రష్యా కరోనా వ్యాక్సిన్: పుతిన్ కుమార్తె ఎవరు? ఆమె ఏం చేస్తారు?

కరోనా వైరస్‌కు తమ దేశం వ్యాక్సిన్‌ను సిద్ధం చేసిందని, రెండు నెలలపాటు పరీక్షించిన తర్వాత దీన్నే సరైన వ్యాక్సిన్‌గా నిర్ధరించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రకటించారు.

ఈ వ్యాక్సిన్‌కు రష్యా ఆరోగ్యమంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. త్వరలో భారీ ఎత్తున దీని ఉత్పత్తి ప్రారంభిస్తామని పుతిన్‌ తెలిపారు.

అయితే, ఆయన ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.

తమ వ్యాక్సిన్‌ను ఇప్పుడు మొదటగా ఇచ్చినవారిలో తన కూతురు కూడా ఉందని పుతిన్ తెలిపారు.

పుతిన్‌కు ఇద్దరు కూతుర్లున్నారు. వారిలో ఎవరికి వ్యాక్సిన్‌ ఇచ్చారన్నది మాత్రం ఆయన ప్రకటించలేదు.

దీంతో వీరిలో ఎవరికి వ్యాక్సిన్ ఇచ్చి ఉంటారన్న విషయంపై చర్చ జరుగుతోంది.

తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతారు పుతిన్‌. ఆయన కుటుంబ సభ్యులు చాలా తక్కువ సందర్భాలలోనే బయటకు కనిపిస్తుంటారు.

పుతిన్‌కు మరియా పుతినా, యెకటెరీనా పుతినా అనే పేర్లతో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

తన కుమార్తెల గురించి పుతిన్‌ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ యెకటెరీనా పుతినాను ఆయన చిన్న కుమార్తెగా చెబుతారు.

ప్రచారంలో చిన్న కూతురు పేరు

మాస్కోలో కేథరినా టిఖోనోవా అనే పేరుతో యెకటెరీనా నివసించినట్లు 2015లో వార్తలు వచ్చాయి.

ఆమె ఆక్రోబాటిక్‌ డ్యాన్సర్‌. ఈ పోటీలలో పాల్గొనడమే కాకుండా టీవీ షోలో కూడా కనిపించారు.

33 సంవత్సరాల కేథరినా టిఖోనోవా మాస్కో స్టేట్‌ యూనివర్సిటీలో న్యూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇనిస్టిట్యూట్‌కు అధిపతిగా పని చేస్తున్నారని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.

ఆమె చాలా సంవత్సరాలుగా ఆ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. భౌతికశాస్త్రం, గణితంలో ఆమె దిట్ట అని చెబుతారు.

తన తండ్రి ఇంటి పేరును తీసేసి కేథరినా టిఖోనోవాగా పేరు మార్చుకున్నారు యెకటెరీనా.

2013లో ఆమె కెరిల్‌ షమలోవ్‌ అనే వ్యక్తిని వివాహమాడారు. కెరిల్ తండ్రి రోజియా బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు నికోలాయ్‌ షమలోవ్‌‌. నికోలాయ్‌ షమలోవ్‌ పుతిన్‌కు చిన్ననాటి స్నేహితుడని చెబుతారు.

కెరిల్ షమలోవ్‌కు ఆయిల్, పెట్రో కెమికల్స్‌ వ్యాపారాలున్నాయి. ఆయన గతంలో రష్యా ప్రభుత్వానికి ఆర్ధిక సలహాదారుగా పనిచేశారు. అయితే 2018లో కెరిల్‌, కేథరినా టిఖోనోవా విడాకులు తీసుకున్నారు.

పుతిన్‌ పెద్ద కూతురు ఏం చేస్తారు?

పుతిన్ పెద్ద కుమార్తె పేరు మరియా పుతినా అని చెబుతారు. ఆమెను మరియా వోరోంట్సోవా అని కూడా పిలుస్తారు. గతంలో ఓ విలేకరుల సమావేశంలో వోరొంట్సోవా, యెకాటెరినా వ్యాపారాల గురించి కూడా విలేకరులు పుతిన్‌ను ప్రశ్నలు అడిగినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.

“మీరు ఇద్దరు మహిళల వ్యాపారాన్ని గురించి నన్ను ప్రశ్నలు అడిగారు. కొన్ని వివరాలు ఇచ్చారు. కానీ అవి సరిపోవు. మీరు మరింత సమాచారం తీసుకుంటే... వారేంటో, వారి వ్యాపారాలు ఏంటో, అవి ఎవరి చేతుల్లో ఉన్నాయో మీకే తెలుస్తుంది’’ అని పుతిన్‌ విలేకరులకు సమాధానం చెప్పారు.

పుతిన్‌ పెద్ద కూతురు మరియా వొరొంట్సోవా ఎండోక్రినాలజిస్టుగా పని చేస్తున్నారు. మాస్కోలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె మారు పేరుతో నివసిస్తున్నారని న్యూటైమ్స్‌ పత్రిక వెల్లడించింది

ఎండోక్రినాలజీ సెంటర్‌లో మరియా శాస్త్రవేత్తగా పని చేస్తున్నారని, ఆమె హాలెండ్‌కు చెందిన ఓ వ్యక్తిని వివాహమాడారని, వారికి ఒక కూతురు కూడా ఉందని తెలుస్తోంది.

మరియా వొరొంట్సోవా అత్యాధునిక లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తారని, విదేశాలలో ఆమెకు చాలామంది స్నేహితులున్నారని సోషల్ మీడియా వార్తల ఆధారంగా న్యూటైమ్స్‌ పత్రిక పేర్కొంది.

ప్రైవసీకి భంగం కలిగించవద్దు: పుతిన్‌

అధ్యక్ష ఎన్నికలకు ముందు ఒక టీవీ షో సందర్భంగా పుతిన్ తన కుమార్తెలు, వారి పిల్లల గురించి కొంచెం మాట్లాడారు.

అయితే తన కుటుంబ గోప్యతను కాపాడాలని ఆయన విజ్జప్తి చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. తన కుమార్తెల పిల్లలు సాధారణ బాల్యాన్ని గడపలేరని భయపడుతున్నానని, వారు అందరు పిల్లల్లా స్వేచ్ఛగా జీవించాలని తాను కోరుకుంటానని పుతిన్‌ చెప్పారు.

తన పిల్లలిద్దరూ మాస్కోలో నివసిస్తున్నారని, సైన్స్, విద్య రంగాలలో వారు కెరీర్‌ కొనసాగిస్తున్నారని పుతిన్‌ వెల్లడించారు. వారు రాజకీయాలలో ఏ విధంగానూ జోక్యం చేసుకోరన్నారు.

1983లో లుడ్మిలాను వ్లాదిమిర్ పుతిన్‌ వివాహం చేసుకున్నారు. వారి సంతానమే కేథరినా, మరియా.

2014లో పుతిన్‌, లుడ్మిలా విడిపోయారు.

లుడ్మిలా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించరు. రష్యా ప్రథమ మహిళగా ఆమె అనేక విదేశీ పర్యటనలు చేశారు. 2004లో పుతిన్‌తో కలిసి భారతదేశం వచ్చారు. ఈ సందర్భంగా తాజ్‌మహల్‌ను సందర్శించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)