కరోనావైరస్ మహమ్మారి కాలంలో డిజిటల్ డిటాక్స్ చేయటం ఎలా? ఫోన్ ఉపయోగించే సమయాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?

    • రచయిత, మేరీ హోలండ్
    • హోదా, వర్క్‌లైఫ్, బీబీసీ

కరోనావైరస్ మహమ్మారి వ్యాపిస్తుండటంతో సామాజిక దూరం నియమనిబంధనలు పాటిస్తూ, గంటల తరబడి ఒంటరిగా ఉండాల్సివస్తున్న పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్లు, ఇతర డివైజ్‌ల స్క్రీన్లు చాలా మందికి ఊరటనిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చూడటం వారం రోజుల్లో రెట్టింపయింది. మెసెంజర్ గ్రూప్ వీడియో కాల్స్‌ 70 శాతం పెరిగాయని ఫేస్‌బుక్ చెప్పింది. వాట్సాప్ వినియోగం 40 శాతం పెరిగింది.

‘‘తెలియని పరిస్థితులను ఎదుర్కోవటానికి మన ఫోన్లు చేతుల్లోకి తీసుకోవటం ఒక సాధారణ ప్రక్రియ. మన ఆందోళనను తగ్గిస్తుందనే ఆశతో.. మనం మన స్క్రీన్లకు, అవి అందించే వార్తలకు అనుసంధానమై ఉంటాం’’ అని అమెరికాకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త, ‘డివిక్టెడ్: బ్యాలన్సింగ్ లైఫ్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎ డిజిటల్ వరల్డ్’ పుస్తక రచయిత డోరీన్ డాడ్జెన్ మాగీ పేర్కొన్నారు.

కరోనావైరస్ సంక్షోభం న్యూయార్క్ నగరాన్ని చుట్టుముట్టటానికి కొన్ని వారాల ముందు నేను ఇన్‌స్టాగ్రామ్‌ను డిలిట్ చేశాను. సరకుల దుకాణం క్యూలో నిల్చునో, సబ్‌వే ప్లాట్‌ఫాం మీద నిల్చునో ఆ యాప్‌ను బుద్ధిలేకుండా స్క్రోల్ చేయటం విసుగుపుట్టించింది.

ఒక వారం రోజుల పాటు ఆ యాప్ లేకుండా ఉన్న తర్వాత.. నేను ఇంతకుముందులా ఎక్కువగా ఫోన్ చేతిలో పట్టుకోవటం లేదని నాకు అర్థమైంది. అది ఒక రకమైన స్వేచ్ఛా భావననిచ్చింది.

అంతలో లాక్‌డౌన్ మొదలైంది. ప్రపంచంతో నాకు పూర్తిగా సంబంధం తెగిపోయినట్లు అనిపించింది. మిగతా వాళ్లందరూ ఎలా ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలని బలంగా అనిపించింది. మళ్లీ ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. అయితే ఈసారి ఈ యాప్ వల్ల సమయం వృధా అవుతోందని అనిపించలేదు. పైగా మరింత ఉపయోగకరంగా అనిపించింది. నేను భౌతికంగా ఎవరినీ కలవలేకపోతుండటం వల్ల.. నా ఫోన్‌తో గడపటం మంచిదే అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా స్నేహితులు క్వారంటైన్‌ను ఎలా ఎదుర్కొంటున్నారో చూడటానికి వారితో అనుసంధానం కావాలనుకున్నాను. మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా వాడుకోవాలో సెలబ్రిటీ చెఫ్‌ల సలహాలు అవసరమయ్యాయి. మాస్కులు తయారు చేస్తున్న బ్రాండ్లు ఏవి, విరాళం ఇస్తున్న సంస్థలేవి అనే సమాచారం కావాల్సివచ్చింది.

ఫోన్ వాడుతూ ఉండటం వల్ల సానుకూలమైనదేదో లాభిస్తోందని నేను అనుకుంటున్నంతలోనే అదేమీ కాదని తేలింది. లాక్‌డౌన్ రెండో వారంలో ఇన్‌స్టాగ్రామ్‌లో సానుకూల అంశాల కోసం నా ఫోన్ కోసం అందుకున్న ప్రతిసారీ.. ఆందోళన కలిగించే అంతులేని వార్తల నోటిఫికేషన్లు వరదలా పోటెత్తాయి.

