ఆర్టికల్ 370 చరిత్ర ఏమిటి? కాంగ్రెస్ కూడా దాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చిందా?

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం సవరించింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ అంశాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయి.

ఇప్పుడు ఇక కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లేదు.

అయితే, ఆర్టికల్ 370కి మార్పులు, దిద్దుబాట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. వాటి చరిత్ర చాలా సుదీర్ఘం. కాంగ్రెస్ ప్రభుత్వాలకూ ఇందులో భాగం ఉంది.

ఆర్టికల్ 370 వెనుకున్న కథ ఏంటి? అది ఎందుకు అంత వివాదాస్పదం?

ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం కొంచెం చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.

జమ్ము-కశ్మీర్ రాష్ట్రంలో డోగ్రా వంశం

సిక్కు సామ్రాజ్యం స్థాపించి పాలిస్తున్న రంజిత్ సింగ్ మహారాజు 1822లో పురస్కారం కింద తన సైన్యంలోని గులాబ్ సింగ్‌ను జమ్మూకు రాజును చేశారు.

1846లో అమృత్‌సర్ సంధిలో భాగంగా కశ్మీర్ లోయను 75లక్షల నానక్‌షాహీ రూపాయలకు బ్రిటీష్ ప్రభుత్వం నుంచి గులాబ్ సింగ్ కొనుగోలు చేశారు.

అమృత్‌సర్ సంధి ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం దీనిని శాశ్వతంగా మహరాజ్ సింగ్, ఆయన వారసులకు స్వతంత్ర నియంత్రణ ఉండేలా ఇచ్చేసింది.

ఇలా జమ్మూకశ్మీర్‌లో డోగ్రా వంశం పాలన మొదలైంది.

వారి పరంపరలోనే 1925లో హరి సింగ్ కశ్మీర్‌కు రాజు అయ్యారు. రాజ్యంలో అత్యధికులు ముస్లింలు.

హిందువులైన మహారాజులు తమ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న భావన అక్కడి ముస్లింలలో ఉండేది.

'కశ్మీర్ - ఎ డిస్ప్యూటెడ్ లెగసీ' అనే పుసక్తంలో చరిత్రకారుడు అలిస్టర్ ల్యాంబ్ ఈ విషయం గురించి రాశారు.

''హిందువులను దృష్టిలో పెట్టుకుని చట్టాలు ఉండేవి. గోవధపై ఆంక్షలు వాటిలో ఒకటి. పాలనలో ప్రతి చోటా కశ్మీరీ బ్రాహ్మణుల ప్రభావం కనిపించేది. అవినీతి జరిగేది. ఆయుధాలు లైసెన్సులు హిందువులకు మాత్రమే ఇచ్చేవారు. సాయుధ బలగాలకూ ముస్లింలను దూరంగా ఉంచేవారు. డోగ్రా రాజపుత్రులకే ఉన్నత పదవులు దక్కేవి'' అని ఆయన పేర్కొన్నారు.

‘క్విట్ కశ్మీర్’ నినాదం

1932లో షేక్ అబ్దుల్లా ముస్లిం కాన్ఫరెన్స్ (నేషనల్ కాన్ఫరెన్స్) పార్టీని స్థాపించారు.

మహారాజు, డోగ్రా వంశం కశ్మీర్ విడిచివెళ్లాలని 'క్విట్ కశ్మీర్' నినాదంతో షేక్ అబ్దుల్లా ఉద్యమం నడిపించారు.

1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. భారత్, పాకిస్తాన్‌ విడిపోయి రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. 'ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947' ప్రకారం ఏవైనా రాజ్యాలు, సంస్థానాలు 'ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సెషన్' దస్తావేజులపై సంతకం చేయడం ద్వారా భారత్ లేదా పాకిస్తాన్‌లో విలీనం కావొచ్చు.

రాజ్యాలు, సంస్థానాలకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. స్వతంత్రంగా ఉండొచ్చు. భారత్‌లో విలీనం కావొచ్చు. పాకిస్తాన్‌తో కలవొచ్చు.

జూనాగఢ్, హైదరాబాద్, జమ్మూకశ్మీర్ తప్ప అన్ని సంస్థానాలు నిర్ణయాలు తీసేసుకున్నాయి.

