టాటూలతో అర్ధనగ్న ప్రదర్శనలు, విచారణకు ఆదేశించిన మలేషియా ప్రభుత్వం

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో కొందరు పురుషులు, మహిళలు అర్ధనగ్నంగా శరీరంపై టాటూలు వేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. టాటూ ఎగ్జిబిషన్‌లో కొందరు టాటూలను ప్రదర్శించడం 'అసభ్యం'గా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మలేషియా మంత్రి విచారణకు ఆదేశించారు.

ఆ ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇచ్చాం కానీ, ఇలాంటి నగ్న ప్రదర్శనలకు అనుమతి ఇవ్వలేదని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మొహమ్మదిన్ కెటాపి అన్నారు.

"ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం మలేషియా సంస్కృతి కాదు. మలేషియాలో మెజార్టీ ప్రజలు ముస్లింలు ఉన్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

తాజాగా కౌలాలంపూర్‌లో నిర్వహించిన 'టాటూ మలేషియా ఎక్స్‌పో'లో దాదాపు 35 దేశాలవారు పాల్గొన్నారు.

ఈ ప్రదర్శన కార్యక్రమం 2015 నుంచి ఏటా నిర్వహిస్తుండగా, ఈ సారి మాత్రమే ప్రభుత్వం నుంచి విమర్శలు వచ్చాయి. ఈ షో నిర్వాహకుల మీద 'కఠిన చర్యలు' తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

"అసభ్యతతో కూడిన ఇలాంటి కార్యక్రమాలకు మా మంత్రిత్వ శాఖ ఎప్పుడూ అనుమతి ఇవ్వదు" అని మంత్రి అన్నారు.

ఈ ప్రదర్శనలో కొందరు శరీరమంతా భారీగా టాటూలు వేయించుకుని అర్ధనగ్నంగా పోజులిచ్చారు. కొన్ని చిత్రాలను మలేషియా మీడియా బ్లర్ చేసింది.

"విచారణ నివేదిక కోసం వేచిస్తున్నాం. వాళ్లు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారి మీద న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడబోం" అని కెటాపి అన్నారు.

మూడు కోట్ల జనాభా ఉన్న మలేషియాలో 60 శాతం మంది ముస్లింలే ఉన్నారు. మతపరమైన ఈ దేశం మతపరమైన సంప్రదాయవాదం వైపు అడుగులు వేస్తోందని విమర్శకులు అంటున్నారు.

స్వలింగ సెక్సుకు యత్నించిన అయిదుగురు పురుషులకు ఈ ఏడాది ఇక్కడి కోర్టు జైలు శిక్ష, బహిరంగ దండన శిక్ష, జరిమానాలు విధించింది. టెరెంగ్గాను రాష్ట్రంలో స్వలింగ సెక్సులో పాల్గొన్నందుకు 2018లో ఇద్దరు మహిళలకు బహిరంగ దండన శిక్ష విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)