అవసరం, విసుగు, ఆందోళనల కారణంగా మనం ఫోన్లకు అతుక్కుపోతుంటే.. అంతసేపు స్క్రీన్ల ముందు గడపటం వల్ల కూడా చాలా మంది ఆందోళనకు లోనవుతున్నారు. ఇది ఒక సమస్యగా మారింది.

కానీ మన డివైజ్‌లను మూసేసి పక్కన పెట్టటం అంత సులభం కాదు. ఇప్పుడు మన ప్రపంచాలు మొత్తం మన ఫోన్లలో ఉంటే.. గతంలో ఎన్నడూ లేనంతగా మన జీవితాలు మన స్క్రీన్ల చుట్టూ తిరుగుతుంటే.. మన డిజిటల్ ఆందోళనను తగ్గించుకోవటం ఎలా?

హద్దులు గీయండి...

మనం మనం కోరుకునే దానికన్నా ఎక్కువ సేపు ఫోన్లతో గడుపుతున్నామని మనకు తెలుసు. కానీ ఇతరులతో మన అనుసంధానానికి, మనం ఉత్సాహంగా ఉండటానికి ఫోన్లే మార్గంగా మారిపోయినపుడు.. సాంకేతిక సరిహద్దులు గీయటం కష్టం.

జూమ్, ఫేస్‌టైమ్, ఆన్‌లైన్ వ్యాయామాలు, మనల్ని అప్రమత్తంగా ఉంచే యాప్‌లు.. అన్నిటికీ మన కళ్లు స్క్రీన్లకు అతుక్కుని ఉండటం అవసరం.

‘‘ఇప్పుడు అందరూ స్క్రీన్ టైమ్ విషయంలో ఆందోళనగా ఉన్నారు. జనం తాము రోజుకు 12 గంటల పాటు స్క్రీన్ మీద గడుపుతుండటం ఎంత విచారకరంగా ఉందో ట్వీట్లు, కామెంట్లలో చెప్తున్నారు’’ అని బ్రిటన్‌కు చెందిన ‘టైమ్ టు లాగ్ ఆఫ్’ అనే డిటాక్స్ ఉద్యమ వ్యవస్థాపకురాలు తానియా గూడిన్ పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితి చాలా భిన్నమైనదనటంలో సందేహం లేదు. అయినాకూడా అవే సూత్రాలు చాలా వర్తిస్తాయని నేను అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.

స్క్రీన్ కోసం వెచ్చించే సమయంలో సహాయకర సమయం - హానికర సమయం మధ్య హద్దులు గీయాలి. ‘‘వ్యాయామం వీడియోలు, మ్యూజియం పర్యటనలు, వంట పాఠాలు వంటి వాటి కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు. కానీ మనకు విసుగుపుట్టిందనో, ఆందోళనగా ఉందనో స్క్రీన్‌కు అతుక్కుపోతే అది మేలు చేసేది కాదు’’ అని గూడిన్ పేర్కొన్నారు. వార్తలు చూడటానికి కూడా ఇదే వర్తిస్తుంది. ‘‘జనం తమకు భరోసా కావాలని కోరుతున్నారు. కానీ ఇది సమస్యగా మారుతోంది. ఆందోళనను పెంచుతోంది’’ అని ఆమె చెప్పారు.

టెక్ ఆందోళనను తగ్గించుకోవటానికి సరిహద్దులు గీయటానికి, అలవాట్లు మార్చుకోవటానికి ప్రయత్నించినా కూడా.. మన వృత్తి జీవితం, ఇంటి జీవితాలు అకస్మాత్తుగా ఒకటిగా కలిసిపోయినపుడు ఆరోగ్యకరమైన విధానాలను బలోపేతం చేసుకోవటం ఇంకా కష్టం.

ఉదయం, సాయంత్రం రోజువారీ కార్యక్రమాలను నిర్ధారించుకోవాలని గూడిన్ సిఫారసు చేస్తున్నారు. ‘‘మీరు ప్రయాణించాల్సిన అవసరం లేనపుడు.. రోజు ముగియటమూ ఉండదు. మనం వాటిని సృష్టించుకోవాలి’’ అని సూచించారు. వేర్వేరు కార్యకలాపాలకు వేర్వేరు డివైజ్‌లను ఉపయోగించటం కూడా.. పనులు, ఆటలకు మధ్య తేడా ఉండేలా చూసుకోవచ్చునని పేర్కొన్నారు. ‘‘పని కోసం మీ ల్యాప్‌టాప్ వాడండి.. ఆటల కోసం మీ మొబైల్ వాడండి. తద్వారా మీరు ఒక దానిని వాడుతున్నపుడు మరొక డివైజ్‌ను దూరం పెట్టొచ్చు’’ అని చెప్పారు.