హరి సింగ్ మొదట ఏ దేశంలోనూ విలీనానికి మొగ్గు చూపలేదు. జమ్మూకశ్మీర్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచే ఉద్దేశం ఆయనకు ఉండేదన్నది కొందరి అభిప్రాయం.

వ్యాపారం, పర్యాటకం, రవాణాలకు సంబంధించి ఆటంకాలు లేకండా పాకిస్తాన్‌తో ఆయన ఓ ఒప్పందం చేసుకున్నారు. భారత్‌తో అలాంటిదేమీ కుదుర్చుకోలేదు.

1947 అక్టోబర్‌లో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పాకిస్తాన్ వైపు నుంచి సాయుధులైన పశ్తూన్ తెగవాళ్లు కశ్మీర్‌పై దాడి ప్రకటించారు.

కశ్మీర్‌లోని స్థానిక ముస్లింలు మహారాజుపై తిరుగుబాటు చేస్తారని పాకిస్తాన్‌లోని కొన్ని వర్గాలు భావించాయి.

పాలన వ్యవస్థపై పట్టు నిలుపుకోవడం, చొరబాటుదారుల దాడులను ఆపడం మహారాజుకు తలకు మించిన భారమైంది.

భారత్‌తో హరి సింగ్ ఒప్పందం

అప్పుడు భారత గవర్నర్‌గా ఉన్న లార్డ్ మౌంట్‌బాటెన్‌ను హరిసింగ్ సంప్రదించారు. భారత్ సాయం కోరారు.

ఇందుకోసం భారత్‌లో విలీనమవుతూ 'ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సెషన్'పై హరిసింగ్ సంతకం చేశారు.

ఆ పత్రాల ప్రకారం జమ్మూకశ్మీర్ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యునికేషన్స్ అంశాలు భారత్ అధికార పరిధిలోకి వచ్చాయి. మిగతా అంశాలు జమ్మూకశ్మీర్ పరిధిలోనే ఉన్నాయి. ఆ ప్రాంతానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం-1935, ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టం-1947కు చేసే మార్పులు స్వయంగా హరి సింగ్ అంగీకరిస్తేనే ఈ పత్రాలకు వర్తిస్తాయన్న నిబంధన 'ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సెషన్'లో ఉంది.

భవిష్యత్తులో భారత్ రాజ్యాంగపరంగా చేసుకునే ఏ మార్పులకైనా తాను కట్టుబడి ఉన్నట్లు కాదని, ఆయా అంశాలపై భారత్‌తో ఒప్పందం చేసుకునే అధికారం తనకు ఉంటుందని కూడా హరిసింగ్ నిబంధన పెట్టారు.

ఈ షరతులకే ఆర్టికల్ 370 ద్వారా రాజ్యాంగబద్ధత కల్పించిందని నల్సార్ వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఫైజన్ ముస్తఫా 'ఇండియన ఎక్స్‌ప్రెస్' పత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌కు సంబంధించి చేసే చట్ట మార్పులకు అక్కడి రాజ్యాంగ సభ ఆమోదం ఉండాలన్న నిబంధన ఈ ఆర్టికల్‌లో ఉంది.

బీబీసీ మాజీ ప్రతినిధి ఆండ్రూ హ్వాయిట్హెడ్ కశ్మీర్ అంశంపై ఓ పుస్తకం రాశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగం అయ్యేందుకు ఆధారమే ఆర్టికల్ 370 అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్టికల్ 370పై 'జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన తాత్కాలిక నిబంధనలు' అనే శీర్షిక ఉంటుంది.

భారత్‌తో విలీన ఒప్పందంపై హరి సింగ్ ఎప్పుడు సంతకాలు చేశారన్నదానిపై కొన్ని సందేహాలు తలెత్తాయి.

హరి సింగ్‌పై తమతో యథాతథ ఒప్పందంపై సంతకం చేశారని, భారత్‌తో ఒప్పందం చేసుకునే అధికారం ఆయనకు ఉండదని పాకిస్తాన్ వాదిస్తోంది. హరి సింగ్‌పై ఒత్తిడి తెచ్చి భారత్ ఆ ఒప్పందం చేసుకుందని ఆరోపిస్తోంది.

