కరోనావైరస్: 'ఖైదీలకు సూర్యరశ్మి సోకకూడదు... కావాలంటే మారణాయుధాలు వాడండి' - జైలర్లకు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడి ఆదేశాలు

సూర్యరశ్మి కూడా కనిపించకుండా జైలును మూసేయాలని, అవసరమైతే ఖైదీలపై మారణాయుధాలను కూడా ప్రయోగించవచ్చంటూ పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చారు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకేలే. ఇటీవలికాలంలో గ్యాంగుల అరాచకాలతో ఆ దేశం ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. కానీ ఈ కఠిన, వివాదాస్పద నిర్ణయాలు దాన్ని ఆపగలవా?

ఇటీవల ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫొటోలను చూస్తే... ఆ దేశంలో సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలు ఉన్నాయన్న మాటను ఎవరూ నమ్మలేరు.

ఈ ఫొటోల్లో అక్కడి జైలులోని కొందరు ఖైదీలు కనిపిస్తారు. వారి చేతులు వెనక్కి విరిచి కట్టి ఉన్నాయి. వారందరినీ ఒకరినొకరు ఆనుకునేంత దగ్గర కూర్చోబెట్టారు. దేశంలో తీవ్రమైన హింస, నేరాలకు పాల్పడినందుకు వారికి ఈ శిక్ష వేశారు. ఏదో కొద్దిమంది ఖైదీలకు ముఖం మీద ఉండీ లేనట్లుగా మాస్క్‌లున్నాయి. చాలా మందికి అవి కూడా లేవు.

దేశంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న గూండా గ్యాంగులపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుందనడానికి ఈ ఫొటోలే నిదర్శనమని ఆ దేశపు న్యాయ, భద్రత వ్యవహారాల మంత్రి ఒసిరిస్ లూనా అన్నారు.

గతంలో రౌడీ గ్యాంగులు ఒకరినొకరు చంపుకోకుండా వారిని వేర్వేరు సెల్స్‌లో ఉంచేవాళ్లమని, ఇప్పుడు వారందరినీ ఒకే చోట ఉంచబోతున్నామని కూడా మంత్రి వెల్లడించారు. ''ఒక్కో గ్యాంగుకు ఒక్కో సెల్ అన్న మాటే ఇకలేదు'' అని మంత్రి ట్విటర్‌లో తేల్చిచెప్పారు. నేరగాళ్లందరినీ కలిపి ఒకే సెల్‌లో ఉంచబోతున్నామని మంత్రి వెల్లడించారు.

ప్రపంచంలోనే నేరాల రేటు అత్యధికంగా ఉన్న దేశంగా ఎల్ సాల్వడార్‌కు పేరుంది. అయితే ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల మర్డర్ రేటు 30 శాతం పడిపోయింది.

ఎల్ సాల్వడార్‌లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రౌడీ గ్యాంగులున్నాయి. మారా సల్వాట్రుచా, బారియో-18 అనే పేర్లతో బాగా ఫేమస్ అయిన ఈ గ్యాంగుల్లో 70,000 మంది దాకా సభ్యులున్నారు. వీరి ప్రధానమైన వృత్తి డ్రగ్స్ సరఫరా, కిడ్నాప్‌లు, ఇంకా చిన్నచిన్న నేరాలు చేయడం. 1992 సివిల్ వార్ తర్వాత బలహీన ప్రభుత్వాలు ఏర్పడటం, పేదరికం తాండవించడంతో వీరంతా నేరాలను వృత్తిగా ఎంచుకున్నారు.

అత్యవసర పరిస్థితి

అధ్యక్షుడిగా నాయిబ్ బుకెలే గత సంవత్సరం బాధ్యతలు తీసుకున్న తర్వాత, నేరగాళ్లపై కఠిన వైఖరిని అవలంబించడం ప్రారంభించారు. జైలులో ఖైదీలు ఏ స్థాయిలో నేరగాళ్లో ప్రజలకు వివరించడానికి ఆయన ఇటీవల ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఖైదీలు తాము ఎవరిని చంపబోతున్నామో ఇతర ఖైదీలకు మెసేజ్‌లు పంపకుంటున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.

