You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్‌లో జర్నలిస్ట్ కిడ్నాప్: మిలటరీ అరాచకాలను ప్రశ్నించినందుకు పాక్ సీక్రెట్ ఏజెన్సీయే ఆ పని చేసిందా?
- రచయిత, బీబీసీ ఉర్దూ
- హోదా, ఇస్లామాబాద్
ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ మతీఉల్లా జాన్ అపహరణకు గురయ్యారు. ఆయుధాలతో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను తీసుకెళ్లి కొన్ని గంటల తరువాత వదిలేశారు.
పాకిస్తాన్‌లోని మిలటరీ ఆధిపత్యాన్ని మతీఉల్లా జాన్ బహిరంగంగా విమర్శించేవారు.
జాన్ అపహరణకు గురైన వీడియోపై సోషల్ మీడియాలో కలకలం రేగింది. దీని వెనుక పాకిస్తాన్ సీక్రెట్ సర్వీసెస్ హస్తం ఉందని అనేకమంది అనుమానిస్తున్నారు.
గతంలో ఒక ఉన్నత న్యాయాధికారికి సంబంధించిన కేసులో కోర్టు తీర్పుపై జాన్ విమర్శలు గుప్పించిన కారణంగా ఆయనపై కేసు పెట్టారు.
ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిఉండగా అంతకుముందురోజు ఆయన అపహరణకు గురయ్యారు.
అయితే, జాన్ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారని ఆయన కుటుంబ సభ్యులు బీబీసీకి తెలిపారు.
"ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇస్లామాబాద్‌కు పశ్చిమాన ఉన్న ఫతేజంగ్ వద్దకు వచ్చి జాన్‌ను తీసుకెళ్లమని చెప్పారు" అని ఆయన సోదరుడు షాహిద్ అబ్బాసీ వివరించారు.
జాన్ కళ్లకు గంతలు కట్టి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వాహనంలో తిప్పారని, చివరకు ఫతేజంగ్‌లో విడిచిపెట్టారని అబ్బాసీ తెలియజేశారు.
అపహరణ ఎలా జరిగింది?
జాన్ తన భార్యను ఆమె పని చేసే విమెన్స్ కాలేజ్ దగ్గర దింపి వస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలతో చుట్టుముట్టారు. వాహనాలపై పోలీస్ శాఖకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి. ఒక అంబులెన్స్ కూడా ఉంది.
కాలేజ్ భవనానికి అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ సంఘటన రికార్డయింది. జాన్‌ను అపహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇది జరిగిన వెంటనే, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు భుదవారం కోర్టులో హాజరై జాన్ అపహరణ వివరాలు తెలపాలని ఇస్లామాబాద్ కోర్టు నోటీస్ జారీ చేసింది.
కిడ్నాప్ జరిగిందన్న సమాచారం అందిన వెంటనే మతీఉల్లా జాన్‌ను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఫెడరల్ సమాచార శాఖ మంత్రి షిబ్లి ఫరాజ్ తెలిపారు.
"ఇది చాలా ఆందోళన కలిగించే విషయం" అని మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి ట్వీట్ చేసారు. పోలీస్ ఉన్నతాధికారులతో తాను మాట్లాడానని ఆమె తెలిపారు.
"బహుశా ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల ఆధిపత్యం ముగింపు దశకు వచ్చింది. వీరి ఆధిపత్యం దేశ ఆర్థిక, రాజకీయ రంగాల తిరోగమనానికి కారణమైంది" అని సీనియర్ లాయర్ సల్మాన్ అక్రం రాజా అన్నారు.
కోర్టు కేసు ఏమిటి?
జాన్ ఒక ఉల్లంఘన కేసులో బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
జాన్ పాకిస్తాన్లోని దాదాపు అన్ని ప్రధాన మీడియా సంస్థలలోనూ పనిచేశారు. ప్రస్తుతం తన సొంత యూ ట్యూబ్ ఛానల్ ఎంజేటీవి నడుపుతున్నారు.
జర్నలిస్టుగా చట్ట సంబంధ విషయాలను కవర్ చెయ్యడం జాన్ ప్రత్యేకత. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఫైజ్ ఇసాపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును జాన్ విమర్శించారు. ఈ తీర్పులో ఉన్న లొసుగులను ప్రస్తావిస్తూ చర్చలు నిర్వహించారు.
2016లో జరిగిన క్వెట్టా హాస్పిటల్ ఊచకోత, 2017లో ఫైజాబాద్ మతాధికారి జరిపిన నిరసనలను అడ్డుకోవడంలో పాకిస్తాన్ మిలటరీ ప్రభుత్వం విఫలమైందని గతంలో జస్టిస్ ఇసా తీర్పులిచ్చారు.
2023లో జస్టిస్ ఇసా దేశ ప్రధాన న్యాయమూర్తి కావలసి ఉండగా విదేశాల్లో ఉన్న తన ఆస్తులను ప్రకటించలేదని ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేసారు.
ఇది, జస్టిస్ ఇసా దేశ ప్రధాన న్యాయమూర్తి పదవి పొందకుండా ఉండడానికి పాకిస్తాన్ మిలటరీ ప్రభుత్వం పన్నిన పన్నాగమని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- సైనికులు సోషల్ మీడియా యాప్‌లు ఉపయోగిస్తే ప్రమాదం ఏంటి?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కారంచేడు దాడికి 35 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)