You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుసాకు మేజావా: 'చంద్రుని వద్దకు నాతో నా జీవిత భాగస్వామిగా వస్తారా... అయితే దరఖాస్తు చేసుకోండి' - జపాన్ కోటీశ్వరుడు
జపాన్‌కు చెందిన మహా సంపన్నుడు యుసాకు మేజావా... చందమామ మీదకు ప్రయాణంలో తనకు తోడుగా రావటానికి ''జీవిత భాగస్వామి''గా ఒక మహిళ కోసం అన్వేషిస్తున్నారు.
చంద్రుడి దగ్గరకు స్పేస్-ఎక్స్ సంస్థ తొలి అంతరిక్ష పర్యాటక యాత్రలో జపాన్ ఫ్యాషన్ దిగ్గజం యుసాకు (44) ప్రయాణించనున్నారు. అంతరిక్ష యానం చేసిన మొదటి పౌర ప్రయాణికుడిగా ఆయన అవతరించబోతున్నారు.
ఈ అంతరిక్షయాత్ర 2023లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే, 1972 అనంతరం సాధారణ పౌరులు చంద్రుని మీదకు వెళ్లడం అదే మొదటిసారి అవుతుంది.
ఈ జాబిల్లి యాత్ర అనుభవాన్ని ఒక ''విశిష్ట'' మహిళతో పంచుకోవాలని తాను కోరుకుంటున్నట్లు యుసాకు ఆన్‌లైన్‌లో ప్రకటించారు.
అతడు ఇటీవలే తన గర్ల్‌ఫ్రెండ్, నటి అయామి గోరికి(27)తో విడిపోయాడు. తన జీవిత భాగస్వామి కావాలని భావించే వారు.. పెళ్లిచూపుల కార్యక్రమానికి తన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
''నాలో ఒంటరితనం భావన.. ఖాళీగా అనిపిస్తుండటం నెమ్మదిగా పెరుగుతున్నాయి. అందుకే ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను: ఒక మహిళను ప్రేమించటం కొనసాగించాలి'' అని యుసాకు తన వెబ్‌సైట్‌లో రాశారు.
''నేను ఒక జీవితభాగస్వామిని వెదికి పట్టుకోవాలని కోరుకుంటున్నా. నా ఆ భవిష్యత్ భాగస్వామితో అంతరిక్షంలో మా ప్రేమను, ప్రపంచ శాంతిని అరిచి చెప్పాలని కోరుకుంటున్నా'' అని వివరించారు.
ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తవటానికి మూడు నెలల సమయం పడుతుందని ఆ వెబ్‌సైట్ చెప్తోంది. దరఖాస్తు చేయటానికి పలు షరతులు కూడా ఉన్నాయి.
డేటింగ్ ప్రొఫైల్ శైలిలో రాసిన ఆ షరతులు: దరఖాస్తుదారులు ఒంటరి మహిళలై ఉండాలి. 20 ఏళ్ల వయసు దాటి ఉండాలి. సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. అంతరిక్షంలోకి వెళ్లాలన్న ఆసక్తి ఉండాలి.
దరఖాస్తు చేసుకోవటానికి తుది గడువు జనవరి 17వ తేదీ. యుసాకు తన జీవిత భాగస్వామికి సంబంధించిన తుది నిర్ణయం మార్చి చివర్లో ప్రకటిస్తారు.
యుసాకు ఒక హార్డ్‌కోర్ పంక్ బ్యాండ్ (గాన బృందం)లో డ్రమ్మర్‌గా కీర్తి సంపాదించుకున్నారు. జనం దృష్టిని ఆకర్షించే విన్యాసాలు చేస్తుంటారు.
యుసాకు గత నెలలో, తన ట్వీట్ ఒక దానిని షేర్ చేసిన వారిలో ఎవరైనా 100 మందికి ఒక్కొక్కరికి 10 లక్షల యెన్‌లు పంచుతానని హామీ ఇచ్చారు.
''ఇందులో పాల్గొనటానికి మీరు చేయాల్సిందల్లా.. నన్ను ఫాలో అవటం ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేయటం'' అని చెప్పారు.
జపనీస్ ఆన్‌లైన్ దుస్తుల విక్రయ సంస్థ జోజో ఇంక్ వ్యవస్థాపకుడైన యుసాకా.. ఫ్యాషన్ వ్యాపారంతో సంపన్నుడయ్యాడు. అతడికి వ్యక్తిగతంగా సుమారు 300 కోట్ల డాలర్ల ఆస్తి ఉన్నట్లు భావిస్తారు. అందులో చాలా వరకూ అతడు కళ కోసం ఖర్చుపెడతారు.
మరొక విఖ్యాత బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన స్పేస్ ఎక్స్.. చంద్రుడి చుట్టూ చేపట్టబోయే యాత్రలో ప్రయాణించే తొలి ప్రైవేటు ప్రయాణికుడిగా యుసాకు పేరును గత ఏడాది చివర్లో ప్రకటించటంతో అతడి గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది.
అయితే, అంతరిక్ష యాత్ర టికెట్ కోసం యుసాకు ఎంత చెల్లించబోతున్నాడన్నది వెల్లడించలేదు. మస్క్ మాత్రం ''చాలా డబ్బు'' అని చెప్పారు.
అంతరిక్ష యాత్రకు తనతో పాటు కొంతమంది కళాకారుల బృందాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు కూడా యుసాకు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్ వివాహ పత్రాల్లో 'కన్య' అనే మాటను తొలగించిన కోర్టు
- అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు.. కనీస వివాహ వయసులో ఈ తేడా ఎందుకు?
- ఆమె శరీరంలో ఇరవైకి పైగా తూటాలు... సిరియా శాంతిదూత హెవ్రిన్ ఖలాఫ్‌ను చంపింది ఎవరు?
- ఇరాన్ దాడి: ఈ సంక్షోభంలో గెలిచిందెవరు? ఓడిందెవరు?
- అల వైకుంఠపురములో సినిమా రివ్యూ:
- ఉల్లి ధర పెరిగిందని చెబుతూ మిమ్మల్ని మోసగిస్తున్నారా?
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)