ఒక పక్క కోవిడ్-19 నుంచి రక్షణ చర్యల్లో భాగంగా భద్రతా సిబ్బంది వీరిని చూసీ చూడనట్లు వదిలేశారు. దీన్ని ఆసరా చేసుకుని ఖైదీలు రెచ్చిపోయేందుకు ప్రయత్నించారని బుకెలే అన్నారు. ఇటీవల జైలులో హింస చెలరేగి 50మంది హత్యకు గురికావడంతో ప్రభుత్వం ప్రస్తుతం జైళ్లలో అత్యవసర పరిస్థితిని విధించింది.

జైలులో ఖైదీల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రజల ప్రాణాలను లెక్కచేయని ఇలాంటి గూండా గ్యాంగుల విషయంలో అవసరమైతే తుపాకులు కూడా ఉపయోగించాలని, అధికారులకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అధ్యక్షుడు బుకెలే స్పష్టం చేశారు. ఇటీవల న్యాయ భద్రతా వ్యవహారాల మంత్రి ఒసిరిస్ లూనా విడుదల చేసిన ఫొటోల్లో జైలు కిటికీలు, డోర్లకు ప్లైవుడ్, మెటల్ షీట్లు అమర్చిన దృశ్యాలున్నాయి.

ఇదో టైమ్ బాంబ్

తాను తీసుకున్న చర్యల వల్ల వ్యక్తిగతంగా తనకు మంచి పేరుతోపాటు దేశంలో హింస తగ్గుముఖం పడుతుందని అధ్యక్షుడు బుకెలే భావిస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలకన్నా భిన్నమైన విధాన నిర్ణయాలేవీ ఈ ప్రభుత్వం తీసుకోలేదని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు మానవహక్కుల సంఘాలు మాత్రం ఎల్ సాల్వడార్ ప్రభుత్వం తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వివిధ గ్యాంగులకు చెందిన ఖైదీలను ఒకే చోట ఉంచడం ద్వారా ఇరువర్గాల మధ్య ఘర్షణను, హత్యాకాండను ప్రోత్సహించినట్లేనని మానవహక్కుల కార్యకర్తగా పని చేస్తున్న మిగెల్ మాంటెనెగ్రో అన్నారు.

ఇలాంటి ప్రయత్నాలు జైళ్లలో రక్తపాతాన్ని సృష్టిస్తాయని ఎల్ సాల్వడార్ భద్రతా నిపుణురాలు జానెట్టే ఆగ్విలార్ అన్నారు. బీబీసీ స్పానిష్ న్యూస్ సర్వీస్ బీబీసీ ముండోతో మాట్లాడిన ఆమె, మనుషులు నివసించానికి వీలు కానటువంటి గదుల్లో ఖైదీలను కుక్కడం అత్యంత ప్రమాదకరమైన చర్య అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనావైరస్ ప్రబలితే ఇది మరో పెద్ద సమస్యగా మారుతుందని ఆమె అన్నారు.

ఎల్ సాల్వడార్ నియంతృత్వం వైపు అడుగులు వేస్తోందని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ మిగెల్ వివాంకో అన్నారు. ఇటీవల తాను సిద్దం చేసిన రక్షణ ప్రణాళికలకు డబ్బు విడుదల చేసే విషయంలో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచడానికి దేశాధ్యక్షుడు బుకెలే ఆర్మీని రంగంలోకి దింపారు. కోవిడ్-19 నియంత్రణ పేరుతో ఏకపక్షంగా నిర్బంధాలను ఆపాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అధ్యక్షుడు బుకెలే అమలు చేయలేక పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)