ఇంగ్లండ్: సీరియల్ రేపిస్టుకు 33 యావజ్జీవ శిక్షలు

11 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన ఓ సీరియల్ రేపిస్టుకు ఇంగ్లండ్ కోర్టు 33 యావజ్జీవ శిక్షలు విధించింది.

జోసెఫ్ మెక్ కన్న్ బాధితుల్లో 11 ఏళ్ల చిన్నారుల నుంచి 71 ఏళ్ల మహిళలు కూడా ఉన్నారు. రోడ్డుపై వెళుతున్న మహిళలను కత్తితో బెదిరించి అత్యాచారం చేసేవాడు. ఇలా ముగ్గురు మహిళలను అపహరించి వారిపై పదేపదే అత్యాచారం చేశాడు.

37 నేరాలకు సంబంధించి అతడ్ని దోషిగా తేలుస్తూ శుక్రవారం ఓల్డ్ బెయిలేలోని సెంట్రల్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది.

తీర్పు సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ఎడిస్ మాట్లాడుతూ, మెక్ కన్న్ పిల్లలపై లైంగిక హింసకు పాల్పడే ప్రమాదకారి పేర్కొన్నారు.

కనీసం 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలని, 33 యావజ్జీవ శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని మెక్ కన్న్‌కు చెప్పారు.

నేరస్తుడు తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని న్యాయమూర్తి తెలిపారు. మెక్ కన్న్ బాధితులను ఈ వ్యవస్థ రక్షించడంలో ఎందుకు విఫలమైందనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

మక్ కన్న్‌ను గత ఫిబ్రవరిలోనే అదపులోకి తీసుకున్నప్పటికీ సరైన దర్యాప్తు జరగకపోవడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.

34 ఏళ్ల ఈ సీరియల్ రేపిస్ట్ వాట్‌ఫోర్డ్‌లో ఏప్రిల్‌ నుంచి లైంగిక దాడులు చేయడం మొదలు పెట్టాడు. తర్వాత లండన్, గ్రేటర్ మాంచెస్టర్‌లోనూ ఇదే తరహా దాడులు చేశాడు.

తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఎడిస్ మాట్లాడుతూ, ''నువ్వు చేసిన పనికి బాధితులు ఎప్పటికీ కోలుకోలేరు. జీవితాంతం వారు మానసికంగా కుమిలిపోతారు'' అని మెక్ కన్న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వోడ్కా సీసాతో దాడి

ఏప్రిల్21న వాట్‌పోర్డ్‌లోని ఒక నైట్ క్లబ్ నుంచి ఇంటికి వెళుతున్న 21 ఏళ్ల యువతిని మెక్‌ కన్న్ కత్తితో బెదిరించి తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు.

నాలుగు రోజుల తర్వాత తూర్పు లండన్‌లోని రోడ్డుపై నడుస్తున్న 25 ఏళ్ల యువతిని అపహరించి అనేకసార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.

అదే రోజు ఈడ్జ్‌వేర్‌ వీధుల్లో నడుస్తున్న 21 ఏళ్ల యువతి ఆమె సోదరిని అపహరించి ఒక హోటల్ రూంలో బంధించాడు. అయితే, ఈ ఇద్దరు యువతులు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. పారిపోయేముందు వారిలో ఒకరు అతడి తలపై వోడ్కా సీసాతో దాడి చేశారు.

వరస అత్యాచారాలకు పాల్పడుతున్న ఈ నేరగాడు మే6న తన కారుతో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టి పారిపోయాడు.

దీంతో అతని కోసం హెలికాప్టర్ ద్వారా గాలింపు చేపట్టిన పోలీసులు ఒక చెట్టు వద్ద అతడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఓల్డ్ బెయిలీ విచారణకు హాజరుకావడానికి మక్ కన్న్ నిరాకరించాడు. సాక్ష్యం ఇవ్వకుండా జైలులో దుప్పటి కింద దాక్కున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)