పాకిస్తాన్: నపుంసకులుగా మార్చే శిక్షతో అత్యాచారాలు ఆగిపోతాయా? ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వ నిర్ణయంతో నేరస్తులు మారిపోతారా?

    • రచయిత, ఆజం ఖాన్‌
    • హోదా, బీబీసీ ఉర్దూ, పాకిస్తాన్‌

“అత్యాచారం అంటే కేవలం సెక్స్‌ కాదు. లైంగిక సామర్థ్యం లేనివారు మరో హింసాత్మక మార్గం ఎంచుకుంటారు. ఓ వ్యక్తి తన బలాన్ని ఓ బలహీనమైన వ్యక్తిపై చూపించిన సందర్భాన్ని కూడా మనం రేప్‌గానే భావించాలి."

అత్యాచార నిందితులను నపుంసకులుగా మార్చే శిక్షపై సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

కానీ కఠినమైన చట్టాలు, శిక్షలు మహిళలను అత్యాచారాల నుంచి కాపాడతాయా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇదే అంశంపై అత్యాచార బాధితులు, వారి కుటుంబీకులు, సామాజిక కార్యకర్తలు, న్యాయనిపుణులతో బీబీసీ మాట్లాడింది.

పాకిస్తాన్‌కు చెందిన అమీమా (పేరు మార్చాం) కుమార్తె అత్యాచార బాధితురాలు. తన కూతురుకు న్యాయం చేయాలంటూ అమీమా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

“ఇలాంటి శిక్షలు విధించడం మంచిదే. కానీ వాటిని అమలు చేయడం కూడా ముఖ్యమే. ఊరికే చట్టాలు చేస్తే సరిపోదు. చట్టాల్లో కఠిన శిక్షలున్నా న్యాయస్థానాలు వాటిని విధించే పరిస్థితి లేకపోతే కోర్టుల్లో పెండింగ్‌ కేసులు పెరిగిపోతూనే ఉంటాయి’’ అన్నారు అమీమా.

బాధితులకు అందని న్యాయం

అత్యాచారం కేసు చాలా బలహీనంగా ఉందంటూ అమీమా కూతురికి నచ్చజెప్పి, ఆమె దాన్ని వెనక్కి తీసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. వాస్తవానికి అమీమా కూతురిని ఆమె దగ్గరి బంధువుల అబ్బాయే అత్యాచారం చేశాడు. ఆమె బంధువులంతా ఆ అబ్బాయితోనే పెళ్లి చేయాలని అమీమాపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ అమీమాకు అది ఇష్టం లేదు.

తనపై జరిగిన అత్యాచారం విషయంలో తన వాదనను ఎవరూ వినిపించుకోవడం లేదని పాకిస్తాన్‌కు చెందిన ఓ బాలిక బీబీసీ ప్రతినిధితో అన్నారు.

కొత్త శిక్షపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమెను ప్రశ్నించగా, అలాంటి శిక్షలు అనవసరమని, అవి అత్యాచారాలను తగ్గిస్తాయనే నమ్మకం తనకు లేదని ఆమె అన్నారు. మనుషుల మనస్తత్వాలు మారాలంటారామె.

అత్యాచారానికి గురైన తన 24 ఏళ్ల కూతురి కేసులో తుది తీర్పు కోసం హుమైరా కన్వాల్‌ ఎదురు చూస్తున్నారు. తనకు గాని, తన కూతురుకు గాని కోర్టులో ప్రవేశించేందుకు అవకాశమే రావడం లేదని హుమైరా వాపోయారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.

“ఓ వ్యక్తిని అత్యాచార నేరం కింద నపుంసకుడిగా మారిస్తే, అతణ్ని చూడగానే పదిమందికీ అతను చేసిన తప్పేంటో తెలుస్తుంది. చెడ్డపనులు చేసిన వారెవరూ ధైర్యంగా తిరగడానికి వీలుండకూడదు’’ అన్నారు హుమైరా. “ఇదేమీ హత్య కాదు. ఇదో గుణపాఠం’’ అన్నారాయన.

