You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముషరఫ్ మరణశిక్షను రద్దు చేసిన లాహోర్ హైకోర్టు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహోర్ హైకోర్టు తిరస్కరించింది. ముషారఫ్‌ను విచారించిన న్యాయ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.
దేశద్రోహం ఆరోపణల్లో తనను దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించిన ప్రత్యేక కోర్టు ఏర్పాటును సవాల్ చేస్తూ జనరల్ ముషరఫ్ గత డిసెంబర్‌లో లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు.
1999లో సైనిక కుట్ర ద్వారా అధికారం చేజిక్కించుకున్న ముషరఫ్.. 2001 నుంచి 2008 వరకూ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
''ఫిర్యాదు నమోదు చేయటం, ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయటం, ప్రాసిక్యూషన్ బృందాన్ని ఎంపిక చేయటం చట్ట వ్యతిరేకమని హైకోర్టు ప్రకటించింది. మొత్తంగా ఆ కోర్టు తీర్పు మొత్తాన్నీ పక్కన పెట్టింది'' అని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ఇష్తాక్ ఎ. ఖాన్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు వివరించారు.
హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో జనరల్ ముషారఫ్ ''స్వేచ్ఛా జీవి'' అయ్యారని, ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడిక ఎటువంటి తీర్పూ లేదని పేర్కొన్నారు.
జనరల్ ముషరఫ్ 2007లో తన పదవీ కాలాన్ని పొడిగించుకోవటం కోసం రాజ్యాంగాన్ని రద్దు చేసి, అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి సంబంధించిన ఈ కేసును మరొక కోర్టులో విచారించే అవకాశం ఉందని బీబీసీ ఉర్దూ చెబుతోంది.
స్వాతంత్ర్యానంతర చరిత్రలో అత్యధిక కాలం సైనిక పాలనలో ఉన్న పాకిస్తాన్ వంటి దేశంలో, దేశాధ్యక్షుడిగా దీర్ఘ కాలం పనిచేసిన ఒక మాజీ సైనిక జనరల్‌ను దోషిగా నిర్ధారించిన 2014 నాటి తీర్పుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ దేశంలో మరే ఇతర సైనిక పాలకుడూ చట్టపరంగా ఇటువంటి పర్యవసానాలను ఎదుర్కోలేదు.
ముషరఫ్ కేసులో గత డిసెంబర్‌లో తీర్పు వెలువడినపుడు అటు సైన్యం, ఇటు ప్రభుత్వం రెండూ గట్టిగా వ్యతిరేకించాయి.
కానీ, ఆ శిక్షను అమలు చేసే అవకాశం లేదు. తాను ఎటువంటి తప్పూ చేయలేదని ఎల్లప్పుడూ చెప్పే జనరల్ ముషరఫ్, 2016లో పాకిస్తాన్ విడిచి వెళ్లటానికి అనుమతి పొందారు. ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు.
ముషరఫ్ మీద కేసు ఏంటి?
జనరల్ ముషరఫ్ 2007 నవంబర్‌లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి అత్యవసర పరిస్థితిని విధించారు. ఆ చర్యతో దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, అభిశంసన ముప్పును నివారించటానికి ఆయన 2008లో రాజీనామా చేశారు.
ముషారఫ్ 1999 కుట్రలో దేశం నుంచి బహిష్కరించిన పాత ప్రత్యర్థి నవాజ్ షరీఫ్ 2013లో ప్రధానమంత్రిగా ఎన్నికైనపుడు జనరల్ ముషరఫ్ మీద దేశద్రోహం విచారణ ప్రారంభించారు. విచారణ చేపట్టిన కోర్టు.. 2014 మార్చిలో ముషారఫ్‌ను దేశద్రోహం నేరం కింద దోషిగా ప్రకటించింది.
ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని, 2007లో తాను చేపట్టిన చర్యలకు అప్పటి ప్రభుత్వం, మంత్రివర్గం అంగీకరించిందని ముషరఫ్ వాదించారు. కానీ, ఆయన వాదనలను విచారణ కోర్టు తిరస్కరించింది. ఆయన చట్టవ్యతిరేకంగా ప్రవర్తించారని దోషిగా నిర్ధారించింది.
పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం దేశద్రోహం కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఎవరైనా మరణ శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.
ముషరఫ్ విదేశీ ప్రయాణం మీద ఉన్న నిషేధాన్ని 2016లో తొలగించిన తర్వాత ఆయన దుబాయ్ వెళ్లారు. కోర్టు ముందు హాజరు కావాలని పలుమార్లు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆయన తిరస్కరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు... ఎందుకు?
- ఉల్లి ధర పెరిగిందని చెబుతూ మిమ్మల్ని మోసం చేస్తున్నారా...
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- అల వైకుంఠపురములో సినిమా రివ్యూ:
- మేగన్ మార్కెల్‌ను అందుకే డయానాతో పోల్చుతున్నారు
- ఆమె శరీరంలో ఇరవైకి పైగా తూటాలు... సిరియా శాంతిదూత హెవ్రిన్ ఖలాఫ్‌ను చంపింది ఎవరు?
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- ట్రాయ్: ట్రోజన్ యుద్ధం నిజంగా జరిగిందా లేక కట్టు కథా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)