బాంబులు త‌యారుచేసిన‌ మిలిటెంటే ఉగ్ర‌వాదుల్లో మార్పు తెస్తున్నాడు

"బాంబులు చేయ‌డంలో నేను సిద్ధ‌హ‌స్తుడ్ని. కేవ‌లం ఐదే నిమిషాల్లో నేను బాంబులు త‌యారు చేయ‌గ‌ల‌ను."

జెమా ఇస్లామియా కీల‌క స‌భ్యుల్లో అలీ ఫౌజీ ఒక‌రు. ఈ సంస్థ‌కు అల్‌ఖైదాతో సంబంధముంది. 200 మందిని బ‌లితీసుకున్న‌ అత్యంత దారుణమైన బాలీ బాంబు దాడుల‌కు పాల్పడింది ఈ సంస్థే.

"మా సోద‌రులే బాలీ బాంబు దాడి చేప‌ట్టారు. ప‌ర్య‌ట‌క కేంద్ర‌మైన బాలీ ద్వీపం న‌డిబొడ్డున బాంబుల‌తో విధ్వంసకర దాడి చేశారు"

ఇండోనేసియాలో ఈ సంస్థ వ‌రుస దాడులు చేప‌ట్టింది. పెద్ద‌పెద్ద హోట‌ళ్ల నుంచి పాశ్చాత్య దేశాల దౌత్య‌కార్యాల‌యాల వ‌ర‌కు అన్నింటిపైనా దాడుల‌కు తెగ‌బ‌డింది. తూర్పు జావా లమొంగ‌న్‌లోని తెంగులున్ గ్రామం ఈ సంస్థ‌కు స్థావ‌రం లాంటిది.

‌కానీ ఇప్పుడు అలీ ఫౌజీ దారి చాలా భిన్న‌మైన‌ది. జీహాద్‌ను వ‌దిలిపెట్టి సామాన్య జీవితం గ‌డిపేవారికి ఆయ‌న సాయం చేస్తున్నారు. అంతేకాదు ఆగ్నేయాసియాలోని మిలిటెంట్ సంస్థ‌ల్లో కొత్త‌గా ఎవ‌రూ చేర‌కుండా చూసేందుకు ప‌నిచేస్తున్నారు.

"ఉగ్ర‌వాద సంస్థ‌ల్లోకి కొత్త‌వారిని చేర్చుకోవ‌డం ఇక్క‌డ చాలా తేలిక."అని ఫౌజీ తెలిపారు.

"కొంచెం రెచ్చ‌గొడితే చాలు.. చాలా మంది ఉగ్ర‌వాద సంస్థ‌ల్లో చేరుతారు. అయితే వారిని మ‌ళ్లీ మామూలు మ‌నుషుల్లా మార్చ‌డానికి మాత్రం స‌మ‌యం ప‌డుతుంది. ఒక్కో అడుగు వేసుకుంటూ నెమ్మ‌దిగా వారిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది."

ఆయ‌న తాజా మిష‌న్‌కు భారీ ముల్యం చెల్లించుకోవాల్సి కూడా రావొచ్చు.

"నాకు భ‌యాన‌క‌మైన బెదిరింపులు వ‌స్తుంటాయి. కేవ‌లం తిట్ట‌డ‌మే కాదు.. చంపేస్తామ‌నీ అంటుంటారు. అయితే నేను భ‌య‌ప‌డను. ఎందుకంటే నేను చేసేది మంచి ప‌న‌ని నాకు తెలుసు. ఈ క్ర‌మంలో చ‌నిపోవ‌డానికీ నేను సిద్ధ‌మే"

అఫ్గానిస్తాన్‌, బోస్నియా, పాల‌స్తీనాల్లోని యుద్ధాల దృశ్యాల‌ను మొబైల్ ఫోన్ల‌లో చూసి ప్రేర‌ణ పొందిన ఫౌజీ, ఆయ‌న సోద‌రులు మిలిటెంట్ గ్రూపుల్లో ప‌ని చేశారు.

