అమెరికాలో జైలుకు కన్నం వేసి ఈ ఖైదీలు ఎలా పారిపోయారంటే..

కాలిఫోర్నియాలో జైలుకు కన్నం వేసి పారిపోయిన ఇద్దరు నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.

సాలినాస్ పట్టణంలోని ఓ జైలులో టాయిలెట్ పైకప్పుకు 55 సెం.మీ.ల రంధ్రం పెట్టి శాంటోస్ శామ్యూల్, జనాథన్ సలాజర్ అనే ఈ ఇద్దరు ఖైదీలు తప్పించుకు పారిపోయారు. వీరిద్దరిపై హత్య కేసులు ఉన్నాయి.

శాంటోస్ వయసు 21 ఏళ్లు. జనాథన్‌కు 20 ఏళ్లు.

జైలులో నిఘా లేని ఓ చోటును వీరు ఉపయోగించుకుని ఆదివారం పారిపోయారని అధికారులు తెలిపారు.

హత్య కేసుల్లో నిందితులైన వ్యక్తులు తప్పించుకోవడం తమను నిరాశకు గురిచేసిందని మాంటెరరీ కౌంటీ షెరిఫ్ కార్యాలయం అధికార ప్రతినిధి జొనాథన్ థోర్నబర్గ్ వ్యాఖ్యానించారు.

తప్పించుకున్న ఖైదీలు ప్రమాదకరమైన వ్యక్తులని, వారి వద్ద ఆయుధాలు కూడా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఖైదీల ఆచూకీ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.3.5 లక్షల నగదు రివార్డు ఇస్తామని కూడా పోలీసు శాఖ ప్రకటించింది.

ఎలా పారిపోయారంటే..

గార్డుల పర్యవేక్షణ లేని ఓ టాయిలెట్ సీలింగ్‌కు శాంటోస్ శామ్యూల్, జనాథన్ సలాజర్ ఓ రంధ్రం పెట్టారు.

దానిలో నుంచి పైకి ఎక్కి, పైపులు ఉండే మెయింటెనెన్స్ ఏరియాలోకి ప్రవేశించారు.

అందులో నుంచి పాక్కుంటూ వెళ్లారు. కొన్ని చోట్ల ఇది 30 సెం.మీ.ల వెడల్పు మాత్రమే ఉంది. వాళ్లు అలాగే పాక్కుంటూ వెళ్లి ఓ కిటికీని చేరుకున్నారు. దాన్ని బలవంతంగా తెరిచి, బయటపడ్డారు.

ఈ కిటికీ జైలు వెనుక వైపు ఉందని, ఆ ప్రాంతంలో భద్రతాపరమైన కంచె లాంటిదేమీ లేదని అధికారులు తెలిపారు.

వారిపై ఉన్న కేసులేంటి?

పరారైన ఈ ఇద్దరు ఖైదీలపై వేర్వేరుగా హత్య కేసులు ఉన్నాయి. వీళ్లిద్దరూ గతేడాది అరెస్టయ్యారు.

2018 జూన్‌లో నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరిని హత్య చేసినట్లు శాంటోస్‌పై అభియోగాలు నమోదయ్యాయి.

2017 అక్టోబర్‌లో జేమీ మార్టినెజ్ అనే యువకుడిని కాల్చి చంపినట్లు సలాజార్‌పై కేసు నమోదైంది.

కోర్టుల్లో ఈ ఇద్దరు నిందితులూ తమ నేరాలను అంగీకరించలేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)