కరోనావైరస్-కాంటాక్ట్ ట్రేసర్: అదృశ్య శత్రువు కోసం డిసీజ్ డిటెక్టివ్‌ల అన్వేషణ

    • రచయిత, తారా మెక్‌కెల్వే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ ఎంతమందికి సోకింది, ఎలా సోకింది, ఎవరినుంచి ఎవరికొచ్చింది? ఇప్పుడు పాజిటివ్ వచ్చినవారు, వ్యాధి సోకకముందు ఎవర్ని కలిసారు?

కలిసిన వాళ్లల్లో ఎవరెవరికి పాజిటివ్ ఉంది? వాళ్లు అంతకుముందు ఇంకెవరిని కలిసారు? వాళ్లకి ఎవరి ద్వారా సోకి ఉంటుంది? వాళ్ల కాంటాక్టులేమిటి?

ఇలా చిక్కుముడులు విప్పుకుంటూ ముందునుంచి వెనక్కు వెళుతూ వ్యాధి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ పనిలో పడి "నేనెక్కడున్నాను, టైమెంత, ఇవాళ ఏ రోజు, అసలు నేనెవరు... అనే విషయాలనే మర్చిపోయాను" అంటున్నారు జార్జీయాలోని సవానాలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ క్రిస్టీనా పాసా గిబ్సన్.

సవానాలో గిబ్సన్ బృందంతో సహా దేశంలో అనేక నగరాల్లో పలు బృందాలు కరోనావైరస్ పాకుతున్న దారిని కనిపెట్టే పనిలో తలమునకలుగా ఉన్నారు.

రోగులతో మాట్లాడుతూ, వారు ఎవరెవరిని కలిసారో వివరాలు కనుక్కుంటూ, వాళ్లను కాంటాక్ట్ చేసి ఐసొలేషన్లో ఉండమని చెప్తూ ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న కేసుల దృష్ట్యా కాంటాక్ట్ ట్రేసింగ్ పద్ధతిలో పరిశోధన చేస్తున్న వీరి కృషి ఇప్పుడు ఎంతో విలువైనది.

ఇప్పటివరకూ అమెరికాలో అత్యధిక కోవిడ్-19 కేసులు, మరణాలు నమోదయ్యాయి. జార్జియా, ఫ్లోరిడా, టెక్సస్ లాంటి రాష్ట్రాల్లో కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. మరోపక్క కనెక్టికట్, న్యూయార్క్ సహా మిగతా ఉత్తరాది రాష్ట్రాలలో కేసులు తగ్గు ముఖం పట్టాయి.

న్యూ హేవెన్, కనెక్టికట్ నగరాల్లో గిబ్సన్ సహాయక బృందం త్వరితగతిని కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ వ్యాధి మరింత ప్రబలకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. యేల్ యూనివర్సిటీ విద్యార్థి, 26 యేళ్ల టైలర్ షెల్బీ ఒక దర్యాప్తు బృందాన్ని తయారుచేసి డజన్ల కొద్దీ వలంటీర్లను సమన్వయపరచడంలో సహాయం చేశారు.

గిబ్సన్, షెల్బీ బృందాలు చేస్తున్న కృషి అభినందనీయమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ దర్యాప్తు సంపూర్ణమైనది కాకపోయినా చాలా తొందరగా మొదలుపెట్టి, బలంగా ముందుకు వెళ్తున్నారని, సత్ఫలితాలు ఆశించవచ్చనీ నిపుణులు అంటున్నారు.

రహస్య జీవితాలను వెలికి తీస్తున్నారు

కాంటాక్ట్ ట్రేసింగ్ అంత సులువు కాదు. అసలే భయంతో ఆందోళనతో ఉన్న రోగులతో మాట్లాడి, వాళ్లకి ధైర్యం చెప్తూ కావలసిన సమాచారాన్ని సేకరించడం కష్టమైన పని అని గిబ్సన్ అన్నారు. ఒక అపరిచిత వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు "నేను చనిపోతానా?" అని అడిగారు. ఆ ప్రశ్నకు బదులు చెప్పడం ఎవరి తరం కాదు. అలాంటి ప్రశ్నలు ఎదుర్కోవడం బాధాకరమైన అనుభవం అని గిబ్సన్ అన్నారు.