అలాగే.. డివైజ్‌లో అందుబాటులో ఉన్నదానిని వినియోగించటం కాకుండా.. అర్థవంతమైన కంటెంట్ కోసం వెదకాలని సైకాలజిస్ట్ డాడ్జెన్ మాగీ సూచించారు. అదృష్టవశాత్తూ కరోనా మహమ్మారి మధ్యలో సహాయకరమైన సోషల్ మీడియా సమాచారం గతంలో కన్నా ఎక్కువగా లభిస్తోంది.

ఆఫ్‌లైన్‌లోకి వెళ్లండి...

ప్రస్తుతం మన జీవితాలను వీడియో కాల్స్ నడుపుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. మీటింగ్‌లు, లైవ్ వ్యాయామాలు, స్నేహితులతో సమావేశాలు, డిన్నర్ పార్టీల వంటి వాటితో జూమ్ బర్నౌట్ (ఆన్‌లైన్ సమావేశాలతో విసిగిపోవటం) కూడా జరుగుతోంది. స్క్రీన్ ఆందోళన ప్రభావాన్ని లేకుండా చూసుకోవటానికి.. ఇతరులతో సంభాషించటానికి గల ఇతర మార్గాల గురించి మరచిపోకుండా ఉండటం ముఖ్యం.

వాయిస్ కాల్స్ ఇంకా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని గూడిన్ చెప్తారు.

స్క్రీన్‌ అవసరం లేకుండా మనం చేయగల పనులు చాలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రింట్ మేగజీన్లు తెప్పించుకోవటం, భౌతిక పజిల్స్ పరిష్కరించటం వంటివి చేయవచ్చు. చాలా మంది పుస్తకాలను కూడా ఆశ్రయిస్తున్నారు. జనం తమ పఠనా సమయాన్ని పెంచటం వల్ల సానుకూల ప్రభావం కూడా ఉన్నట్లు కొన్ని బుక్‌స్టోర్లు చెప్తున్నాయి. గత రెండు వారాల్లో పుస్తకాల విక్రయాలు గణనీయంగా పెరిగాయని బ్రూక్లిన్‌లోని బుక్స్ ఆర్ మ్యాజిక్ యజమాని, రచయిత ఎమ్మా స్ట్రాబ్ తెలిపారు.

‘‘సాధారణంగా సెలవుల్లో కనిపించే నంబర్లను ఇప్పుడు చేరుకుంటున్నాం. అంటే.. సంవత్సరంలో అత్యధిక అమ్మకాలు జరిగే కాలం అది’’ అని ఆ స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ కొలీన్ కాలరీ చెప్పారు. అమెజాన్ వంటి రిటైలర్లు పుస్తకాల బట్వాడా ప్రాధాన్యాన్ని తగ్గించటం కూడా జనం పుస్తకాలు చదవటం పెరిగిందన్నారు.

గత శనివారం నేను సోఫాలో వాలి నా నవలను పూర్తి చేయటానికి రెండు గంటలు పట్టింది. నేను ఫోన్ స్విచాఫ్ చేసి.. కరోనావైరస్‌తో నిమిత్తం లేని ఓ ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోయాను. ఆ రోజు రాత్రి కొన్ని టెక్ట్స్ మెసేజ్‌లు పంపించటానికి ముందు.. నా ఫోన్‌లోని ఏ యాప్‌కూ 12 గంటల పాటు యాక్సెస్ లేకుండా ఆఫ్ చేశాను. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి పక్క గదిలో పడేశాను.

నాకు మళ్లీ అదే స్వేచ్ఛానుభూతి.. కొన్ని వారాల కిందట ఇన్‌స్టాగ్రామ్‌ను డిలిట్ చేసినపుడు కలిగిన అనుభూతే మళ్లీ కలిగింది. అప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది: ప్రస్తుతం నా నియంత్రణ పెద్దగా లేదు. కానీ నా స్క్రీన్‌ని మాత్రం నేను స్విచాఫ్ చేయగలను.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)