బంగ్లాదేశ్: షేక్ ముజీబుర్ రెహ్మాన్ హత్యకేసులో దోషిని 25 ఏళ్ల తర్వాత ఉరితీత

బంగ్లాదేశ్ స్వాతంత్రపోరాట యోధుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్య కేసులో దోషికి ఉరిశిక్ష అమలు చేశారు.

1975లో జరిగిన ఈ హత్యకేసులో దోషి, మాజీ సైనికాధికారి అబ్దుల్ మాజెద్‌కు రాజధాని ఢాకాలోని ఓ జైలులో మరణశిక్ష అమలు చేశారు.

25ఏళ్లగా పరారీలో ఉన్న మాజెద్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్‌తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా 1975లో జరిగిన సైనిక తిరుగుబాటులో హత్యకు గురయ్యారు.

బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిన నాలుగేళ్లకే రహ్మాన్ హత్య జరిగింది.

మాజెద్ క్షమాభిక్ష పిటిషన్‌ ఈవారంలో తిరస్కరణకు గురవడంతో ఆయన్ను ఉరితీశారు.

తిరుగుబాటు, హత్యల తర్వాత కూడా మాజెద్ బంగ్లాదేశ్‌లోనే ఉన్నారు. కానీ 1996లో హసీనా ప్రధాని కావడంతో ఆయన భారత్‌కు పరారయ్యారని భావిస్తున్నారు.

తన తండ్రిని హత్య చేసినవారిని ప్రాసిక్యూషన్ చేయకుండా రక్షించే చట్టాలను హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. 1998లో మాజెద్‌తో పాటు మరో డజను మంది సైనిక అధికారులకు మరణశిక్ష పడింది.

ఈ తీర్పును 2009లో సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఐదుగురికి మరణశిక్ష అమలైంది. గత నెలలో దేశానికి తిరిగివచ్చిన మాజెద్‌ను బంగ్లాదేశ్ అరెస్టు చేసింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)