చైనా హార్బిన్ మంచు ఉత్సవం: ఆకాశాన్నంటే మంచు కోటలు.. ఐస్ క్రీడల పోటీలు

హార్బిన్ అంతర్జాతీయ మంచు, హిమ శిల్ప ఉత్సవం జనవరి 5వ తేదీన బాణాసంచా పేలుళ్లు, సంబరాల మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది.

చైనాలోని ఈశాన్య ప్రాంతంలో గల హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవం.. ప్రపంచంలో అతిపెద్ద మంచు, హిమ ఉత్సవాల్లో ఒకటి.

ఈ మంచు ప్రపంచాన్ని నిర్మించటానికి దాదాపు 2,20,000 చదరపు మీటర్ల మంచును ఉపయోగించినట్లు చెప్తున్నారు.

ఆకాశాన్నంటుతున్నట్లు కనిపించే ఘనీభవించిన మంచు కోటలు సందర్శకులకు కనులవిందు చేస్తాయి.

మంచుతో చెక్కిన ఆవిరి యంత్ర రైలు కూడా ఉంది ఇక్కడ.

ఈ వార్షిక హార్బిన్ మంచు ఉత్సవం 1963లో మొదలైంది. చైనా సాంస్కృతిక విప్లవం కారణంగా మధ్యలో కొన్నేళ్లు అంతరాయం కలిగినా.. 1985లో మళ్లీ ప్రారంభమైంది.

ఎత్తైన మంచు నిర్మాణాలతో పాటు.. స్లెడ్జింగ్, ఐస్ హాకీ, ఐస్ ఫుట్‌బాల్, స్పీడ్ స్కేటింగ్, ఆల్పైన్ స్కీయింగ్ పోటీలు కూడా ఈ ఉత్సవంలో జరుగుతాయి.

ఎముకలు కొరికేంత చల్లగా ఉండే నీటిలో ఈతల పోటీలు కూడా ఉంటాయి. సాంఘువా నదిలో ఈతల పోటీలో పాల్గొన్న వారిని కింద ఫొటోల్లో చూడవచ్చు.

మంచు థీమ్‌తో సామూహిక వివాహం ఈ పండుగలో విశిష్ట ఆకర్షణ. ఈ ఏడాది సుమారు 40 జంటలు ఇక్కడ పెళ్లి చేసుకున్నట్లు చెప్తున్నారు.

హార్బిన్ మంచు ఉత్సవం 2020 ఫిబ్రవరి 25వ తేదీ వరకూ కొనసాగుతుంది.

ఈ మంచు ఉత్సవాన్ని వీక్షించటానికి చైనా నుంచే కాదు.. ప్రపంచం నలుమూలల నుంచీ సందర్శకులు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)