ఇరాన్‌లో పెట్రోలు ధరల పెరుగుదల: భద్రతా దళాలను మోహరించక తప్పదంటూ నిరసకారులకు హెచ్చరిక

ఇరాన్‌లో కొత్త చమురు విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నవారిని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి అబ్దుల్ రెజా రెహ్మానీ ఫజల్ హెచ్చరించారు. ఆందోళనలు విరమించకుంటే భద్రత దళాలను రంగంలోకి దించాల్సి ఉంటుందన్నారు.

పెట్రోలు ధరలు పెంచడంతో పాటు కోటా విధించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చెలరేగిన హింసలో ఒకరు మృతిచెందారు.

పెట్రోలు ధరల పెంపుతో దేశంలో పేదరిక నిర్మూలనకు నిధుల లభ్యత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌కి ఆర్థిక ఇబ్బందులు మొదలుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

శుక్రవారం ఈ కొత్త చమురు విధానం ప్రకటించిన వెంటనే ప్రజలు వీధుల్లోకి వచ్చిన ఆందోళన ప్రారంభించారు. శనివారం కూడా ఈ ఆందోళనలు కొనసాగాయి.

నిరసనల నేపథ్యంలో ఇంటర్నెట్ షట్‌డౌన్ ఉండొచ్చని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

మంత్రి రెహ్మానీ ఫజల్ శనివారం ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ పరిస్థితి ఇలాగే ఉంటే శాంతి నెలకొల్పడం కోసం చట్టాన్ని, భద్రతా దళాలను ప్రయోగించక తప్పదన్నారు.

ప్రజల్లో భయోత్పాతం సృష్టించడానికి, ప్రభుత్వాన్ని బెదిరించడానికి కొందరు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.

సిర్జాన్‌లో ఒకరి మృతి

రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు, హింస కారణంగా సిర్జాన్ నగరంలో ఒకరు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని.. శనివారం ఒక పెట్రోలు నిల్వ కేంద్రానికి నిప్పంటించే ప్రయత్నం చేశారని ఇరాన్ ప్రభుత్వ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. దొరౌద్, గర్మ్‌సార్, గోర్గాన్, ఇలామ్ కరాజ్, ఖొరామాబాద్, కాజ్విన్, కోమ్, సనందాజ్, షిరాజ్, ఇర్నా నగరాల్లోనూ హింస చెలరేగింది.

సోషల్ మీడియాలో వస్తున్న ఫుటేజ్‌ని బట్టి ఈ హింసలో మరికొందరు కూడా మరణించినట్లు తెలుస్తోంది.

అయితే, గతంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుటేజ్‌ను తాజావిగా సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఇరాన్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఏమిటీ కొత్త చమురు విధానం

ఇరాన్‌లో తీసుకొచ్చిన కొత్త చమురు విధానం ప్రకారం.. మోటారు వాహనాలు ఉన్నవారికి నెలకు 60 లీటర్ల పెట్రోలు వరకు లీటరు 15 వేల రియాళ్ల (సుమారు రూ. 312.26) ధరకు విక్రయిస్తారు. 60 లీటర్ల కోటా దాటిన తరువాత లీటరుకు 30 వేల రియాళ్లు (రూ. 64.53) చెల్లించాలి.

పాత విధానంలో నెలకు 250 లీటర్ల వరకు 10 వేల రియాళ్ల (రూ. 21.51) ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉండేది.

పెట్రోలుపై ఇస్తున్న రాయితీలను తొలగించి ఆ డబ్బును పేదరిక నిర్మూలనకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

పెట్రోలు ధరల పెంపు, రాయితీల తొలగింపు వల్ల 1.8 కోట్ల కుటుంబాలకు అదనపు నగదు భృత్యం లభిస్తుందని ఇరాన్ ప్లానింగ్, బడ్జెట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ బాకర్ నోబక్త్ చెప్పారు.

అమెరికా ఆంక్షలు ఎలా దెబ్బతీశాయంటే..

భారీ రాయితీల కారణంగా ప్రపంచంలోనే చమురు ధరలు బాగా తక్కువ ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటిగా ఉండేది. ప్రపంచంలో చమురు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లోనూ ఇరాన్ ఒకటి.

అమెరికా ఆంక్షల కారణంగా ఆయిల్ ప్లాంట్లు, రిఫైనరీలకు అవసరమైన విడిభాగాల లభ్యత తగ్గి చమురు ఉత్పత్తి పడిపోయింది.

ఫలితంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. కరెన్సీ విలువ భారీగా పతనమైంది. వార్షిక ద్రవ్యోల్బణం నాలుగు రెట్లు పెరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)