చైనా లేషన్ బుద్ధ విగ్రహం పాదాలను తాకిన వరద నీరు, 80 తరువాత మళ్లీ ఇప్పుడే ఇలా...

చైనాలో గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా తొలిసారి అక్కడి భారీ లేషాన్ బుద్ధ విగ్రహం పాదాలను వరద నీరు తాకింది.

సిచువాన్ రాష్ట్రంలో చెంగ్డుకు సమీపంలో కొండపై ఎనిమిదో శతాబ్దంలో చెక్కిన ఈ 71 మీటర్ల భారీ బుద్ధ విగ్రహం పాదాలను వరద నీరు తాకింది.

1940 తరువాత ఇలా జరగడం ఇదే ప్రథమం.

ఈ విగ్రహం సాధారణ వరద మట్టం కంటే ఎక్కువ ఎత్తులోనే ఉన్నప్పటికీ గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో వరదలు రావడంతో నీరు తాకింది.

వరదల కారణంగా లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

యునెస్కో హెరిటేజ్ సైట్‌గానూ గుర్తించిన ఈ భారీ విగ్రహం చైనాలోని పర్యటక ఆకర్షణల్లో ఒకటి. సమీపంలోని యాంగ్జీ రివర్, త్రీ గార్జెస్‌తో పాటు ఇదీ పర్యటక ప్యాకేజీల్లో ఉంటుంది.

నీటి మట్టం పెరగడంతో ఈ విగ్రహం వద్ద ఉన్న 180 మంది పర్యటకులను రక్షించినట్లు సిచువాన్ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

ఈ బుద్ధ విగ్రహం పాదాల వరకు నీళ్లొస్తే 1.6 కోట్ల జనాభా ఉన్న చెంగ్డు నగరానికీ వరద వస్తుందని స్థానికులు చెబుతారని జిన్‌హువా వార్తాసంస్థ తెలిపింది.

వారం రోజులుగా వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తుండడం.. ఇప్పుడిప్పుడే ఆగే సూచనలు లేకపోవడంతో సిచువాన్ రాష్ట్రం అప్రమత్తమై అన్ని జాగ్రత్త చర్యలూ చేపడుతోంది.

యాంగ్జీ, యెల్లో, హాయ్, సొంఘువా, లియావో నదుల పరిసర ప్రాంతాలన్నిటికీ వరద ముప్పు ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కొండచరియలు కూడా విరిగిపడే ప్రమాదముందంటూ హెచ్చరికలు జారీ చేశారు.

యాంగ్జీ నదిపై ఉన్న త్రీ గార్జెస్ డ్యామ్‌లోకి భారీగా నీరు చేరుతోందని అధికారులు చెప్పారు.

త్రీ గార్జెస్‌లో నీరు పెరుగుతుండడంతో ఎగువన ఉన్న చాంగ్‌క్వింగ్ నగరం సహా అనేక ప్రాంతాలకు వరద ముప్పు ఉందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)