"పౌరుల‌పై దారుణంగా జ‌రిగిన దాడుల దృశ్యాల‌ను మేం చూశాం. మా ర‌క్తం స‌ల‌స‌ల మ‌రిగింది. వెంట‌నే ముస్లింల‌ను వేధింపుల నుంచి కాపాడాల‌ని, ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భావించాం"

అలీ ఇంటికి ద‌గ్గ‌ర్లో ఉంటూ.. ద‌క్షిణ ఫిలిప్పీన్స్‌లో ముస్లిం రాజ్యం కోసం పోరాడుతున్న ఇస్లామిక్ సంస్థ‌ల‌తో చేతులు క‌లిపారు. ఆయ‌న సోద‌రులు మాత్రం అఫ్గానిస్తాన్‌లో ముజాహిదీన్ త‌ర‌ఫున పోరాడేందుకు వెళ్లారు.

"నాకు చ‌నిపోవాల‌ని అనిపించేది. నా చావును నేను ఎప్పుడూ ఊహించుకొనేవాణ్ని."అని ఆయ‌న వివ‌రించారు.

"యుద్ధంలో చ‌నిపోతే దేవుడి ద‌గ్గ‌ర‌కు నేరుగా వెళ్లిపోతాన‌ని, దేవ‌దూత‌లను క‌ల‌వొచ్చ‌ని అనుకునేవాణ్ని. మ‌మ్మ‌ల్ని మిలిటెంట్ సంస్థ‌ల్లోకి చేర్చుకునే వారు అదే చెప్పారు మాకు"

అఫ్గాన్ నుంచి తిరిగివ‌చ్చిన ఆయ‌న సోద‌రులు.. అక్క‌డ నేర్చుకున్న విధానాల‌ను ఇండోనేసియాలో అమ‌లుచేశారు.

అంత‌ర్జాతీయ ప‌ర్య‌ట‌కులతో కిట‌కిట‌లాడే బాలీలోని కూటా నైట్‌క్ల‌బ్‌ల‌పై 2002 అక్టోబ‌రులో రెండు బాంబుల‌తో దాడిచేసిన మిలిటెంట్ బృందంలో వీరు కూడా ఉన్నారు.

"నేను ఆ వార్త టీవీలో చూడ‌గానే విశ్మ‌యానికి గుర‌య్యాను. అక్క‌డ చాలా మృత‌దేహాలు క‌నిపించాయి."అని ఫౌజీ వివ‌రించారు. "ఆ దాడి జ‌రిగిన త‌ర్వాత అధికారులు మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు"

ఆయ‌న సోద‌రులు అలీ ఘుఫ్రాన్‌, అమ్రోజీల‌ను ఉరితీశారు. మూడో సోద‌రుడు అలీ ఇమ్రాన్‌కు జీవిత ఖైదు విధించారు.

త‌న‌కు ఆ దాడితో సంబంధంలేద‌ని ప‌దేప‌దే చెప్పిన ఫౌజీ.. వేరే ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలకు సంబంధించి మూడేళ్ల జైలు శిక్ష అనుభ‌వించారు. అప్పుడే ఆయ‌న జీవితం మ‌లుపు తిరిగింది.

"పోలీసులు నాపై చాలా మాన‌వ‌త్వం చూపించారు. వారు న‌న్ను చిత్ర‌హింస‌లు పెట్టుంటే... ఏడు త‌రాల‌పాటు మా వంశం ఇండోనేసియా ప్ర‌భుత్వంపై పోరాడి ఉండేది."అని ఆయ‌న వివ‌రించారు.

"నేను పోలీసుల్ని శాతాన్‌లుగా భావించే వాణ్ని. మాకు అలానే చెప్పేవారు. కానీ నిజానికి జ‌రిగేది పూర్తిగా వేరు. జైలుకు వెళ్లాకే అన్ని విష‌యాలూ అర్థ‌మ‌య్యాయి."

త‌మ సంస్థ చేప‌ట్టిన బాంబు దాడుల్లో బాధితుల‌నూ ఆయ‌న క‌లిశారు.

"నేను ఏడ్చేశాను. బాంబులు మిగిల్చిన విషాదంతో నా గుండె ద్ర‌వించి పోయింది. అప్పుడే మారాల‌ని అనిపించింది. పోరాటం నుంచి శాంతి బాట‌లో వెళ్లాల‌ని నిశ్చ‌యించుకున్నాను"

తెంగులున్ గ్రామంలో సాయంత్రం ప్రార్థ‌న‌ల కోసం మైక్‌లో సందేశాలు వ‌చ్చిన‌ వెంట‌నే... గ్రామంలోని ప్ర‌ధాన మ‌సీదులో ప్రార్థ‌న‌లు చేసేట‌ప్పుడు కింద వేసుకునే చాప‌ల‌ను సిద్ధంచేసి.. స‌ర్కిల్ ఆఫ్ పీస్ కార్యాల‌యం ద‌గ్గ‌ర వారు ఎదురుచూస్తున్నారు. అతివాదం నుంచి ప్ర‌జ‌ల్ని విడిపించేందుకు ఈ ఫౌండేష‌న్‌ను 2016లో ఫౌజీ స్థాపించారు.

