ఈ కోడి పుంజు కూత పెట్టే తన హక్కును పోరాడి సాధించుకుంది... ఎందుకు?

మౌరీస్ - ఒక కోడి పుంజు.. కూత పెట్టే హక్కును కోర్టుకెళ్లి మరీ సాధించుకుంది.

ఫ్రాన్స్‌లోని ఒక కోర్టు ఆ కోడికి కూత హక్కు ప్రసాదించింది.

సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న హక్కుతో మౌరీస్ ఇప్పుడిక తరతరాల తన సంప్రదాయం ప్రకారం ఉదయాన్నే నిరభ్యంతరంగా కూత పెట్టవచ్చు.

ఫ్రాన్స్‌లో పట్టణ - గ్రామీణ సమాజాల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్తతలకు మౌరీస్ ఒక చిహ్నంగా మారింది. అసలింతకీ ఏం జరిగిందంటే..

మౌరీస్ వయసు నాలుగేళ్లు. ఫ్రాన్స్ అట్లాంటిక్ తీరంలోని ఓలెరాన్‌ దీవిలో నివసిస్తోంది. అయితే.. ఈ దీవి ఇప్పుడు ఫ్రాన్స్ నగరవాసులకు ఓ ప్రశాంత గమ్యస్థానంగా మారింది. వాళ్లు తాము నివసించటం కోసం రెండో ఇల్లు కొనుక్కోవటానికి ఈ దీవికి వరుసకడుతున్నారు.

అలాంటి ఓ నగరవాసి జీన్ లూయీ బైరన్. అతడు ఈ దీవిలో ఓ ఇల్లు కొనుక్కున్నాడు. అది కూడా మౌరీస్ ఇంటి పక్కనే. కానీ పొరిగింట్లో ఉన్న మౌరీస్ రోజూ ఉదయాన్నే కూతపెట్టటం అతడికి చికాకు తెప్పిస్తోంది.

ఆ కోడిని కూత వేయకుండా అదుపులో ఉంచాలని దాని యజమానులైన జాకీ ఫెసీ అతడి భార్య కోరీన్‌లను డిమాండ్ చేశాడు..

జాతీయ స్థాయి చర్చ

''మీ కోడిపుంజు ఉదయం 4:30 గంటలకే కూత పెట్టటం మొదలుపెడుతుంది. పొద్దునంతా కూస్తూనే ఉంటుంది. మధ్యాహ్నం వరకూ కూస్తూనే ఉంటుంది'' అంటూ బైరన్ 2017లో తన పొరుగింటి వారికి పంపిన ఓ అధికారిక లేఖలో ఆరోపించాడు. దాని నోరు మూయించాలని డిమాండ్ చేశాడు.

కానీ.. మౌరీస్ గొంతు తాను నొక్కలేనని జాకీ తిరస్కరించాడు. బైరన్ ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా తలవంచలేదు.

దీంతో వారి మీద బైరన్ కోర్టులో కేసు వేశాడు. పొరుగింటిలోని కోడి కూతతో ధ్వనితో తన ప్రశాంతతకు భంగం కలుగుతోందంటూ మౌరీస్ యజమానుల మీద ఫిర్యాదు చేశాడు.

ఈ కేసు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

ఫ్రాన్స్‌లో పెరిగిపోతున్న పట్టణీకరణ కారణంగా.. గ్రామీణ ప్రాంతాల్లోకి వలస వస్తున్న 'నగరపోళ్ల'కి స్థానికంగా ఉండే 'ఊరోళ్ల'కి మధ్య జీవన విధానానికి సంబంధించిన ఘర్షణలు పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మౌరీస్‌కు దేశం నలుమూలల నుంచీ సానుభూతిపరులు లభించారు. ఆ కోడిపుంజు కూత హక్కును కాపాడాలంటూ ఎలాక్ట్రానిక్ పిటిషన్ మీద 1.40 లక్షల మంది సంతకాలు చేశారు.

''తర్వాత ఏంచేస్తారు? ఈ సీగల్స్ రోదించకూడదని, ఆ పావురాలు ఏడవకూడదని నిషేధిస్తారా?'' అంటూ ఈ పిటిషన్ రచయితలు ప్రశ్నించారు. దీనిని ఫ్రెంచ్ వెబ్‌సైట్ మెస్ ఒపీనియన్స్ ప్రచురించింది.

ఇంకొందరు సానుభూతిపరులు ఆ కోడిపుంజు తల బొమ్మతో టీ-షర్టులు ముద్రించి పంపిణీ చేశారు. ఆ టీ-షర్టులు విక్రయిస్తున్న స్థానిక వ్యాపారి బెనాయిట్ గిటన్.. ''జాకీ, కోరీన్‌లకు మద్దతు ఇవ్వటం ఉద్దేశం. అలాగే.. ఒక కోడిని కోర్టు కేసులోకి లాగటం మీద ఆగ్రహాన్ని వెలిబుచ్చటం కూడా మా లక్ష్యం'' అని చెప్పాడు.

ఈ కోడిపుంజు ప్రశాంతతకు భంగం కలిగిస్తోందని నిర్ధారిస్తే.. దాని యజమానుల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయాలని బైరన్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించారు.

అయితే.. రోచ్‌ఫోర్ట్ పట్టణంలోని కోర్టు.. మౌరీస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఆ కోడిపుంజు యజమానులకు పరిహారం కింద 1,100 డాలర్లు చెల్లించాలని కూడా బైరన్‌ను ఆదేశించింది.

కోర్టు తీర్పు అనంతరం కోరీన్ మాట్లాడుతూ.. ''గ్రామీణ ప్రాంతం గ్రామీణంలాగానే ఉండాలి. 'గ్రామీణ శబ్దాలను వినిపించకుండా చేయాల'ని చెప్పకూడదు'' అని పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

''మౌరీస్ నేడు మొత్తం ఫ్రాన్స్ తరఫున ఈ పోరాటంలో గెలిచింది'' అని జాకీ అభివర్ణించారు.

ఈ తీర్పు ఇటువంటి ఇతర కేసులకు ఆధారంగా మారవచ్చు. లాండెస్ ప్రాంతంలో.. బాతులు పెద్దగా శబ్దం చేస్తున్నాయంటూ నమోదైన మరో కేసు అక్టోబర్‌లో విచారణకు రానుంది. ఆ ప్రాంతానికి చెందిన న్యాయ అధికారులు మౌరీస్ కేసులో తాజా తీర్పును అధ్యయనం చేస్తున్నారు.

చర్చి గంటలతో ఇబ్బందిగా ఉందని, ఆవుల ఘోషతో ప్రశాంతత భంగపడుతోందని కూడా మరికొన్ని కేసులు ఉన్నాయి.

''గ్రామీణ ప్రాంతాలకు వలసపోతున్న నగరవాసుల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ.. వాళ్లు వెళుతున్నది వ్యవసాయం చేయటానికి కాదు.. అక్కడ నివసించటానికి. ప్రతి ఒక్కరూ తమ సీమను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు'' అని విశ్లేషించారు యూనివర్సిటీ ఆఫ్ పొయిటీర్స్‌లో జియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జీన్ లూయీ యెంగ్యూ.

''ఈ ఉదంతం అసహనానికి పరాకాష్ట. మనం స్థానిక సంప్రదాయాలను అంగీకరించాల్సి ఉంటుంది'' అని సెయింట్ పియెరి డి-ఓలెరాన్ మేయర్ క్రిస్టోఫ్ సూయెర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)