కరోనావైరస్: వెనిస్‌ కార్నివాల్ అర్థంతరంగా రద్దు.. ఇటలీ దిగ్బంధనం

ఇటలీలో కరోనావైరస్ విజృంభణను నియంత్రించే క్రమంలో వెనిస్ కార్నివాల్‌ను అధికారులు అర్ధంతరంగా రద్దు చేశారు.

ఈ ఉత్సవం ఇంకా రెండు రోజులు మిగిలివుండగానే ఆదివారం ముగుస్తుందని వెనిటో అధికారులు చెప్పారు.

యూరప్‌లో ఇప్పటివరకూ అత్యధిక కరోనావైరస్ కేసులు ఇటలీలో నమోదయ్యాయి. మొత్తం 152 మందికి ఈ వైరస్ సోకగా.. ముగ్గురు చనిపోయారు.

మిలాన్, వెనిస్‌లకు సమీపంలో వైరస్ విజృంభించిన ప్రాంతాలను ఇటలీ దిగ్బంధించింది.

వెనిటో, లాంబార్డీ ప్రాంతాల్లోని పలు పట్టణాల్లో నివసిస్తున్న దాదాపు 50,000 మంది జనం.. ప్రత్యేక అనుమతి లేనిదే బయటకు వెళ్లటానికి, రావటానికి వీలులేదు.

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి కొన్ని వారాల పాటు ''అసాధారణ చర్యలు'' ఉంటాయని ప్రధానమంత్రి గిసెప్ కోంట్ పేర్కొన్నారు.

వైరస్ విస్తరిస్తున్న ప్రాంతానికి వెలుపల కూడా అనేక వ్యాపారాలు, పాఠశాలలను మూసివేశారు. క్రీడా కార్యక్రమాలను రద్దు చేశారు.

ఈ జోన్ వెలుపల పరిస్థితి గురించి బీబీసీ ప్రతినిధి మార్క్ లోవెన్.. ''ఇటలీలో కరోనావైరస్ మొదలైన కోడోగ్నోలో 16,000 మంది జనాభాకు కేవలం ఒకే ఒక్క పండ్లు, కూరగాయల దుకాణం తెరచి ఉందని స్థానికుడు ఒకరు నాకు ఫోన్‌లో చెప్పారు'' అని వివరించారు.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఎలా మొదలైందనే ఆచూకీ తెలుసుకోవటానికి తాము ఇంకా ప్రయత్నిస్తున్నామని ఇటలీ అధికారులు పేర్కొన్నారు.

ఇటలీలోని వెనిస్ నుంచి పొరుగు దేశమైన ఆస్ట్రియాకు బయలుదేరిన ఒక రైలులో ఇద్దరు ప్రయాణికులకు జ్వరం లక్షణాలు ఉన్నట్లు తెలియటంతో ఆ రైలును ఆస్ట్రియా సరిహద్దు దగ్గర నిలిపివేశారు. వారిద్దరికీ కరోనావైరస్ లేదని పరీక్షల్లో తేలినట్లు ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల మంత్రి కార్ల్ నేహామర్ అనంతరం బీబీసీతో మాట్లాడుతూ నిర్ధారించారు.

దక్షిణకొరియా, ఇరాన్‌లలో పరిస్థితి ఇదీ...

మరోవైపు.. దక్షిణ కొరియా ఒక భయంకర పరిస్థితిని ఎదుర్కొంటోందని.. వైరస్ వ్యాప్తి మీద పోరాటంలో రాబోయే కొన్ని రోజులు చాలా కీలకంగా మారతాయని అధ్యక్షుడు మూన్ జే-ఇన్ చెప్పారు.

చైనా వెలుపల అత్యధిక కరోనావైరస్ కేసులు దక్షిణకొరియాలో నమోదయ్యాయి. మొత్తం 600 మందికి పైగా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఆరుగురు చనిపోయారు.

అయితే.. జపాన్‌లోని యోకోహామా రేవులో నిలిపివుంచిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కూడా 600 మందికి పైగా కరోనావైరస్ సోకింది.

జపాన్‌లో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో క్వారంటైన్ నుంచి ఇటీవల బ్రిటన్ తిరిగివచ్చిన నలుగురు ప్రయాణికులకు కరోనావైరస్ సోకివుందని పరీక్షల్లో వెల్లడైంది.

చైనాలోని హూబే ప్రావిన్స్‌లో గత ఏడాది పుట్టుకొచ్చిన కొత్త రకం కరోనావైరస్.. కోవిడ్-19 అనే శ్వాస సంబంధిత వ్యాధికి కారకమవుతోంది. చైనాలో ఇప్పటివరకూ 76,000 మందికి ఈ వైరస్ సోకింది. దీని బారినపడి 2,442 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్‌.. తమ దేశంలో 43 కరోనావైరస్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం తెలిపింది. వీటిలో అత్యధికంగా క్వామ్ నగరంలో ఉన్నాయి. వైరస్ సోకిన వారిలో 8 మంది చనిపోయారు. చైనా వెలుపల అత్యధిక సంఖ్యలో మరణాలు ఇవే.

ఇరాక్, పాకిస్తాన్, అర్మేనియా, టర్కీలు.. ఇరాన్‌తో తమ సరిహద్దులను మూసివేశాయి. ఇరాన్‌కు వాయు, రోడ్డు ప్రయాణాలను అఫ్ఘానిస్తాన్ రద్దు చేసింది.

చైనాలో అతిపెద్ద 'ఎమర్జెన్సీ': జిన్‌పింగ్

చైనాలో కరోనావైరస్ విజృంభించటం.. ఇటీవలి చరిత్రలో అతిపెద్ద ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ఆదివారం నాడు అభివర్ణించారు.

ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రతిస్పందించటంలో లోపాలు ఉన్నాయని అంగీకరిస్తూ.. దానినుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు.

కరోనావైరస్ మరణాలు, కొత్త కేసుల నమోదు రేటు తగ్గినట్లు చైనా అధికారులు శనివారం చెప్పారు.

అయితే.. చైనా వెలుపల కొన్ని దేశాల్లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేసులకు చైనాతో సంబంధాలున్నాయా అనేది స్పష్టంకావటం లేదు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)