ఇక్క‌డ సాయంత్రం ప్రార్థ‌న‌ల‌కు ఇద్ద‌రు బాంబు దాడుల బాధితులు నేతృత్వం వ‌హిస్తున్నారు. త‌మ జీవితాలు నాశ‌నం చేసిన‌ మిలిటెంట్ సంస్థ‌ల‌కు ఆశ్ర‌యం ఇచ్చిన చోటుకు వారు అతిథులుగా వ‌చ్చారు.

"నేను త‌ర‌చూ ఇక్క‌డ‌కు బాధితుల్ని తీసుకొస్తుంటాను."అని ఫౌజీ చెప్పారు. "వారిని క‌లుస్తుంటే నాకుండే గ‌ర్వ‌మంతా మంట‌గ‌లిసిపోతుంది."

ఇక్క‌డ స్టేజ్‌కు ప‌క్క‌న ఓ తెర‌పై ఇండోనేసియాలో జ‌రిగిన విధ్వంస‌క‌ర దాడుల దృశ్యాల‌ను చూపిస్తున్నారు.

ఇదొక అసాధార‌ణ స‌మావేశం. ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌వారిలో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల కింద జైలు శిక్ష అనుభ‌వించిన వారున్నారు. అంతేకాదు వారిని అరెస్టుచేసిన పోలీసులూ ఉన్నారు.

బాధితులు తాము అనుభ‌వించిన బాధ‌ చెబుతుంటే వీరు గుండె రాయిని చేసుకొని వింటున్నారు.

ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌వారిలో 33ఏళ్ల జూలియా మ‌హేంద్ర ఒక‌రు. బాలి దాడుల్లో త‌న తండ్రి అమ్రోజీకి మ‌ర‌ణ శిక్ష ప‌డిన‌ప్పుడు మ‌హేంద్ర టీనేజీలో ఉన్నాడు.

అమ్రోజీని వెట‌కారంగా న‌వ్వే హంత‌కుడిగా మీడియా అభివ‌ర్ణించేది. ఎందుకంటే కోర్టు విచార‌ణ జ‌రిగేట‌ప్పుడు అత‌డు ఎలాంటి ప‌శ్చాత్తాపం చూపలేదు. అంతేకాదు వెట‌కారంగా న‌వ్వుతూ ధిక్కారంతో ఉండేవాడు.

స‌మావేశం అనంత‌రం బాంబు దాడుల బాధితుల్లో ఇద్ద‌రిని మ‌హేంద్ర క‌లిశాడు. వారిని హ‌త్తుకొని, చేతులు ప‌ట్టుకొని ప‌దేప‌దే క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.

"నాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అనిపించింది. నేనేమీ త‌ప్పు చేయ‌లేదు. అయితే మా నాన్న చేసిన ప‌నుల వ‌ల్ల వీరి కుటుంబం ఎంత‌గానో బాధ‌ప‌డింది. మా నాన్న త‌ర‌ఫున వీరికి నేను క్ష‌మాప‌ణ‌లు చెప్పే బాధ్య‌త తీసుకున్నాను"అని మ‌హేంద్ర చెప్పాడు.

మ‌హేంద్రలోనూ ఊహించ‌లేనంతగా మార్పు వ‌చ్చింది.

"మా నాన్న‌కు ఉరిశిక్ష వేసిన‌ప్పుడు నాకు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని అనిపించింది. బాంబులు ఎలా చేయాలో నేర్చుకోవాల‌ని కూడా అనుకున్నాను." అని మ‌హేంద్ర వివ‌రించాడు.

"అయితే కాలం గ‌డుస్తున్న కొద్దీ అంతా మారింది. మా నాన్న సోద‌రులు అలీ ఫౌజీ, అలీ ఇమ్రాన్.. నేను చేసేది త‌ప్ప‌ని అర్థ‌మ‌య్యేలా చెప్పారు. దీంతో ఉగ్ర‌వాదుల్లో మార్పు తీసుకొచ్చే ప్రాజెక్టులో నేను కూడా భాగ‌మ‌య్యాను."

