నిర్వహించినట్లవుతుంది'' అని రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు మైక్ లీ, మార్కో రూబియో ఇటీవల అన్నారు.
''ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు 'జనాల్లో ఆధారపడే తత్వాన్ని' పెంచేవిధంగా ఉన్నాయని విమర్శించిన సెనేటర్ రోమ్నీలాంటి వాళ్లే ఇప్పుడు తీరు మార్చుకుంటున్నారు. రాజకీయ పవనాల దిశ మారతుంది. ఏదో ఒక రూపంలో ఈ పథకం రావొచ్చు'' అని మిషెల్ డలాఫియర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆన్లైన్ సెక్స్: స్పర్శ లేని లోటును తీరుస్తుందా?
- మాన్య సింగ్: ఆటో డ్రైవర్ కూతురు మిస్ ఇండియా రన్నరప్ వరకు ఎలా ఎదిగారు?
- ‘‘బూజు పట్టిందని రూ.పది వేల కోట్ల ప్యాలెస్‌ను కూల్చి, మళ్లీ కడుతున్నారు’’
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- నువ్వలరేవులో పెళ్లి: వధువు వరుడి మెడలో తాళి కట్టడమే కాదు, ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలు
- కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)