ఉత్తరకొరియా సైనిక కవాతు: క్షిపణుల ప్రదర్శన.. బూడిదరంగులో కోటులో కనిపించిన కిమ్ - BBC NewsReel

ఉత్తరకొరియాలో శనివారం రాత్రి భారీ సైనిక కవాతు నిర్వహించారు. పాలక వర్కర్క్ పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కవాతులో సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు.

ఉత్తరకొరియాలో తన ఆయుధ, క్షిపణి ప్రదర్శనకు ఇలాంటి కవాతులను ఉపయోగించుకుంటుంది. శనివారం పగటిపూట కూడా నిర్వహించిన కార్యక్రమంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు స్పష్టంగా కనిపించాయని నిపుణులు చెబుతున్నారు.

గత రెండేళ్లలో ఇదే తొలి కవాతు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్దివారాల ముందు నిర్వహించడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా సుప్రీంలీడర్ కిమ్ మధ్య 2018లో తొలి భేటీ జరిగినప్పటి నుంచి ఉత్తరకొరియా తన బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించలేదు.

అయితే, శనివారం వేకువనే ఈ కవాతు జరిగిందని దక్షిణ కొరియా సైనికవర్గాలు చెబుతున్నాయి.

విదేశీ మీడియాను అనుమతించకపోవడంతో అక్కడ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు.. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఎడిట్ చేసి ఇచ్చిన ఫుటేజ్ ఆధారంగానే అక్కడ ఏం జరిగిందనేది అంచనాలు వేస్తున్నారు.

బూడిద రంగు పాశ్చాత్య శైలి సూటు ధరించిన కిమ్‌కు చిన్నారులు పుష్పాలు అందించినట్లు ఫొటోలు విడుదల చేశారు.

కవాతు సందర్భంగా కిమ్ ప్రసంగించారు. దేశ ఆత్మరక్షణ కోసం, దాడులను తిప్పికొట్టడానికి మిలటరీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.

ఉత్తరకొరియాలో ఎవరికీ కోవిడ్ సోకలేదని కూడా ఆయన తన ప్రసంగంలో చెప్పారు.

ఈ ప్రమాదకర వైరస్‌తో పోరాడుతున్న ప్రపంచ ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు.

రాహుల్ గాంధీ: జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లేవు... మీకేమో వేల కోట్ల విమానమా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక వీడియో షేర్ చేస్తూ, అందులో మోదీ ప్రభుత్వంలో జవాన్ల పరిస్థితి గురించి ప్రశ్నలు లేవనెత్తారు.

రాహుల్ గాంధీ షేర్ చేసిన వీడియోలో కొంతమంది జవాన్లు ఒక ట్రక్కు లోపల కూర్చుని తమను నాన్-బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పంపించడం గురించి చర్చించుకుంటూ కనిపిస్తారు.

ఈ వీడియోను ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ "మన జవాన్లను నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కుల్లో అమరులు కావడానికి పంపిస్తున్నారు. ప్రధానికి 8400 కోట్ల విమానం. ఇది న్యాయమేనా" అని ప్రశ్నించారు.

ఈ వీడియోలో ట్రక్కులో కూర్చున్న జవాన్లలో ఒకరు, నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పంపిస్తూ మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మిగతావారితో అంటుంటారు.

"నాన్ బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనంలో మనల్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ బీపీ వాహనంలోనే ప్రాణాలకు రక్షణ లేదు, వీళ్లు నాన్ బీపీలో తీసుకెళ్తున్నారు. మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చెప్పిన తర్వాత కూడా బలవంతంగా ఎక్కించారు" అన్నాడు. ఆ జవాన్ ముఖాన్ని గుడ్డతో కప్పుకుని ఉన్నారు.

ఇంతలో మరో జవాన్ "అది చెప్పడం కమాండర్ పని" అంటారు. "కమాండర్ చెప్పకపోతే మనం తెలిసి తెలిసీ మన జీవితాలను నాశనం చేసుకోవాలా. కమాండర్ చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయన చెప్పడు. ఓసీ సార్, తన ఐదుగురు మనుషులను తీసుకుని బీపీలో వెళ్తారు. అందులో మరో పది మంది వెళ్లవచ్చు. మొత్తం సెక్షన్‌ను అందులోనే తీసుకెళ్లచ్చుకదా? వెళ్లి చావండని మనల్ని ఇందులో ఎక్కించారు" మొదటి జవాన్ అంటారు.

ట్రక్కును చేత్తో కొట్టిన ఆ జవాన్, దీన్ని రాయితో కొట్టినా అది ఆ వైపు నుంచి ఈ వైపు వచ్చేస్తుంది అన్నారు. తర్వాత కెమెరా ముందుకు వచ్చే మరో జవాన్ "వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఇది పనికిరాని వాహనం. ఓసీ, ఇన్‌స్పెక్టర్ బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంలో వెళ్తారు. టీమ్‌ను నాన్ బీపీలో పంపించండి అని చెబుతారు" అన్నారు.

అదే సమయంలో "వాహనం ఎక్కడ్నుంచి తేవాలి అంటున్నారు. మీరు ఏర్పాటు చేయవచ్చుగా. డ్యూటీకి తీసుకెళ్తున్నప్పడు అది మీ పని. మా జీవితాలతో ఆడుకుంటున్నారా. మా కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారా. మాతో డ్యూటీ చేయిస్తున్నప్పుడు, మాకు ఏర్పాట్లు చేయడం కూడా మీ బాధ్యత" అని మొదటి జవాన్ అంటారు.

రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో ఈ వీడియో సోర్స్ గురించి సమాచారం ఇవ్వలేదు. ట్రక్‌లో కూర్చున్న వారు సైనికులా లేక పారామిలిటరీనా అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడ డ్యూటీ చేయడానికి వెళ్తున్నారో కూడా ఆ వీడియోలో చెప్పడం లేదు.ఈ వీడియో ప్రామాణికతను బీబీసీ ధ్రువీకరించడం లేదు.

ఆర్మేనియా-అజర్బైజాన్: రష్యా జోక్యంతో తాత్కాలిక యుద్ధ విరమణకు అంగీకారం

వివాదాదస్పదమైన నాగోర్నో-కరబఖ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేస్తున్న ఆర్మేనియా, అజర్బైజాన్ తాత్కాలిక యుద్ధ విరమణకు అంగీకరించాయి.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. రష్యా మధ్యవర్తిత్వంతో మాస్కోలో పది గంటల పాటు జరిగిన చర్చల తర్వాత రెండు దేశాలు శనివారం మధ్యాహ్నం నుంచి యుద్ధ విరమణకు అంగీకరించాయి.

ఈ సమయంలో రెండు దేశాలు యుద్ధంలో చనిపోయిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్తాయి, యుద్ధ ఖైదీలను మార్చుకుంటాయి. తర్వాత శాంతి పునరుద్ధరణ గురించి రెండు దేశాల మధ్య ఈ చర్చలను ముందుకు తీసుకెళ్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు.

నాగోర్నో-కరబఖ్ ప్రాంతం కోసం రెండు వారాల క్రితం యుద్ధం మొదలైన తర్వాత రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఈ చర్చలకు రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా హాజరయ్యారు.

నాగోర్నో-కరబఖ్‌లో కొనసాగుతున్న యుద్ధంలో నివాస ప్రాంతాలపై బాంబులు వేయడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ యుద్ధంలో ఇప్పటివరకూ 300 మంది చనిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేల మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారు.

నాగోర్నో-కరబఖ్ ఒక పర్వత ప్రాంతం. ఇది ఎక్కువగా అజర్బైజాన్‌లో భాగంగా ఉండేది. కానీ 1994లో జరిగిన యుద్ధం తర్వాత ఈ ప్రాంతాన్ని ఆర్మేనియా ఆక్రమించింది. తూర్పు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఆర్మేనియా, అజర్బైజాన్ నాగోర్నో-కరబఖ్ ప్రాంతం గురించి 1980, 1990 దశాబ్దాల మొదట్లో యుద్ధాలు చేశాయి.

తాజా ఉద్రిక్తతలకు మీరంటే మీరే కారణం అని పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.

వైట్‌హౌజ్‌లో 'సూపర్ స్ప్రెడర్' కార్యక్రమం - డాక్టర్ ఫౌచీ

గత నెలలో వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమం కోవిడ్-19 వ్యాప్తికి కారణమైందని అమెరికా ప్రముఖ వైరస్ నిపుణులు డాక్టర్ ఆంథొనీ ఫౌచీ విమర్శించారు.

అధ్యక్షుడు ట్రంప్ తన జ్యుడిషియల్ నామినీని పరిచయం చేసిన సందర్భంగా ఈ ‘సూపర్ స్ప్రెడర్’ కార్యక్రమం నిర్వహించారని కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ లో సభ్యులైన డాక్టర్ ఫౌచీ చెప్పారు.

ఈ కార్యక్రమం వల్ల వైట్ హౌస్ సిబ్బంది, వారితో కాంటాక్టులోకి వచ్చినవారు చాలా మంది కరోనా ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని చెబుతున్నారు.

మూడు రోజులు కరోనా చికిత్స తర్వాత మిలిటరీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ట్రంప్ కూడా శనివారం వైట్‌హౌస్‌లో స్వయంగా ఒక కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు.

మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడంపై వైట్‌హౌస్‌లో అయిష్టత వ్యక్తం కావడంపై మీరేమనుకుంటున్నారని సీబీఎస్ శుక్రవారం డాక్టర్ ఫౌచీని అడిగింది.

“ఇక్కడ స్వయంగా గణాంకాలే చెబుతున్నాయి. వైట్‌హౌస్‌లో ‘సూపర్ స్ప్రెడర్’ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ మాస్కులు వేసుకోకుండా చాలా మంది గుమిగూడారు” అని ఆయన సమాధానం ఇచ్చారు.

నిపుణులు కనీసం ఆరు నెలలు మాస్కులు వేసుకోవాలంటున్నారని కూడా డాక్టర్ ఫౌచీ చెప్పారు. ఇటీవల మిలిటరీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కోవిడ్-19 ప్రయోగాత్మక చికిత్స తీసుకున్నానన్న ట్రంప్ దానితో కోవిడ్-19 ‘నయం’ అవుతుందని చెప్పడాన్ని ఆయన ఖండించారు.

అధ్యక్షుడు ట్రంప్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కోనీ బారెట్‌ను నామినేట్ చేసిన సందర్భంగా సెప్టెంబర్ 26న వైట్‌హౌస్‌లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కరోనా వ్యాపించడానికి కారణం అని భావిస్తున్నారు. దీనికి హాజరైన చాలామందికి పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

కోవిడ్-19 జాగ్రత్తల్లో భాగంగా అమెరికా రాజధానిలో జనం బారీగా గుమిగూడడంపై ఇప్పటికీ నిషేధం ఉంది. కానీ వైట్‌హౌస్ లాంటి వాటిలో మాత్రం మినహాయింపు ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)