You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ దేశంలో చర్చిలపై మహిళలు ఎందుకు దాడులు చేస్తున్నారు?
గర్భస్రావాలను దాదాపు నిషేధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పోలాండ్ అంతటా నిరసనలు జరుగుతున్నాయి. నిరసనకారులు దేశమంతటా చర్చి సేవలకు ఆటంకం కలిగించారు.
గర్భస్రావాలకు అనుకూలంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసనకారులు బైఠాయించారు.
రోమన్ క్యాథలిక్ చర్చి ప్రభావం బలంగా ఉన్న దేశంలో ఇలాంటి నిరసనలు అసాధారణమైనవిగా భావిస్తున్నారు.
అవయవలోపాలున్న పిండాలను నిర్మూలించడం రాజ్యాంగ విరుద్ధమని పోలాండ్ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన తరువాత ఈ నిరసనలు వెల్లువెత్తాయి.
ఏటా లక్ష మంది అబార్షన్ల కోసం విదేశాలకు..
పోలాండ్‌లో అబార్షన్లు చేయించుకోవడానికి ఉన్న అతికొద్ది న్యాయబద్ధ మార్గాల్లో ఒకదానికి అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం మూసివేసింది.
అత్యాచారం, వావివరుసలు లేని లైంగిక సంబంధం వల్ల కలిగే గర్భాన్ని తొలగించుకోవాల్సిన సందర్భాలు... తల్లి ప్రాణాలు కాపాడాల్సిన వైద్య అత్యవసర సందర్భాలలో మాత్రమే ఇక పోలాండ్‌లో గర్భస్రావానికి అనుమతిస్తారు.
పాలక 'నేషనలిస్ట్ లా అండ్ జస్టిస్ పార్టీ' ఎంపీలు గత ఏడాది చేసిన న్యాయ సవాలు నుంచి ఈ తీర్పు వచ్చింది.
ఐరోపాలు అత్యంత కఠినమైన అబార్షన్ చట్టాలున్న దేశం పోలాండ్. ఏటా సగటున ఈ దేశానికి చెందిన లక్ష మంది గర్భస్రావాల కోసం విదేశాలకు వెళ్తారు.
చర్చి పీఠం ఎదుట నిరసన
మహిళా హక్కుల కోసం పోరాడేవారు, మానవ హక్కుల సంఘాలను కలవరపెట్టిన ఈ వివాదాస్పద తీర్పును వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న నిరసనలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి.
కరోనావైరస్ నేపథ్యంలో ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలున్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు.
పోజ్నాన్ నగరంలో చర్చికి వచ్చిన ప్రజలకు అంతరాయం కలిగింది. అక్కడ కొందరు మహిళలు చర్చిలో పీఠం ఎదుట నిరసనలు తెలిపారు. గర్భస్రావాలకు అనుకూలంగా బ్యానర్లు ప్రదర్శించారు.
ప్రభుత్వ విధానాలపై చర్చి పెత్తనం ఎందుకు?
చర్చి సేవలను నిలిపివేసేలా మత గురువులను బలవంతం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునేటప్పటికి నిరసనకారులు నేలపై బైఠాయించారు.
కిరాకోలోని ఒక పార్కులో చెట్లకు కట్టిన తీగలకు నల్లరంగు లోదుస్తులను ఆరవేశారు నిరసనకారులు.
లోజ్ నగరంలోని క్యాథడ్రల్ చర్చి ఎదుట కూడా నిరసన చేపట్టారు. చర్చిని, దేశాన్ని కూడా విభజించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
పోలాండ్ ప్రభుత్వ విధానాలను క్యాథలిక్ చర్చి ప్రభావితం చేస్తోందంటూ విమర్శకులు ఆరోపించారు.
''ఒక లౌకిక దేశంలో నాకు ఏఏ హక్కులు ఉండాలన్నది చర్చి నిర్ణయిస్తోంది. నేనేం చేయాలో.. ఏం చేయకూడదో చర్చి నిర్ణయిస్తోంది.. ఇది నాకు బాధ కలిగించడంతో నిరసన తెలపడానికి వచ్చాను'' అన్నారు 26 ఏళ్ల జూలియా మియాక్.
‘మహిళలకు నరకం’
వార్సాలో చర్చి గోడలపై 'మహిళలకు నరకం', 'అన్‌లిమిటెడ్ అబార్షన్స్' వంటి నినాదాలు రాశారు నిరసనకారులు.
కాగా ఓ ప్రముఖ చర్చి ప్రవేశద్వారం వద్ద కొందరు రైట్‌వింగ్, నేషనలిస్ట్ భావాలున్న యువకులు చేరి మహిళా నిరసనకారులు లోనికి రాకుండా అడ్డుకున్నారు.
పోలాండ్‌లో 2014లో సీబీఓఎస్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 65 శాతం మంది అబార్షన్లను వ్యతిరేకించగా 27 శాతం మంది అనుకూలమని చెప్పారు. మరో 8 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు.
అయితే, ఇటీవలి అభిప్రాయ సేకరణలలో మాత్రం అబార్షన్ చట్టాలను కఠినతరం చేయడాన్ని వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- టర్కీ డ్రోన్ సూపర్ పవర్‌గా ఎలా మారింది?
- NBSA: భారత న్యూస్ చానళ్లకు నోటీసులు... క్షమాపణలు చెప్పాలని ఆదేశం
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- అజర్బైజాన్, అర్మేనియా: కాల్పుల విరమణను అజర్బైజాన్ సైనిక సన్నాహాలకు ఉపయోగించుకుందా
- పాకిస్తాన్‌లోని హిందూ ఆలయంలో విగ్రహాల ధ్వంసం
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)