కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చేసిన బీఎంసీ, ముంబయిని పీవోకేతో పోల్చిన కంగనా -News reel

ముంబయిలోని కంగనా రనౌత్‌కు చెందిన భవనంలో కొంత భాగాన్ని ముంబయి మహానగర పాలక సంస్థ అధికారులు బుధవారం కూల్చివేశారు. భవనంలో అక్రమ మార్పులు చేశారని, అందుకే దీన్ని కూల్చివేస్తున్నామని మున్సిపల్ అధికారులు వివరించారు.

కూల్చివేతకు సంబంధించిన చిత్రాలను కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. మరోసారి ముంబయిని ఆమె పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో ఆమె పోల్చారు.

ఇదివరకు, ఆమె ఇలా చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది.

బీఎంసీ ప్రతినిధులు సోమవారం కూడా కంగనా కార్యాలయానికి వెళ్లారు. లీకేజీ సరిచేసుకోవాలని ఓ నోటీసును ఇచ్చారు. అయితే తన బంగ్లాను కూల్చేస్తారేమోనని సోషల్ మీడియాలో కంగనా వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం మాత్రం ఈ రోజు బీఎంసీ వారు తన కార్యాలయానికి రాలేదని కంగన వ్యాఖ్యానించారు.

''సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో బీఎంసీవారు బుల్డోజర్లు తీసుకురాలేదు. కేవలం ఒక నోటీసు అతికించి వెళ్లిపోయారు. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు''

బుధవారం బీఎంసీ అధికారులు ఆఫీస్‌కు చేరుకున్నప్పుడు కంగనా మళ్లీ ట్వీట్ చేశారు. ''ఇది ముంబయిలోని మణికర్ణిక ఫిల్మ్స్ ఆఫీస్. దీని కోసం నేను 15 ఏళ్లు కష్టపడ్డాను. సినీ నిర్మాత అయ్యాక.. నాకొక సొంత కార్యాలయం ఉండాలని కలలు కన్నాను. అయితే ఇప్పుడన్నీ చెదిరిపోయినట్లు అనిపిస్తోంది''

''కంగనా కార్యాలయానికి బీఎంసీ బృందం చేరుకుంది. అయితే అక్కడకు అధికారులు ఎందుకు వెళ్లారో తెలియదు. అక్కడి వార్డు అధికారే దీనిపై వివరాలు తెలియజేయగలరు''అని బీబీసీతో బీఎంసీ అధికారి చెప్పారు.

ముంబయి తనకు సురక్షితంగా అనిపించడంలేదని ఇటీవల కంగన వ్యాఖ్యానించారు. ముంబయిని ఆమె పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారు. ఆ తర్వాత ఆమెను హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తదితరులు విమర్శించారు.

సంజయ్ రౌత్, కంగనల మధ్య వాగ్వాదానికి తాజా ఘటనకు సంబంధముందని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసుకు సంబంధించి ముంబయి పోలీసులను తరచూ కంగన ప్రశ్నిస్తున్నారు. ముంబయి పోలీసులపై తనకు నమ్మకంలేదని కూడా వ్యాఖ్యానించారు.

ముంబయిని పీవోకేతో పోల్చడమంటే మహారాష్ట్రను అవమానించడమేనని ఇటీవల సంజయ్ రౌత్ విమర్శించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది.

కంగనకు కేంద్ర ప్రభుత్వం సోమవారం వై ప్లస్ భద్రతను కేటాయించింది. అయితే, ముంబయి లేదా మహారాష్ట్రను విమర్శించేవారికి కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతతో సత్కరిస్తుందని అనిల్ దేశ్‌ముఖ్ వ్యాఖ్యానించారు.

గ్రీస్‌లో వలసదారుల శిబిరాన్ని చుట్టుముట్టిన మంటలు

గ్రీసులో వలసదారులున్న ఒక శిబిరాన్ని మంటలు చుట్టుముట్టాయి. గ్రీసులోని ఇలాంటి శిబిరాల్లో ఇదే అతి పెద్దది. లెస్బాస్ దీవిలో ఉన్న ఈ వలస శిబిరంలో 13 వేల మందికిపైగా ఉన్నారు.

మంటలు చెలరేగిన వెంటనే అందులో ఉన్న వలస ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు గ్రీస్ అధికారులు చెప్పారు.

10 ఫైర్ ఇంజిన్లు, 25 మందికి పైగా ఫైర్ ఫైటర్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఎవరికైనా ప్రాణహాని జరిగినట్లు ఇంతవరకు సమాచారం లేదు. మొత్తం శిబిరం అంతా మంటలు అంటుకున్నాయని స్థానికులు కొందరు బీబీసీకి చెప్పారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు.

