You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జో బైడెన్, కమలా హారిస్‌లకు అభినందనలు తెలుపుతూ వివిధ దేశాల ప్రముఖులు ఏమన్నారు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్‌పై విజయం సాధించారు. మొత్తం 50 రాష్ట్రాలలో ఇప్పటివరకూ 46 రాష్ట్రాల ఫలితాలు వెల్లడయ్యాయి. అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి కనీసం 270 ఎలక్టోరల్ కాలేజి ఓట్లు గెలవాల్సి ఉండగా, బైడెన్ 279 స్థానాలు గెల్చుకున్నారు.
బైడెన్, కమలా హారిస్‌లు స్వయంగా తమ ట్విట్టర్ ప్రొఫైల్స్‌లో ఎన్నికైన అధ్యక్షుడు (ప్రెసిడెంట్-ఎలెక్ట్), ఎన్నికైన ఉపాధ్యక్షురాలు (వైస్ ప్రెసిడెంట్-ఎలెక్ట్) అని ప్రకటించుకున్నారు.
దీంతో, దేశ విదేశాల నుంచీ అనేకమంది వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. జో బైడెన్ ఆయన సహచరి జిల్ బైడెన్‌లకు, కమలా హ్యారిస్‌కు అభినందనలు తెలిపారు.
ఒబామా సోషల్ మీడియాలో చేసిన ఒక ప్రకటనలో..."ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఓట్లు వేశారు. ఓట్ల లెక్కింపు తరువాత విజేతలకు ఇది చారిత్రాత్మక విజయం అవుతుంది" అని అన్నారు.
"వచ్చే ఏడాది జనవరిలో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతవరకూ ఏ అధ్యక్షుడూ వైట్ హౌస్‌లో అడుగు పెట్టీ పెట్టగానే ఇన్ని సమస్యలను ఎదుర్కొన్నది లేదు.
కరోనా మహమ్మారి, ఆర్థిక భారం, న్యాయవ్యవస్థ, ప్రమాదంలో పడిన దేశ గణతంత్ర వ్యవస్థ, పర్యావరణ మార్పులు... ఇలా కొత్త అధ్యక్షుడి ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. కానీ వారు దేశ ప్రజలందరి కోసం పాటు పడతారని నాకు నమ్మకముంది" అని ఒబామా తన ప్రకటనలో పేర్కొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. జో బైడెన్, కమలా హారిస్‌లకు అభినందనలు తెలిపారు.
"ఉపాధ్యక్షుడిగా భారత్, అమెరికాల మధ్య సంబంధాలను బలోపేతం చెయ్యడంలో మీ సహాకరం అమూల్యమైనది. మళ్లీ మీతో కలిసి పని చెయ్యబోతున్నందుకు ఆనందంగా ఉంది. రెండు దేశాలూ, ఇండో-యూఎస్ సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లగలవని ఆశిస్తున్నాను" అంటూ మోదీ బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కమలా హారిస్‌ను అభినందిస్తూ "మీ విజయం అమెరికాలోని భారతీయులందరికీ గర్వకారణం" అని అన్నారు.
అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు బైడెన్‌కు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
"బైడెన్, కమలా హ్యారిస్‌ల పరిణితి చెందిన నాయకత్వంలో భారత్, అమెరికాలు ఆ యా దేశాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి సాధించడానికి కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నాను" అంటూ సోనియా గాంధీ అభినందనలు తెలిపారు.
"అమెరికాను ఏకం చేసి, దిశానిర్దేశం చెయ్యగలరని ఆశాభావం వ్యక్తం చేస్తూన్నానంటూ" రాహుల్ గాంధీ బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కమలా హ్యారిస్‌కు అభినందనలు తెలుపుతూ "అమెరికాకు ఎన్నికైన తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్ మూలాలు భారతదేశంలో ఉన్నందుకు గర్వకారణంగా ఉంది" అని పేర్కొన్నారు.
వివిధ దేశాల అధ్యక్షుల అభినందనలు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బైడెన్, కమలా హ్యారిస్‌లకు శుభాకాంక్షలు తెలుపుతూ "ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్ నిర్వహించబోయే ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల కోసం ఎదురుచూస్తున్నాను. అంతేకాకుండా, అవినీతిని అంతం చేసే దిశలో అమెరికా అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
అలాగే, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల్లో శాంతిని సాధించే దిశగా యూఎస్‌తో కలిసి చేస్తున్న కృషిని కొనసాగిస్తామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
"అమెరికా, కెనడాలు సన్నిహితులే కాక మిత్రదేశాలు కూడా. ప్రపంచ వేదికపై ఈ రెండు దేశాలు ఒక ప్రత్యేక సంబంధాన్ని పంచుకుంటాయి. ఇకపై కూడా రెండు దేశాలూ కలిసి పని చేయగలవని ఆశిస్తున్నాను" అంటూ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అభినందనలు తెలిపారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దీన్నొక "చారిత్రాత్మక విజయం"గా అభివర్ణిస్తూ జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.
"అమెరికా మాకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశం. పర్యావరణ మార్పులతో సహా వాణిజ్యం, భద్రతా సమస్యలపై కలిసి పోరాడతాం”అని బోరిస్ జాన్సన్ తెలిపారు.
"రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని" జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్, తన అభినందన సందేశంలో తెలిపారు.
"నేటి కాలంలో మనం కలిసి పనిచేస్తూ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది" అని చెప్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
"అమెరికా కొత్త అధ్యక్షుడికి అభినందనలు. ఆస్ట్రియా, అమెరికాలు ఒకే రకమైన విలువలు పాటిస్తాయి. భవిష్యత్తులో కూడా మనం ఇలాగే కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నాను" అని ఆస్ట్రియా అధ్యక్షుడు సెబాస్టియన్ కుర్జ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్‌పై కేసు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)