You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvsAUS టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020: భారత జట్టు చరిత్ర సృష్టిస్తుందా?
- రచయిత, సూర్యాన్షి పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
టీ20 మహిళా ప్రపంచ కప్‌ను తొలిసారి 2009లో నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఈ పోటీలు జరుగుతున్నాయి.
ఫిబ్రవరి 21 నుంచి మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తోంది. మొదటి మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలోని షోడౌన్ మైదానంలో జరగబోతోంది.
టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి.
సంచలనాల బ్యాటింగ్ లైనప్
భారత జట్టు ఈ టోర్నీలో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఆడుతుంది. జట్టులో బాగా బ్యాటింగ్ చేసే క్రీడాకారిణులు గురించి చెబితే హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానా పేర్లు చెప్పాలి. ఇక బౌలింగ్‌లో రాధా యాదవ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ రూపంలో మంచి స్పిన్నర్లున్నారు.
దీప్తి శర్మ, శిఖా పాండే, పూజా వస్త్రకార్ లాంటి ఆల్‌రౌండర్ల ఆటను చూడడమూ మర్చిపోవద్దు.
మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఆడనున్న థాయిలాండ్
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, థాయిలాండ్, పాకిస్తాన్‌లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
వీటిలో థాయిలాండ్ మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు అర్హత సాధించింది.
కాబట్టి అరంగేట్రం చేస్తున్న ఈ జట్టు ఎలా ఆడుతుందో చూడాల్సిందే.
టీనేజ్ సంచలనాలు
ఈసారి చాలా జట్లలో సంచలనాలు సృష్టిస్తున్న టేనేజ్ క్రీడాకారిణులు కనిపిస్తున్నారు. భారత జట్టులో చూస్తే పదహారేళ్ల షెఫాలీ వర్మ, పందొమ్మిదేళ్ల జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌లు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
గతఏడాది జెమీమా మంచి ఫామ్ కనబరిచి భారత్ తరఫున వన్డేల్లో మూడో అత్యధిక స్కోరు, టీ20ల్లో రెండో అత్యధిక స్కోరు సాధించారు.
ఒక్క భారత జట్టులోనే కాదు న్యూజీలాండ్ జట్టులోనూ ఇలాంటి టీనేజ్ క్రీడాకారిణులున్నారు. ఆ జట్టులోని పద్దెనిమిదేళ్ల అమేలియా కెర్ 2018 జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 బంతుల్లోనే 232 పరుగులు సాధించారు.
మహిళా క్రికెట్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌ఉమన్ బెలిందా క్లార్క్ పేరిట 21 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న అత్యధిక స్కోరు రికార్డును అమేలియా ఈ దెబ్బతో బద్దలుగొట్టేశారు.
కొత్త కోచ్.. కొత్త ఆలోచనలు
ఈసారి భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కోచ్, కొత్త దృక్పథంతో ముందుకుసాగుతోంది. ఈసారి జట్టుతో రమేశ్ పొవార్ కాకుండా కొత్త కోచ్ డబ్ల్యూవీ రామన్ వెళ్తున్నారు.
2018 టీ20 మహిళా ప్రపంచ కప్ గుర్తుండే ఉంటుంది. అప్పుడు కోచ్ రమేశ్ పొవార్, మిథాలీ రాజ్ మధ్య పొరపొచ్చాలు గుర్తున్నాయా.. ఏం ఫరవాలేదు. నేను, అప్పటి సంగతులు చెబుతాను.
2018 టీ20 మహిళా ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. అప్పుడు మిథాలీ రాజ్ రమేశ్ పొవార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను అప్పటికే బాగా ఆడుతున్నప్పటికీ పొవార్ పక్షపాతంతో సెమీఫైనలో తనను ఆడించకపోవడం వల్లే జట్టు ఓడిపోయిందని ఆమె ఆరోపించారు. ఆ తరువాత బీసీసీఐ కొత్త కోచ్‌గా రామన్‌ను నియమించింది.
ఇప్పటి వరకు ఆరు ప్రపంచకప్‌లు జరగ్గా అందులో నాలుగింటిని ఆస్ట్రేలియా గెలుచుకుంది. అలాంటి జట్టును ఆ దేశంలోనే ఎదుర్కోవడం భారత్ కోచ్ డబ్ల్యూవీ రామన్‌కు సవాలే.
మార్చి 8న ఫైనల్‌తో రికార్డు బ్రేక్ చేయాలని..
ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌లో మార్చి 3 వరకు గ్రూప్ దశలోని మ్యాచులు జరుగుతాయి. మార్చి 5 నుంచి సెమీఫైనల్స్ మొదలవుతాయి. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను రప్పించి ప్రపంచ రికార్డు సాధించే లక్ష్యంతో మార్చి 8న ఈ ఫైనల్ నిర్వహిస్తున్నారు.
1999లో అమెరికా, చైనా మహిళా ఫుట్‌బాల్ జట్ల మధ్య జరిగిన పోటీకి భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. ఇప్పటివరకు మహిళల క్రీడాపోటీల్లో ఇంక దేనికీ ఇంత పెద్దసంఖ్యలో ప్రేక్షకులు రాలేదు. ఇప్పుడు తాజా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆ రికార్డు బద్దలుగొట్టాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
2009లో ప్రారంభమైన టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ ఇప్పటి వరకూ ఆరుసార్లు జరిగింది. ఇందులో తొలి ప్రపంచకప్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచింది. 2016లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలిచింది. మిగతా నాలుగు ప్రపంచకప్‌లను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్స్ చేరలేదు. మరి, ఈసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టిస్తుందా?
ఇవి కూడా చదవండి:
- ట్రంప్ భారత పర్యటన: ప్రవాస భారతీయుల ఓట్లు రాబట్టుకోవాలన్న కోరిక నెరవేరుతుందా?
- కమల్ హాసన్ 'భారతీయుడు-2' సినిమా సెట్లో ప్రమాదం, ముగ్గురు మృతి
- ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
- మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ
- వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- వివాదాస్పద మత బోధకుడు జాకిర్ నాయక్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు: Ground Report
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)