నయా రివెరా: బోటు షికారుకు వెళ్లి, సరస్సులో ‘మునిగి చనిపోయిన’ అమెరికన్ నటి

అమెరికన్ నటి నయా రివెరా కాలిఫోర్నియాలో పిరు సరస్సులో బోటు విహారానికి వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోయి ఉంటారని పోలీసులు చెప్పారు.

33 సంవత్సరాల రివెరా బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించటం లేదని తెలిసింది. ఆమె నాలుగేళ్ల కుమారుడు బోట్ మీద లైఫ్ వెస్ట్ ధరించి నిద్రపోతూ కనిపించాడు.

తామిద్దరం ఈత కొట్టడానికి వెళ్లామని, కానీ, తన తల్లి వెనక్కి తిరిగి రాలేదని ఆ అబ్బాయి పోలీసులకు చెప్పాడు.

ఆమె మృతదేహం కోసం గాలింపు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయని చెప్పారు.

ఫాక్స్ నెట్వర్క్‌లో 2009 - 2015 వరకు ప్రసారమైన ప్రముఖ మ్యూజికల్ కామెడీ టీవీ సిరీస్ ‘గ్లీ’ లో రివెరా నటించిన శాంటానా లోపెజ్ పాత్రకి చాలా పేరు వచ్చింది.

బోటింగ్ ఘటన గురించి ఏమి తెలుసు?

పసిఫిక్ స్టాండర్డ్ టైం ఒంటి గంటకి రివెరా ఆమె కుమారుడుతో కలిసి బోటుని అద్దెకి తీసుకున్నారు. మూడు గంటల్లో వెనక్కి తిరిగి రావల్సిన బోటు తిరిగి రాకపోవడంతో అక్కడ ఉండే సిబ్బంది వెతకడం మొదలుపెట్టారు.

ఆమె కొడుకు మాత్రం లైఫ్ వెస్ట్ వేసుకుని బోటు మీద నిద్రపోతూ కనిపించాడు.

ఆమె కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆమె జాడ ఎక్కడా కనిపించలేదు.

"ప్రమాదవశాత్తూ ఆమె సరస్సులో మునిగి చనిపోయి’’ ఉంటారని భావిస్తున్నట్లు వెంచురా కౌంటీ షెరీఫ్ క్రిస్ డయ్యర్ చెప్పారు.

ఎలా అయినా రివెరా మృత దేహాన్ని వెతికి తీసుకుని వచ్చి ఆమె కుటుంబానికి అప్పచెప్పాలని చూస్తున్నట్లు డయ్యర్ చెప్పారు.

సరస్సులో అస్సలు ఏమి కనిపించటం లేదని, ఆమె మృత దేహం దొరకడానికి కొన్ని వారాలు పట్టేటట్లు ఉందని ఆయన చెప్పారు.

నయా రివెరా ఎవరు?

రివెరా కెరీర్ అమెరికాలో టీవీ ప్రకటనల్లో బాల నటిగా, మోడల్‌గా నటించడంతో మొదలయింది.

ఆమె నాలుగేళ్ల వయసులోనే రాయల్ ఫ్యామిలీకి చెందిన సీరియల్‌లో నటించారు. ఆమె మరెన్నో టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కానీ, ఆమె నటించిన శాంటానా లోపెజ్ పాత్ర ఆమెకి బాగా పేరు తెచ్చింది.

ఆమె 2014లో హారర్ సినిమా డెవిల్స్ డోర్‌లో నటించారు.

అదే సంవత్సరంలో ఆమె సహ నటుడు ర్యాన్ డోర్సీని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2018లో విడాకులు తీసుకున్నారు. అయితే వారి కొడుకు మాత్రం వీరిద్దరి జాయింట్ కస్టడీలోనే ఉన్నారు.

మంగళవారం నాడు ఆమె చివరి సారిగా చేసిన ట్విటర్ పోస్ట్ లో తన కొడుకుతో కలిసి తీసుకున్న ఫోటో పెట్టి, "మేమిద్దరం మాత్రమే" అని క్యాప్షన్ రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీతెలుగునుఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోఫాలోఅవ్వండి. యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి.)