You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జపాన్ 10 లక్షల టన్నుల రేడియో ధార్మిక వ్యర్థాలను సముద్రంలో వదలనుందా.. అలా చేస్తే ఎంత ప్రమాదం
జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రంలో మిగిలిపోయిన రేడియో ధార్మిక జలాలను ఆ దేశం సముద్రంలోకి వదిలే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
2011 సునామీ సమయంలో న్యూక్లియర్ ప్లాంట్ సునామీ తాకిడికి గురి కావడం, ప్లాంట్‌ను చల్లబరిచే జలాలతోపాటు, అందులోని వివిధ ద్రవాలలో పెద్ద ఎత్తున రేడియో ధార్మికత చేరడంతో వాటిని ఏం చేయాలన్న అంశంపై సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది.
సముద్రంలో కలపాలన్న నిర్ణయాన్ని పర్యావరణవేత్తలు, మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని, భయపడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే దీనిపై జపాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం ఫుకుషిమా అణుకేంద్రంలో దాదాపు 10 లక్షల టన్నుల అణుధార్మికత నిండిన జలాలు నిల్వ ఉన్నాయి. రేడియో యాక్టివిటీని తగ్గించేందుకు ఇప్పటికే పలుమార్లు ఈ జలాలను ఫిల్టర్ చేశారు.
అయితే 2022 నుంచి ఈ జలాలను సముద్రంలో కలిపే అవకాశం ఉందంటూ జపాన్‌లోని జాతీయ పత్రికలు నిక్కేయి, యొమియురి షింబన్‌తోపాటు అనేక న్యూస్ పేపర్లు రాశాయి.
ఈ నీటిని సముద్రంలోకి వదలబోయే ముందు మరోసారి శుద్ధి చేస్తారని, మొత్తం మీద ఆ జలాల గాఢత 40రెట్లు తగ్గుతుందని యొమియురి షింబన్ పత్రిక రాసింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి 30 సంవత్సరాలు పడుతుందని కూడా ఆ పత్రిక పేర్కొంది.
సముద్రంలో కలిపే అంశంపై ఈ ఏడాది చివరికల్లా అధికారిక నిర్ణయం వెలువడవచ్చని క్యోడో నూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఆ నీటిని అక్కడే ఉంచలేరా ?
ఒక్కపక్క వర్షపు నీరు, మరోపక్క భూగర్భ జలాలు కలుస్తుండటంతో ఈ నీటిని నిల్వ ఉంచడం కష్టంగా మారుతోంది. దీంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే అనేక వడపోతల ద్వారా రేడియో ధార్మికతను చాలా వరకు తగ్గించగలిగారు. కానీ ట్రిటియం అనే ఐసోటోప్‌ను తొలగించలేకపోవడంతో పెద్ద పెద్ద ట్యాంకులలో ఈ నీటిని అలాగే నిల్వ చేసి ఉంచాల్సి వస్తోంది. 2022 నాటికి ఈ ట్యాంకులు నిండిపోతాయని అంచనా వేస్తున్నారు.
ఈ జలాలను ఏం చేయాలనే దానిపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని, కానీ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని జపాన్ పరిశ్రమల మంత్రి హిరోషి కజియామా అన్నారు.
అయితే సముద్రజలాల్లో ఈ నీటిని కలపాలన్న నిర్ణయాన్ని పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నీరు సముద్రంలో కలిస్తే తమ దగ్గర చేపలు కొనేవాళ్లు ఉండరని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఈ నీరు కలవడం వల్ల పెద్దగా నష్టం ఉండదని, ఇంత పెద్ద సముద్రంలో అవి సులభంగా కలిసిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
2011లో ఏం జరిగింది?
2011 సంవత్సరం మార్చి 11న రిక్టర్ స్కేల్‌పై 9.0 తీవ్రతతో జపాన్‌లో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంపం కారణంగా సునామీ ఏర్పడి 15మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి.
అయితే భూకంపం తాకిడికి తట్టుకున్నప్పటికీ తర్వాత వచ్చిన సునామీ ధాటికి మాత్రం అణు కేంద్రం తట్టుకోలేకపోయింది.
రియాక్టర్‌ను చల్లబరిచే యంత్రాంగం పని చేయకపోవడంతో, ప్లాంట్‌లో రేడియో ధార్మికత విడుదల కావడం మొదలుపెట్టింది. ఇది 1986లో చెర్నోబిల్‌లో జరిగిన అణు ప్రమాదం తర్వాత ఇదే అతి పెద్ద న్యూక్లియర్ యాక్సిడెంట్‌గా చెబుతున్నారు.
2011నాటి జపాన్ సునామీలో 18,500మంది మరణించారు. 160,000మంది నిర్వాసితులుగా మారారు.
ఈ ప్రమాదం కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారికి బిలియన్ల డాలర్ల మొత్తాన్ని ఇప్పటికే పరిహారంగా అందించారు. ఈ ప్రమాదం కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం, ప్లాంట్ మేనేజ్‌మెంట్ మరో 9.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.70 కోట్లు) పరిహారంగా చెల్లించాలన్న ఆదేశాలను జపాన్ హైకోర్టు సమర్ధించింది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- ‘నన్ను నేను చంపుకోవాలనే ప్రయత్నాలను చంపేశా.. ఇలా..’
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.