మరోవైపు ఈ శిబిరంలో 35 మందికి కరోనావైరస్ సోకినట్లు అధికారవర్గాలు చెప్పాయి.

చేప చనిపోయిందని కొవ్వొత్తుల ర్యాలీలు.. దేశాధ్యక్షుడు సహా సంతాప సందేశాలు

ఆఫ్రికా దేశం జాంబియాలో గుడ్‌లక్ చేపగా పిలుచుకునే మఫిషి చేప మరణించడంతో కొవ్వొత్తుల ర్యాలీలు, సంతాప ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దేశాధ్యక్షుడు ఎడ్గార్ లుంగు కూడా చేప మృతికి సంతాపం ప్రకటించారు.

దేశంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీ అయిన కాపర్‌బెల్ట్ యూనివర్సిటీలో ఈ చేప ఉండేది. ఇక్కడి విద్యార్థులలో చాలామంది తమకు పరీక్షల్లో ఈ చేప మంచి చేస్తుందని గత రెండు దశాబ్దాలుగా భావిస్తూవచ్చారు.

మఫిషి అంటే స్థానిక బెంబా భాషలో పెద్ద చేప అని అర్థం. యూనివర్సిటీలోని చెరువులో ఇది 22ఏళ్లు జీవించినట్లు విద్యార్థి నాయకుడు లారెన్స్ కసోందే వివరించారు. మృతికిగల కారణాలపై ఇంకా దర్యాప్తు మొదలు కాలేదని చెప్పారు.

''ఇంకా అంత్యక్రియలు నిర్వహించలేదు. మఫిషికి ఎంబామింగ్ నిర్వహిస్తాం''అని ఆయన చెప్పారు.

పరీక్షలకు వెళ్లేముందు విద్యార్థులు దీనికి మొక్కుకుని వెళ్లేవారని, ఇది ఒత్తిడిని తగ్గిస్తుందని ఇక్కడి విద్యార్థులు నమ్ముతారని బీబీసీ జాంబియా రిపోర్టర్ కెన్నడీ గోండ్వే తెలిపారు.

జాంబియా అధ్యక్షుడు లుంగు తన సంతాప సందేశంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ఉటంకించారు. ''దేశ గొప్పతనం, నైతికత అనేవి దేశంలోని జంతువులను ఎలా చూస్తున్నారో చూసి చెప్పొచ్చు''అని వ్యాఖ్యానించారు.

చార్లీ హెబ్డో కేసు: తుపాకీ గురిపెట్టి పత్రికా కార్యాలయంలోకి సాయుధులు ఎలా ప్రవేశించారంటే..

ఫ్రాన్స్‌లోని చార్లీ హెబ్డో మ్యాగజైన్‌ కార్యాలయంలోకి సాయుధులు ఎలా ప్రవేశించారో ఫ్రెంచ్ కోర్టుకు కార్టూనిస్టు కారిన్నే రే వివరించారు.

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్లు ముద్రించినందుకు 2015లో ఈ దాడి చేసినట్లు అతివాద ఇస్లామిక్ సంస్థ తెలిపింది. దాడిలో 17 మంది మరణించారు. సాయుధులు ముగ్గురినీ పోలీసులు హతమార్చారు.

దీని ఘటన ఫ్రాన్స్‌లో వరుస జీహాదీ దాడులు జరిగాయి. వీటిలో 250 మందికిపైనే మరణించారు.

చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడిచేయడంలో 14 మంది సాయుధులకు సాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన కేసు విచారణ సమయంలో రే వాంగ్మూలం ఇచ్చారు.

''సిగరెట్ తాగేందుకు కిందకు వెళ్లినప్పుడు ఇద్దరు సాయుధులు ఎదురుపడ్డారు. వారి చేతుత్తో రైఫిల్స్ ఉన్నాయి. మాకు చార్లీ హెబ్డో కావాలని వారు అన్నారు. చంపేస్తానని బెదిరించడంతో వారిని రెండో అంతస్తులోని కార్యాలయం లోపలకు తీసుకొచ్చాను. మీరు మహమ్మద్ ప్రవక్తను అవమానించారు. మేం అల్‌ఖైదా సభ్యులం అని సాయుధులు చెప్పారు''అని ఆమె వివరించారు.

''తుపాకీ గురి పెట్టడంతో ఎంట్రీ దగ్గర పాస్‌కోడ్ నొక్కి.. సాయుధుల్ని లోపలకు తీసుకొచ్చాను. నాకు చాలా భయమేసింది. ఆందోళనలో అసలు ఆలోచించలేకపోయాను. ఏమీ చేయలేకపోయాను''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)