"నేను ఇప్పుడుండేలా మార‌డానికి చాలా దూరం ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చింది."అని మ‌హేంద్ర వివ‌రించాడు.

"ఇప్పుడు జిహాద్ అంటే మ‌నుషుల్ని చంప‌డ‌మో లేదా పోరాట‌మో కాద‌ని తెలుసుకున్నాను. జిహాద్ అంటే కుటుంబం కోసం క‌ష్ట‌ప‌డ‌టం"

"ఒక రోజు నిద్ర‌పోతున్న మా అబ్బాయిని చూసి చాలా బాధ‌నిపించింది. నాకేమైనా అయితే వాడు ఏమైపోతాడో అనిపించింది."

"నాకు జరిగిన‌వ‌న్నీ నా కొడుక్కి జ‌ర‌గ‌కూడ‌ద‌ని అప్పుడే అనుకున్నాను. నేను మా నాన్న బాట‌లో వెళ్తే.. నా కొడుకు కూడా అనాథ అయిపోతాడు. అప్పుడు వాణ్ని కూడా అతివాద జిహాద్ చేర్చుకుంటుంది."

"ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌)తో సంబంధ‌మున్న కొన్ని మిలిటెంట్ సంస్థ‌ల్లో చేరిన‌వారూ త‌న మిత్రుల్లో ఉన్నార‌ని మ‌హేంద్ర వివ‌రించారు."

"ప్ర‌జ‌లు అతివాద బాట‌లో వెళ్ల‌డానికి చాలా కార‌ణాలుంటాయి. ఆర్థిక ప‌రిస్థ‌తి స‌రిగ్గా లేక‌పోవ‌డం లేదా చేయ‌డానికి ఏమీ లేక‌పోవ‌డం, వారికి ఏం బోధిస్తున్నారు? వారిపై ఎలాంటి వ్య‌క్తుల ప్ర‌భావం ఉంది? లాంటివి."

లమొంగన్ జైలుకు..

అలీ ఫౌజీ.. లమొంగ‌న్ జైలుకు అప్పుడ‌ప్పుడు వెళ్తుంటారు. ఇది ఆయ‌న‌కు బాగా తెలిసిన చోటు. త‌న కుటుంబ స‌భ్యుల్ని క‌లిసేందుకు ఆయ‌న చాలాసార్లు ఇక్క‌డ‌కు వ‌చ్చారు. అంతేకాదు కొత్త‌గా వ‌చ్చిన ఖైదీల‌ను మార్చేందుకూ ఆయ‌న వ‌స్తుంటారు.

"అతివాదం నుంచి సాధార‌ణ జీవితంలోకి తీసుకువ‌చ్చేందుకు నేను ఎలాంటి సిద్ధాంతాల‌నూ అనుస‌రించ‌ను. నా సొంత అనుభ‌వాల‌నే పాఠాలుగా చెబుతుంటాను. నేనొక ఫైట‌ర్‌ను. ఒక ఉగ్ర‌వాదిని.. అందుకే ఓ స్నేహితుడిగా ఇక్క‌డ‌కు వ‌స్తుంటాను."

కొంద‌రు మాత్రం ఆయ‌న్ను మోస‌గాడిగా చూస్తుంటారు. కావాల‌నే పోలీసుల‌తో అత‌డు చేతులు క‌లిపాడ‌ని అంటుంటారు.

"జైలు గార్డులు, పోలీసుల్లానే న‌న్ను కూడా న‌మ్మ‌కూడ‌ద‌ని వారిలో కొంద‌రు భావిస్తుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లో నన్ను తిడుతుంటారు. బెదిరింపు కాల్స్ కూడా వ‌స్తుంటాయి. కానీ ఫ‌ర్వాలేదు. నేను భ‌రించ‌గ‌ల‌ను"అని న‌వ్వుతూ ఆయ‌న చెప్పారు.

2016లో మేం క‌లిసి ప‌నిచేసిన 98 మందిలో ఇద్ద‌రు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సాధార‌ణ జీవితం గ‌డుపుతున్నారు.

"అతివాదం నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డం అంత తేలిక‌కాదు. ఎందుకంటే మ‌నం ప్ర‌జ‌ల భావోద్వేగాలు, ఆలోచ‌నా విధానాల‌తో ప‌నిచేస్తూ ఉండాలి. కొన్నిసార్లు త‌ప్పులు కూడా జ‌రిగిపోతుంటాయి."