“గడిచిన ఆరు నెలల్లో 2,000 మంది బాలికలపై అత్యాచారాలు జరిగాయి. వారిలో కొందరిని దారుణంగా చంపేశారు’’ అని బాలల రక్షణ కోసం పనిచేసే ఓ ఎన్జీవోలో పని చేస్తున్న మనాజీ బానో అన్నారు.

ఈ శిక్షతో మార్పు వస్తుందా ?

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక విధమైన భయమైతే నేరస్తుల్లో కలుగుతుందని మనాజీ బానో అన్నారు. అయితే ఇదే చివరి పరిష్కారం కాదంటారామె. ఈ చట్టాలను అమలు చేయడమే అసలు సమస్య అన్నారు మనాజీ.

సింధ్‌ ప్రావిన్సులో ఓ తల్లి, కూతురు ఒకేసారి అత్యాచారానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా కలత చెందారని, అందుకే ఈ కఠిన శిక్షకు ప్రతిపాదించారని పాకిస్తాన్ సమాచారశాఖ మంత్రి షిబ్లి ఫరాజ్‌ అన్నారు. అత్యాచార నేరస్తులు కోర్టు శిక్షల నుంచి తప్పించుకోకుండా ఓ ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.

“దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమాయకులైన చిన్నారులు బలవుతున్నారు’’ అన్నారాయన. త్వరలోనే ఇది చట్ట రూపం దాలుస్తుందని ఫరాజ్‌ తెలిపారు.

“ప్రజలందరికి వారి భద్రతపై భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని ఈ ఆర్డినెన్స్‌ను ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ ప్రెస్‌నోట్‌లో వెల్లడించారు.

అయితే చట్టం ద్వారా నపుంసకులుగా మార్చడమే కాకుండా, మరణశిక్షను కూడా చేరుస్తున్నామని, ఇది వారం రోజుల్లో ధచట్టరూపం దాలుస్తుందని మంత్రి షిబ్లి చెప్పారు.

పాకిస్తాన్‌లో ఒక ఆర్డినెన్స్‌ను 120 రోజుల్లో పార్లమెంటు ఆమోదించకపోతే, అది రద్దైపోతుంది.

కొత్త శిక్షల్లో ఇంకా ఏముంది?

కఠిన శిక్షతోపాటు అత్యాచార కేసులు త్వరితగతిన విచారణ జరిగేలా ఆర్డినెన్స్‌లో నిబంధనలు పొందుపరిచినట్లు ప్రధానమంత్రి సలహాదారు షెహజాద్‌ అక్బర్‌ వెల్లడించారు.

అత్యాచార కేసులపై కొత్తగా రూపొందించిన శిక్షల్లో నపుంసకులుగా మార్చడంతోపాటు జీవిత ఖైదు, మరణశిక్షలు కూడా ఉన్నాయి.

“ఇంగ్లండ్‌తో పాటు అనేక దేశాల్లో నపుంసకులుగా మార్చే చట్టాలున్నా, అవి నిందితుడి అనుమతి తీసుకోవాలని చెబుతున్నాయి. అయితే ఈ నేరానికి పాల్పడే దురలవాటు నుంచి బయటపడలేని కొందరు మాత్రమే దీనికి అంగీకరిస్తారు’’ అని బాలల సంరక్షణ నిపుణుడు వాలెరీఖాన్‌ అన్నారు.

“తరచూ నేరాలకు పాల్పడే వారికి ఇండోనేషియా ఇలాంటి శిక్షలు విధిస్తుంది. పాకిస్తాన్‌ కూడా ఆ దేశ చట్టం నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇండోనేషియాలో కూడా ఈ చట్టం అమలులో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంది’’ అన్నారు వాలెరీ ఖాన్‌.

