WHO: ‘హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడొద్దు’.. క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత

కరోనావైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేసేందుకు మలేరియాకి వాడే ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచింది. చాలా దేశాల్లో ఈ మందు పని తీరుపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌ని ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ మందు వాడటం వలన కోవిడ్-19 బారిన పడిన రోగులు చనిపోయే ముప్పు ఎక్కువగా ఉందని ఇటీవల వచ్చిన ఒక వైద్య అధ్యయనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఈ మందు వాడటం వలన హృద్రోగ సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వైరస్ నిర్మూలించడానికి ఈ మందు వాడటాన్ని ప్రోత్సహిస్తున్నారు.

కరోనావైరస్ బారిన పడిన రోగులకి హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుతో చికిత్స చేయడం వలన ఎటువంటి లాభం ఉండదని ఇది తిరిగి రోగి చనిపోయే అవకాశానికి దారి తీస్తుందని గత వారం లాన్సెట్ ప్రచురించింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్ మలేరియా, కీళ్ల నొప్పుల చికిత్సకి సురక్షితంగా పని చేస్తుంది కానీ, కోవిడ్-19 కి పని చేస్తుందని ఎటువంటి వైద్య ఆధారాలు లేవని ఈ అధ్యయనం పేర్కొంది.

కరోనావైరస్ చికిత్స కోసం వివిధ మందులు చూపే ప్రభావంపై క్లినికల్ ట్రయిల్స్ నిర్వహిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మందుని వైద్యుల సలహా లేకుండా కోవిడ్-19కి స్వీయ చికిత్సగా తీసుకోవడం కూడా ప్రమాదమని హెచ్చరిస్తూనే వస్తోంది.

ఈ మందుని క్లినికల్ ట్రయిల్స్ నుంచి తప్పించనున్నట్లు ఐక్య రాజ్య సమితి వైద్య నిపుణులు తెలిపారు.

లాన్సెట్ 96000 మంది కరోనావైరస్ సోకిన రోగులపై అధ్యయనం నిర్వహించింది. ఇందులో 15000 మందికి హైడ్రాక్సీక్లోరోక్విన్ కానీ, లేదా దానితో పాటు యాంటీ బయోటిక్ గానీ ఇచ్చారు.

ఈ మందు తీసుకున్న రోగులు మిగిలిన వారితో పోల్చి చూస్తే గుండె సంబంధిత ఇబ్బందులకి లోనై హాస్పిటల్‌లోనే చనిపోతున్నారని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో చికిత్స చేసిన రోగుల్లో 18 శాతం, క్లోరోక్విన్‌తో చికిత్స చేసిన వారిలో 16.4 శాతం, మిగిలిన వారిలో 9 శాతం మరణాలు ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.

యాంటీ బయోటిక్స్‌తో కలిపి ఈ మందుని తీసుకున్న వారిలో మరణాల శాతం ఇంకా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

క్లినికల్ ట్రయిల్స్‌కి ఆవల ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ని వాడొద్దని పరిశోధకులు హెచ్చరించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)