కొన్నిసార్లు వారు చేస్తున్న కృషికి మంచి ఫ‌లితాలు వ‌స్తుంటాయి.అలా విజ‌య‌వంతంగా సాధార‌ణ జీవితంలోకి రాగ‌లిగిన వారిలో సుమ‌ర్నో ఒక‌రు.

"ఆయ‌న న‌న్ను గ్రామం శివారునున్న‌ ఒక ఎండిపోయిన పొలానికి తీసుకెళ్లాడు. బాలీ దాడుల అనంత‌రం జెమా ఇస్లామియాకు చెందిన ఆయుధాల‌ను ఆయ‌న అక్క‌డే దాచిపెట్టాడు"అని ఫౌజీ చెప్పారు.

మూడేళ్ల‌ జైలు శిక్ష అనంత‌రం సుమ‌ర్నో చిన్న వ్యాపారం పెట్టుకొనేందుకు అలీ ఫౌజీ సాయం చేశారు.

"ఇప్పుడు నేను స‌మాజానికి సేవ చేయాల‌ని అనుకుంటున్నా."అని సుమ‌ర్నో చెప్పారు.

"ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్ని మ‌క్కా పంపేందుకు ఓ చిన్న ట్రావెల్ సంస్థ‌ను న‌డిపిస్తున్నా. ఈ సంస్థ‌తో ఎలాంటి హింస లేకుండా హాయిగా జీవించ‌గ‌ల‌న‌ని అనుకుంటున్నా"

త‌న గ్రామానికి 20 నిమిషాల దూరంలోనున్న త‌న ఆఫీస్‌లో కూర్చుని మాట్లాడుతున్న సుమ‌ర్నో.. మొద‌ట్లో త‌న గురించి చెప్పుకొనేందుకు కొంచెం త‌ట‌ప‌టాయించేవారు. త‌న ఊరు పేరు కూడా చెప్పేవారు కాదు. ఇప్పుడైతే ప‌ర్య‌ట‌కులకు ఆయ‌న మొద‌ట‌ త‌న క‌థనే చెబుతున్నారు.

"బాలీ దాడుల్లో ఉరి శిక్ష ప‌డిన అలీ ఘుఫ్రాన్‌‌, అమ్రోజీల బంధువును నేను అని మొద‌లుపెడ‌తా. నేను కూడా వారి గ్రూప్‌తో ప‌నిచేశాన‌నీ చెబుతా. కానీ అల్లా ద‌య‌తో ఆ చెడ్డ‌దారి నుంచి బ‌య‌ట‌కు రాగ‌లిగాన‌ని వివ‌రిస్తా. అంతేకాదు మిమ్మ‌ల్ని మ‌క్కాకు తీసుకెళ్లే మార్గాన్నీ చూపిస్తా అంటా."అని సుమ‌ర్నో వివ‌రించారు.

గ్రామంలోని మ‌సీదు ప‌క్క‌న ఓ గ‌దిలో పిల్ల‌లు రంగురంగుల బ‌ట్టలు వేసుకొని ఖురాన్ చ‌దువుతున్నారు.

వీరిలో కొంద‌రి త‌ల్లిదండ్రులు ఉగ్ర‌వాద అభియోగాల‌పై జైలులో శిక్ష అనుభ‌విస్తున్నారు.

ఇక్క‌డ పాఠాలు చెప్పేవారిలో అలీ ఫౌజీ భార్య లూలు, అలీ ఇమ్రాన్ భార్య జుమ్రోటిన్ నీసా కూడా ఉన్నారు.

"అంద‌రూ ఒకే మ‌తాన్ని అనుస‌రించాల్సిన అవ‌స‌రంలేద‌ని వారికి ప‌దేప‌దే నొక్కి చెబుతుంటాం."అని లూలు చెప్పారు.

"మా ద‌గ్గ‌ర ముస్లిమేత‌రులూ ఉన్నారు. వారిని గౌర‌వించాల‌ని చెబుతుంటాం."

అయితే అంద‌రినీ తాము అతివాదం వ‌దిలిపెట్టేలా ఒప్పించ‌లేమ‌ని ఆమె తెలిపారు.

"కొంద‌రు మా మిష‌‌న్ కోసం ప‌నిచేస్తుంటే.. మ‌రికొంద‌రు వ్య‌తిరేకంగా వెళ్తారు. ఇంకా మిలిటెంట్ భావ‌జాల‌ముంటే.. వారికి మేం అస‌లు న‌చ్చం. వారు మా నుంచి దూరంగా ఉంటారు."

