పాకిస్తాన్: జిన్నా సమాధిని అవమానించిన ఆరోపణలతో మరియం నవాజ్ భర్త కెప్టెన్ సఫ్దర్ అరెస్ట్

కరాచీలో తాము ఉన్న హోటల్లోకి స్థానిక పోలీసులు చొరబడ్డారని, తన భర్త కెప్టెన్(రిటైర్డ్) సఫ్దర్‌ను అరెస్ట్ చేశారని కాసేపటి క్రితం పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) పార్టీ నేత మరియం నవాజ్ ట్వీట్ ద్వారా తెలిపారు.

కాయద్-ఎ-ఆజం సమాధికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారనే ఆరోపణలతో కెప్టెన్ సఫ్దర్, మరియం నవాజ్ సహా 200 మందిపై కేసు నమోదు చేశారని ఎఫ్ఐఆర్‌లో ఉంది.

దానితోపాటూ మహమ్మద్ అలీ జిన్నా సమాధిని వీరు అవమానించారని కూడా ఆరోపణలు నమోదు చేశారు.

కెప్టెన్ సఫ్దర్‌ను బ్రిగేడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో వీరిపై కేసు నమోదు చేశారు.

దీనికి సంబంధించి మరియం నవాజ్ ఒక వీడియో కూడా రీ-ట్వీట్ చేశారు. అందులో హోటల్‌లో తమ గదిలో విధ్వంసం సృష్టించారని చెప్పారు.

అంతకు ముందు, ఆదివారం ప్రభుత్వ వ్యతిరేక 11 పార్టీల కూటమి పీడీఎం కరాచీలోని జిన్నా బాగ్‌లో ఒక సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొనడానికి వచ్చిన మరియం నవాజ్, కెప్టెన్ సఫ్దర్ కరాచీలోనే ఉన్నారు.

దీనిపై స్పందించిన పాకిస్తాన్ కేంద్ర మంత్రి చౌధరి ఫవాద్ హుసేన్ ఒక ట్వీట్ చేశారు. చట్టాన్ని గౌరవించడానికి కెప్టెన్ సఫ్దర్ అరెస్ట్ ఒక ఉదాహరణ అన్నారు.

ఆయన తన ట్వీట్‌లో “కాయద్-ఎ-ఆజం మహమ్మద్ అలీ జిన్నా సమాధి. ఆయన సమాధి నీచ రాజకీయాలు చేసే చోటు కాదు. ఇది ప్రతి పాకిస్తానీకి పవిత్ర స్థలం. కాయద్-ఎ-ఆజం దగ్గర నిరసనలు, నినాదాలు చేయడం, బాధ్యతా రహిత చర్యలకు పాల్పడ్డం చట్టవిరుద్ధం. దీనికి శిక్ష పడాల్సిందే” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)