You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా?
చైనా తాజాగా తమ దేశంలో ఎక్కడా కొత్త కోవిడ్-19 మరణాలు నమోదు కాలేదని ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత చైనా నుంచి ఈ ప్రకటన రావడం ఇదే తొలిసారి. అయితే, ఈ దేశ ప్రభుత్వం చెబుతున్న గణాంకాల విషయంలో ఇంకా కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయని బీబీసీ ప్రతినిధి రోబిన్ బ్రాంట్ అంటున్నారు.
ఇన్నాళ్లూ రోజూ ఉదయం మూడు గంటలకు కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన తాజా గణాంకాలను చైనా అధికారులు వెల్లడిస్తూ వచ్చారు.
ఏప్రిల్ 7 నాటికి, 81,740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 3,331 మంది చనిపోయారని చైనా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఈ మహమ్మారిని చైనా సమర్థంగా ఎదుర్కొన్నదని, వైరస్ వ్యాప్తిని వేగంగా గుర్తించి, పారదర్శకతకు కట్టుబడి పని చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ కొనియాడారు.
అయితే, ఒకవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు అలా ఉంటే, చైనా అధికారికంగా చెబుతున్న అంకెల పట్ల, వైరస్‌పై విజయం సాధించామని ప్రకటించడం పట్ల కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయి.
కరోనావైరస్‌కు సంబంధించి చైనా చెబుతున్న కొన్ని విషయాలు అస్పష్టంగా ఉన్నాయని బ్రిటన్ మంత్రి మైఖేల్ గోవ్ ఇటీవల బీబీసీతో అన్నారు.
పాజిటివ్ కేసులు, మరణాల గణాంకాలను చైనా తక్కువ చేసి చూపుతున్నట్లు అనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరికొందరు అమెరికా ప్రజాప్రతినిధులు కూడా అలాగే విమర్శలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో ఇప్పటికే మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. దీంతో, ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమెలా అన్నదానికి పరిష్కారం కోసం కొందరు చైనా వైపు చూస్తున్నారని అనిపిస్తొంది.
కానీ, మొత్తం కరోనా కేసులు, మరణాలను వెల్లడించడంలో చైనా నిజాయితీగా వ్యవహరించడంలేదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జీడీపీ లాంటి కీలక గణాంకాల విషయంలో చాలాకాలంగా చైనా విమర్శలు ఎదుర్కొంటోంది, పైగా ప్రస్తుతం చెబుతున్న విషయాలలో స్పష్టత లోపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. దాంతో, అనుమానాలు పెరుగుతున్నాయి.
గతం ఏం చెబుతోంది?
ప్రపంచం నమ్మదగిన అధికారిక గణాంకాలను వెల్లడించడంలో, ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సంబంధించిన విషయాలలో చైనాకు చెడ్డ పేరు ఉంది.
చాలా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల పనితీరు గురించి వెల్లడించే త్రైమాసిక గణాంకాలలో కచ్చితత్వం పాటిస్తాయి. కానీ, ఈ కమ్యూనిస్టు దేశంలో అలా లేదు. చాలాకాలంగా చైనా ప్రకటిస్తున్న త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని సూచించే ఒక గైడ్‌గా మాత్రమే కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ వాస్తవ పనితీరును ప్రతిబింబించే కచ్చితమైన అంకెలు మాత్రం వెల్లడించడంలేదు.
కరోనా వ్యాప్తికి ముందు, 2020లో దాదాపు 6 శాతం వృద్ధి సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. చాలా ఏళ్లుగా దాదాపు ప్రతిసారీ ఏమాత్రం వ్యత్యాసం లేకుండా తన అంచనాలను చేరుకుంటున్నట్లు చెబుతోంది.
కానీ, చైనా అంకెల గారడీ చేస్తోందని, వాళ్లు చెబుతున్నంతగా ఆ దేశ వృద్ధి లేదని విదేశాలకు చెందిన కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు.
ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం కొన్నిసార్లు అంచనాలు, లక్ష్యాలను చేరుకోవడంపైనే ఆధారపడుతుంది. అంచనాలను చేరుకోనప్పుడు, వాస్తవాలను దాచిపెడుతుది.
కొన్నిసార్లు చైనా వెల్లడించే అంకెలకు, వాస్తవ వృద్ధి రేటుకు అంతూపొంతూ ఉండటంలేదని, ప్రభుత్వం చెప్పే గణాంకాలతో పోల్చితే, వాస్తవ ఆర్థిక వృద్ధి రేటు సగమే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
గతంలో, చైనాలోని ప్రావిన్సుల వారీగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన గణాంకాల ఆధారంగా ఒక స్వతంత్ర విశ్లేషణ జరిగింది. అప్పుడు, ఆ దేశ వాస్తవ జీడిపీ, అధికారిక గణాంకాల కంటే తక్కువగా ఉందని ఆ విశ్లేషణలో వెల్లడైంది.
జీడీపీ లాంటి కీలకమైన గణాంకాల విషయంలోనే తరచూ ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా, కోవిడ్-19 అంకెల విషయంలోనూ అలాగే వ్యవహరించి ఉంటుందనే అనుమానాలు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
కప్పిపుచ్చుకోవడం
డిసెంబర్ 2019 నాటికి వూహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. కానీ, ప్రారంభ దశలో దాని తీవ్రతను బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా దాచిపెట్టిందన్నది రహస్యం కాదు.
జనవరి ఆరంభం నాటికి అక్కడ దాదాపు 100 కేసులు నమోదయ్యాయి. కానీ, వైరస్‌ను కట్టడి చేసేందుకు జనవరి 23 దాకా తగిన చర్యలు చేపట్టలేదన్న విషయాన్ని వూహాన్ నగర మేయర్ తర్వాత అంగీకరించారు. జనవరి 23 నుంచి వూహాన్‌లో లాక్‌డౌన్ విధించారు.
ఈ వైరస్ గురించి డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా నివేదించింది. అదే సమయంలో, సార్స్ లాంటి వైరస్ వ్యాప్తి చెందుతోందంటూ అందరికంటే ముందే హెచ్చరించేందుకు ప్రయత్నించిన వైద్యుడు లీ వెన్లియాంగ్‌ను పోలీసులు బెదిరించారు.
అప్పటి నుంచి ఆ వైద్యుడితో పాటు, మిగతా ఉద్యమకారులు కూడా మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత కొన్ని రోజులకు డాక్టర్ లీ, కోవిడ్-19 బారిన పడి చనిపోయారు.
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
కరోనావైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యాక కొన్ని వారాల తర్వాత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారి వూహాన్ నగరంలో పర్యటించారు. అప్పటికి, హుబే ప్రావిన్సు మినహా దేశంలో ఎక్కడా కొత్త కేసులు నమోదు కావడంలేదని ప్రకటించారు.
అయితే, అదే సమయంలో వూహాన్‌కు చెందిన ఒక వైద్యుడి ఆందోళన గురించి జపనీస్ వార్తా సంస్థ క్యోడో న్యూస్ ఒక కథనాన్ని ప్రచురించింది. అధికారిక గణాంకాలు మినహా కొత్త కేసుల గురించి పట్టించుకోవద్దని తనతో పాటు, మిగతా వైద్యులకూ అధికారికంగా ఆదేశాలు వచ్చాయని తన పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఆ వైద్యుడు చెప్పారు.
చైనా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు అంకెలు చెబుతోందంటూ అమెరికా ఇంటలిజెన్స్ విభాగం, అధ్యక్ష కార్యాలయానికి నివేదికను సమర్పించిందని ఇటీవల బ్లూమ్‌బర్గ్ పత్రిక పేర్కొంది.