“శాస్త్రీయమైన పద్ధతిలో, నిపుణుల సలహా మేరకు ఈ శిక్షను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క ఇంజెక్షన్‌తో ఒక వ్యక్తిలోని లైంగిక వాంఛలు తగ్గిపోతాయనుకోవడం కష్టం’’ అన్నారు వాలెరీ ఖాన్‌.

“ఇది సెక్స్‌ కోరికలను తగ్గించుకోవడానికి కొందరు నేరస్తులు స్వచ్ఛందంగా తీసుకునే శిక్ష అన్న భావన ఏర్పడకూడదు’’ అన్నారు అమెరికాలో పని చేస్తున్న పాకిస్తానీ జర్నలిస్ట్‌ సబాహత్‌ జకారియా.

ఇలాంటి చట్టాలు అమలులో ఉన్న దేశాల్లోని నేరస్తులు తమకు ఉపయోగపడుతుందనుకుంటేనే ఈ శిక్షను అనుభవించడానికి ముందుకు వస్తారు. ఇది సెక్స్‌ కోరికల నుంచి ఉపశమనం కలిగించడానికి ఉపయోగించే చర్య.

అయితే మహిళలపై అత్యాచారాలు, బలత్కారాలు కేవలం లైంగిక వాంఛలతోనే జరగడం లేదంటారు జకారియా.

"2011లో దిల్లీలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు ఒక ఇనుప రాడ్‌ను ఉపయోగించారు. అలాంటప్పుడు ఇలాంటి శిక్షలతో మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయా అన్నది సందేహించాల్సిన అంశం" అన్నారు జకారియా.

కొందరు తమలో లైంగికవాంఛలు లేని సందర్భంలో మహిళలపై అఘాయిత్యాలకు మరో రకమైన హింసాత్మక మార్గాన్ని ఎంచుకుంటారు అన్నారు జకారియా. బలహీనమైన వ్యక్తి మీద బలవంతులు చేసే ఎలాంటి దాడినైనా అత్యాచారంగానే పరిగణించాలని ఆమె వాదిస్తారు.

లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయడం సబబేనా ?

అయితే ఓ వ్యక్తి లైంగిక సామర్థ్యాన్ని తొలగించడం అమానవీయమే కాక, రాజ్యాంగ విరుద్ధమని వాలెరీ ఖాన్‌ వాదిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయ పౌరహక్కుల సమాఖ్య (ఐసీసీపీ) నిబంధనలకు ఇది విరుద్ధమని, పాకిస్తాన్‌ ఈ సమాఖ్య ఒప్పందంపై సంతకం చేసిందని ఖాన్‌ గుర్తు చేశారు.

"కఠినమైన శిక్షలను రూపొందించడం ముఖ్యంకాదు. నేరాన్ని నిరూపించడమే పెద్ద సమస్య" అని మహిళా హక్కుల కోసం పోరాడుతున్న లీగల్‌ ఎయిడ్‌ సొసైటీ సభ్యురాలు మలీహా జియా అన్నారు.

“ఇలాంటి నేరాలకు మరణశిక్ష ఇప్పటికే ఉంది. ఇంతకన్నా పెద్ద శిక్ష ఇంకా ఏముంటుంది’’ అని ఆమె ప్రశ్నించారు.

వ్యవస్థను మార్చకుండా ప్రభుత్వం శిక్షల మీదే ఎక్కువగా దృష్టిపెడుతోంది. నేరాలను నిరూపించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్జానం లేదు, నిపుణులు లేరు. ఇలాంటి పరిస్థితుల వల్ల నేరాలు పెరుగుతాయే తప్ప తగ్గవు’’ అన్నారు జియా.

అత్యాచారానికి నిర్వచనం మార్చాలి. అది ఏదో ఒక్క జెండర్‌కే పరిమితం చేయకుండా మొత్తంగా ఒక హింసగా పరిగణించాలని జియా అంటున్నారు. అలాగే వేగంగా విచారణ జరపడం, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం వల్ల కూడా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆమె సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)