వ్యాధి సోకక ముందు రోగులు రెండు మూడు రోజుల వ్యవధిలో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరితో 15 నిముషాల కాలం కంటే ఎక్కువ గడిపారు, ఆరు అడుగుల కన్నా తక్కువ దూరంలో ఎవరెవరితో నిల్చుని లేదా కూర్చుని మాట్లాడారు లాంటి వివరాలన్నీ ఈ దర్యాప్తులో సేకరిస్తారు. ఏదైనా సినిమాకెళ్లారా? ఊబర్ లేదా మరేదైనా క్యాబ్‌లో ఎక్కడికైనా వెళ్లారా? గుడి, చర్చి వంటి ప్రదేశాలకు వెళ్లారా? వెళుతున్న దారిలో ఎక్కడైనా ఆగారా? ఏమైనా కొన్నారా? లాంటి వివరాలన్నీ నమోదు చేసుకోవాలి.

''ఇదేమంత సులువైన విషయం కాదు. ఎన్నో సవాళ్లు ఉంటాయి. మనుషుల జ్ఞాపకశక్తికి పరీక్ష. కొన్ని రోజుల వెనక్కి వెళ్లి జరిగిన విషయాలు గుర్తు చేసుకోవాలని అడుగుతున్నాం. కొన్నిసార్లు సంభాషణ ఇబ్బందికరంగా ఉంటుంది'' అని షెల్బీ అన్నారు.

''ఫోన్లో మాట్లాడడం ఇంకా కష్టం. మేము ప్రశ్నలడిగినప్పుడు ఏవి చెప్పాలి, ఎలాంటివి చెప్పకూడదు లాంటి సంశయాలు వస్తాయి. దాంతో అవతలివాళ్లు సైలెంట్ అయిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో చాకచక్యంగా సమాచారం సాధించగలగాలి'' అని తెలిపారు షెల్బీ.

దర్యాప్తు బృందంలో పనిచేస్తున్న యేల్ యూనివర్సిటీ విద్యార్థి 27 యేళ్ల పావ్లీనా లూనా మార్టీనెజ్ తన అనుభవాలని వివరిస్తూ ''మొట్టమొదటి కాల్ చేసినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. వాళ్లు వాళ్ల జీవితాల గురించి మాట్లాడతారు'' అన్నారు.

అయితే మెల్లమెల్లగా ఫోన్‌లో మాట్లాడి, కావాలసిన సమాచారాన్ని సేకరించడం అలవాటయ్యిందనీ ఆమె చెప్పారు. తను సేకరించిన జాబితాను మిగతా వాలంటీర్లకి పంపిస్తారు. వాళ్లు ఆ జాబితాలో ఒక్కొక్కరికీ కాల్ చేసి వారెవరెవరిని కలిశారో కనుక్కుంటారు.

వైరస్ సోకినవారికి సహాయం చెయ్యడం ఈ మొత్తం ప్రక్రియలో ఒక ముఖ్యమైన అంశం. ఐసొలేషన్‌లో ఉండాలని చెప్పడం తేలికేగానీ ఎంతోమందికి అలా విడిగా ఉంటూ తమని తాము పోషించుకోగలిగే పరిస్థితి ఉండకపోవచ్చు.

''కేసులు లెక్కబెట్టి దర్యాప్తు పూర్తిచెయ్యడమొక్కటే కాదు, సహాయం అవసరమైనవారికి చేయూతనివ్వడం కూడా ఈ ప్రక్రియలో భాగమే'' అని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పాట్రిక్ కాచర్ వివరించారు.