చైనా అధికారికంగా వెల్లడించిన గణాంకాలు వాస్తవమేనని అనుకున్నా, ఆ దేశ చిత్తశుద్ధి పట్ల పదేపదే అనుమాలు వ్యక్తమవుతున్నాయి.
జనవరి నుంచి మార్చి ఆరంభం వరకు, కోవిడ్ -19కు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఏడు రకాల వేర్వేరు నిర్వచనాలను జారీ చేసింది. అందుకు తగినట్లు పరీక్షలు నిర్వహించారు.
మొదట్లో ప్రత్యేకించి వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో పనిచేస్తూ, తీవ్రమైన న్యూమోనియాతో బాధపడుతున్న వారి మీదే దృష్టి పెట్టి పరీక్షలు చేశారని హాంకాంగ్ విశ్వవిద్యాయలానికి చెందిన స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్ బెన్ కౌలింగ్ చెప్పారు.
మిగతా నిర్వచనాలన్నింటి ప్రకారం పరీక్షలు చేసి ఉంటే పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 2,32,000 దాకా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఈ సంఖ్య ప్రస్తుతం ప్రభుత్వం వెల్లడించిన మొత్తం కేసుల కంటే మూడు రెట్లు ఎక్కువ.
ప్రారంభ దశలో ఈ మహమ్మారి ప్రభావాన్ని చాలా తక్కువ అంచనా వేసినట్లు అనిపిస్తోందని ప్రొఫెసర్ కౌలింగ్ అంటున్నారు.
తర్వాత, కొందరికి కరోనావైరస్ సోకినప్పటికీ బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అయితే, అలా లక్షణాలు కనిపించని కేసులను గతవారం వరకు కూడా, కరోనావైరస్ కేసుల జాబితాలో చేర్చలేదు.
జపాన్‌లోని డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో కోవిడ్-19 బారిన పడినవారిలో బయటకు లక్షణాలు కనిపించని వారు 20 శాతం మంది ఉన్నారని ప్రొఫెసర్ కౌలింగ్ తెలిపారు.
నష్టనివారణ చర్యలు
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఆయన చుట్టూ ఉన్నవారు, ఇప్పటికే నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు.
"కరోనావైరస్ కేసులకు సంబంధించి వాస్తవ అంకెలను బహిర్గతం చేయాలి. పారదర్శకతతో కూడిన సమాచారాన్ని వెల్లడించేలా అన్ని ప్రాంతాలకూ ఆదేశాలివ్వాలి" అని చైనా రాజకీయాల్లో రెండవ స్థానంలో ఉన్న లీ కెకియాంగ్ చెప్పారు.
కరోనావ్యాప్తి గురించి, జనవరి మొదటి వారంలోనే అధ్యక్షుడు అధికారులతో సమావేశం నిర్వహించారు. కానీ, ఆ విషయాన్ని అప్పుడు బయటకు చెప్పలేదు. జనవరి 23 నుంచి వూహాన్‌లో లాక్‌డౌన్ విధించిన తర్వాత కొన్ని వారాలకు ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది.
కోవిడ్-19 ప్రభావం అధికంగా ఉన్న ఇటలీ సహా మరికొన్ని దేశాలకు వైద్య సిబ్బందిని, వైద్య పరికరాలను చైనా పంపింది. ఈ వైరస్‌కు టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, మనుషులపై తొలి దశ ట్రయల్స్ నిర్వహించామని తెలిపింది.
కరోనా కేసుల గణాంకాలలో కచ్చితత్వం ఉన్నదా లేదా అన్న విషయాన్ని అటుంచితే, ఈ సంక్షోభం నుంచి చైనా బయటపడటం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ప్రపంచ మహమ్మారికి జన్మనిచ్చిన ఆ దేశం, ఇప్పుడు దానిని అంతం చేయగల దేశంగా కూడా పేరు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- కరోనావైరస్‌కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- లాక్‌డౌన్ ఎఫెక్ట్: 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)