"మేం అంతా ఒకే గ్రూప్‌గా ఏర్ప‌డి ఒకే మిష‌న్‌పై ప‌నిచేసేవాళ్లం. అయితే బాలి బాంబు దాడుల త‌ర్వాత చాలా మార్పులు వ‌చ్చాయి."

గ‌త ఏడాది మేలో.. ఓ ఆత్మాహుతి దాడుల కుటుంబం తూర్పు జావాలోని చర్చిల‌పై దాడుల‌కు తెగ‌బ‌డింది. తండ్రి ఒక చ‌ర్చిపై, ఇద్ద‌రు కొడుకులు మ‌రో చ‌ర్చిపై, ప‌దేళ్ల కంటే చిన్న వ‌య‌సున్న‌ ఇద్ద‌రు కూతుర్ల‌తోపాటు త‌ల్లి మ‌రో చ‌ర్చిపై దాడులు చేశారు.

వీరంతా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌)తో సంబంధ‌మున్న జ‌మా అన్ష్‌రాత్ దౌలా (జేఏడీ)కు చెందిన‌వారు.

ఇండోనేసియాలోని భ‌ద్ర‌తా ద‌ళాలు, ఇత‌ర మైనారిటీల‌పై ఇలాంటి దాడుల‌ను జేఏడీ చాలా చేప‌ట్టింది. విరాంటోలోని ఓ ప్ర‌ధాన భ‌ద్ర‌తా ద‌ళ అధికారిపై ఇటీవ‌ల‌ ఓ జంట క‌త్తుల‌తో చేసిన దాడి కూడా వీరి ప‌నే.

ఇలాంటి దాడుల్లో మ‌హిళ‌లూ పాలుపంచుకోవ‌డం చూసి విశ్మ‌యానికి గుర‌య్యాన‌ని లూలు వ్యాఖ్యానించారు.

"ఒక‌సారి ఉగ్ర‌వాదాన్ని వ‌దిలిపెట్టిన‌వారు మ‌ళ్లీ అటు పోకుండా చూసేందుకు నా భ‌ర్త ప‌నిచేస్తున్నారు. అంద‌రినీ ఆయ‌న ఒక చోట చేరుస్తున్నారు. అంతేకాదు చాలా మందిని ఆయ‌న మార్చ‌గ‌లుగుతున్నారు. అయితే ఇప్ప‌టికీ చాలా మంది అతివాద భావ‌జాలంతో ఉన్నారు."

"మేం అతివాదాన్ని పూర్తిగా వేరుచేయ‌లేక‌పోతున్నాం. అని ఆమె వివ‌రించారు"

మేం అలీ ఫౌజీతో క‌లిసి వెళ్తున్న‌ప్పుడు.. ఆయ‌న ఫోన్ మోగుతూనే ఉంది.

ఉగ్ర‌వాద అభియోగాల‌పై శిక్ష అనుభ‌వించి ఇటీవ‌ల విడుద‌లైన ఓ వ్య‌క్తి ఆయ‌న‌కు ఫోన్ చేశాడు. ఇల్లు వెతికిపెట్ట‌డంలో సాయం చేయాల‌ని కోరాడు.

పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన ఆయ‌న త‌ల్లి కూడా ఆయ‌న‌కు ఫోన్‌చేశారు.

"ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌) త‌ర‌ఫున సిరియా, ఇరాక్‌ల‌లో పోరాడేందుకు మాకు తెలిసిన‌వారు చాలా మంది వెళ్లారు."అని ఆయ‌న చెప్పారు.

"కొన్ని రోజుల క్రితం ఐఎస్ మిలిటెంట్‌ను ఇక్క‌డ పోలీసులు అరెస్టు చేశారు. అంటే ఇప్ప‌టికీ ఇక్క‌డ మిలిటెంట్ సంస్థ‌లు ప‌నిచేస్తున్నాయి. వాటితో ఇండోనేసియాకు ముప్పుంది"

అస‌హ‌నం, అతివాదానికి వ్య‌తిరేకంగా తాను పోరాటం చేస్తున్నాన‌ని ఫౌజీ వ్యాఖ్యానించారు.

"కొంచెం గ‌ట్టిగా ప‌నిచేయ‌డంతోపాటు అంద‌రూ నా వెన‌క నిల‌బ‌డితే.. క‌చ్చితంగా ఈ పోరాటంలో విజ‌యం సాధిస్తా."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)