ఈ ప్రక్రియలో భాగంగా రోగులకు ధైర్యాన్ని అందించడమే కాకుండా క్వారంటీన్లో ఉండడానికి అవసరమైన సహాయాన్ని అందించే సామాజిక సేవా సంస్థల వివరాలు అందించడం లాంటివి చేస్తారు.

కాంటాక్ట్ ట్రేసింగ్ పద్ధతిలో లోపాలు...

గతంలో ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ పద్ధతి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా అదుపు చెయ్యగలిగిన దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణకు 1930లలో యూఎస్‌లో సిఫిలిస్ వ్యాధి ప్రబలకుండా అడ్డుకట్ట వెయ్యడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడింది. అలాగే ఎబోలా సోకిన కేసుల వివరాలను బయటకి లాగి పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి విస్తరించకుండా ఆపగలిగారు. అయితే కోవిడ్-19 లాంటి భయంకరమైన వ్యాధిని అరికట్టడానికి ఇంత పెద్ద ఎత్తున ఈ పద్ధతిని మునుపు వాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు చేస్తున్న ఈ దర్యాప్తు వల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ విధానంలో ఉన్న కొన్ని లోపాలు బయటపడుతున్నాయి.

కోవిడ్-19 అదుపులో భాగంగా ఇంగ్లండ్‌లో ఎన్‌హెచ్ఎస్ టెస్ట్ అండ్ ట్రేస్ అనే కాంటాక్ట్ ట్రేసింగ్ పద్ధతిలోని లోపాలను బీబీసీతో సహా కొన్ని ఇతర మీడియా సంస్థలు బయటపెట్టాయి.

అయితే గిబ్సన్, షెల్బీల బృందాలు చేస్తున్న ప్రయత్నాన్ని నిపుణులు ప్రశంసిస్తున్నారు. లోపాలు ఉన్నప్పటికీ ఈ ప్రయత్నం మంచిదేనని, కొంతైనా వ్యాధిని అదుపు చెయ్యడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

సంపూర్ణంగా చేయలేకపోయినప్పటికీ, ఈ ప్రయత్నం విలువైనదని ప్రొఫెసర్ పాట్రిక్ కాచర్ అభిప్రాయపడ్డారు.

వివిధ దేశాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ పద్ధతులు

సింగపూర్‌లో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వైరస్ సోకినవారి వివరాలను సేకరించేందుకు ప్రయత్నించారు.

దక్షిణ కొరియాలో వైరస్ సోకినవారి చుట్టూ వర్చువల్ నెట్స్ రూపొందించారని ద హిల్ పత్రిక తెలియజేసింది.

అయితే గోప్యతా కారణాల దృష్ట్యా యూఎస్‌లో మాత్రం కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్స్ మీదే ఎక్కువ ఆధారపడ్డారని వాషింగ్టన్ పోస్ట్-యూనివర్సిటీ ఆఫ్ మెరీల్యాండ్ పోల్లో తేలింది.

తుది ఎక్కడ?

వ్యాధి జాడను అన్వేషిస్తున్న డిటెక్టివ్స్ నిరంతరంగా పని కొనసాగిస్తున్నారు. కానీ ఈ కరోనావైరస్ మొదలు, తుది అస్పష్టంగానే ఉంది.

కాంటాక్ట్ ట్రేసింగ్ విధానం అనుసరిస్తున్న బృందాలకు ఈ పద్ధతికున్న పరిమితుల గురించి అవగాహన ఉంది. "మొదటినుంచీ మా మంత్రం ఒక్కటే: ఎంతవరకూ చెయ్యగలమో అంతవరకూ చేస్తాం. ఎవరికీ ఏ విషయమూ స్పష్టంగా తెలీదు. ఈ అనిశ్చితి ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలీదు. మేము ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించలేమని తెలుసు కాని మా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాం" అని షెల్బీ అన్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)