You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఏం జరిగింది?
భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి శుక్రవారం నాడు రహస్య సమావేశం నిర్వహించింది. కశ్మీర్ విభజన అనంతరం పాకిస్తాన్ రాసిన లేఖకు స్పందనగా ఈ సమావేశం ఏర్పాటైంది.
ఇది రహస్య సమావేశమే అయినప్పటికీ, అది ముగిసిన తరువాత భారత్, చైనా, పాకిస్తాన్ రాయబారులు పాత్రికేయులతో మాట్లాడారు.
ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ, ఆర్టికల్ 370 రద్దు చేయడమన్నది పూర్తిగా భారతదేశ ఆంతరంగిక వ్యవహారమని, ఇందులో ఇతర దేశాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక ప్రగతిని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి చర్యలు చేపట్టామని చెప్పిన అక్బరుద్దీన్ పాకిస్తాన్ మీద కూడా వ్యాఖ్యలు చేశారు. జిహాద్ గుురించి, హింస గురించి ఒక దేశం మాట్లాడుతోందని, హింసాత్మక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని అన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టడంపై దృష్టి పెట్టాలి
పాకిస్తాన్ కనుక భారతదేశంతో చర్చలు జరపాలంటే ముందుగా ఉగ్రవాదాన్ని నిరోధించాలని అక్బరుద్దీన్ కోరారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం విలేఖరి సలీం రిజ్వీ బీబీసీ హిందీతో మాట్లాడుతూ, ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదని భద్రతామండలి సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయని చైనా రాయబారి తెలిపారని చెప్పారు.
అయితే, ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పరిష్కరించుకోవాలని, ఇప్పుడు కశ్మీర్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని చైనా వ్యాఖ్యానించింది.
చైనా ఏం చెప్పింది?
ఐక్యరాజ్యసమితి రహస్య సమావేశం తరువాత చైనా రాయబారి జాంగ్ జున్ మాట్లాడుతూ, అక్కడ మానవహక్కుల పరిస్థితి గురించి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.
"ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కూడా ఈ అంశంపై ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. భద్రతా మండలిలో జరిగిన చర్చలో నేను విన్నదాని ప్రకారం సభ్యులందరూ జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మానహక్కుల పరిరక్షణ గురించి కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఈ అంశంతో సంబంధం ఉన్న పక్షాలు ఏవైనా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. అలా చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది" అని జాంగ్ జున్ చెప్పారు.
ఇది భారత ఆంతరంగిక సమస్య కాదన్న పాకిస్తాన్
ఈ సందర్భంగా లద్దాఖ్ అంశాన్ని కూడా చైనా ప్రస్తావించింది. లద్దాఖ్‌లో 370వ అధికరణాన్ని రద్దు చేశారని, అది తమ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని వ్యాఖ్యానించింది.
కాగా, తాజా నిర్ణయంతో భారతదేశం కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చిందని పాకిస్తాన్ అంటోంది. ఆ దేశ రాయబారి మలీహా లోధీ మాట్లాడుతూ, చాలా దశాబ్దాల తరువాత ఈ అంశం మళ్ళీ భద్రతామండలిలో చర్చకు వచ్చిందని, ఇకపై ఇది భారతదేశ ఆంతరంగిక సమస్య కానేకాదని అన్నారు.
భారత్, పాకిస్తాన్‌లు భద్రతామండలి సభ్య దేశాలు కానందున అవి ఈ రహస్య సమావేశంలో పాల్గొనలేదు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్లో ఆ 5 రోజుల్లో ఏమేం జరిగాయి
- పోర్న్ స్టార్ మియా ఖలీఫాను వెంటాడుతున్న గతం
- 'సైనిక విన్యాసాలు చేస్తూ శాంతి చర్చలా...' దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆగ్రహం..
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- ‘అందరూ నిర్దోషులైతే.. ఈ దళితుల్ని చంపిందెవరు?’
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- కశ్మీర్: పాకిస్తాన్ అభ్యర్థనను అంతర్జాతీయ సమాజం ఎందుకు వినడం లేదు
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ఇవి కూడా చదవండి