ప్రజాభిప్రాయ సేకరణ హామీ అప్పటిది..

1948 జనవరిలో కశ్మీర్ వివాదం ఐరాసకు చేరింది. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అంశం తెరపైకి వచ్చింది.

ఐరాస మధ్యవర్తిత్వం కారణంగా కశ్మీర్‌లోని కొంత ప్రాంతం భారత్‌లో, మరికొంత ప్రాంతం పాక్ నియంత్రణలో అలాగే కొనసాగింది.

1949లో హరి సింగ్ కుమారుడు కరణ్ సింగ్‌ జమ్మూకశ్మీర్‌ సదర్ ఎ రియాసత్‌ (అధ్యక్షుడు) పదవి చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ పరిషత్‌లో షేక్ అబ్దుల్లా సభ్యుడిగా చేరారు.

1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి దక్కింది.

రాజ్యాంగ పరిషత్‌లో ప్రత్యేక ప్రతిపత్తి విషయంపై చర్చ సందర్భంగా వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. ''భారత ప్రభుత్వం కశ్మీర్ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చింది. భారత్‌తో ఉంటారా, విడిగా ఉంటారా తేల్చుకునే అవకాశం కూడా వారికి ఉంటుంది. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు కట్టుబడి ఉన్నాం. అంతకుముందు అక్కడ పరిస్థితులు శాంతియుతంగా మారాలి. ప్రజాభిప్రాయ సేకరణ నిష్పాక్షికంగా జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడాలి'' అని సభ్యుడు గోపాలస్వామి అయ్యంగార్ అన్నారు.

అప్పటి ఆపద్ధర్మ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ప్రజాభిప్రాయ సేకరణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

అయితే జమ్మూకశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడూ జరగలేదు.

1952లో జమ్మూకశ్మీర్‌లోని రాజ్యాంగ సభ భేటీ జరిగింది. భారత్‌తో బంధాల గురించి 'దిల్లీ ఒప్పందం' కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండేందుకు భారత ప్రభుత్వ అంగీకారం తెలిపింది.

'అతిపెద్ద సవరణ అదే'

దశాబ్దాలుగా ఆర్టికల్ 370ని ప్రభుత్వాలు బలహీనపరుస్తూ వచ్చాయని, ఇప్పుడు సవరించడం వల్ల పరిస్థితిలో పెద్ద మార్పేమీ ఉండదని ఆండ్రూ హ్వాయిట్హెడ్ అభిప్రాయపడ్డారు.

''జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యంగం, జెండా ఉండేవి. మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ స్వతంత్రత ఏమీ లేదు'' అని ఆయన అంటున్నారు.

కశ్మీర్‌లో ఇప్పుడు ఎవరైనా ఆస్తులు కొనుక్కొనే అవకాశం ఉండటంతో ఆ ప్రాంత జనాభా స్వరూపం మారిపోవచ్చన్న ఆందోళన స్థానికుల్లో పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఆర్టికల్ 370కి కాంగ్రెస్ పాలనలో చాలా సార్లు సవరణలు జరిగాయని, వాటిలో అతిపెద్దది 1954లో జారీ అయిన రాష్ట్రపతి ఆదేశమని సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ అన్నారు.

''1954లో వచ్చిన రాష్ట్రపతి ఆదేశంతో యూనియన్ లిస్ట్‌లో ఉన్న దాదాపు అన్ని అంశాలపై జమ్మూకశ్మీర్‌లో చట్టాలను వర్తింపజేసే అధికారం భారత్‌కు వచ్చింది. రాష్ట్ర శాసనసభ దీన్ని ఆమోదించింది'' అని చెప్పారు.

''భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. వీటిలో 260 జమ్మూకశ్మీర్‌కు వర్తిస్తున్నాయి. మొదట్లో కశ్మీర్‌కు అధ్యక్షుడు (సదర్ ఎ రియాసత్), ప్రధానమంత్రి (వజీర్ ఎ ఆజం) ఉండేవారు. ఇందిరా గాంధీ హయాంలో వీటిని గవర్నర్, ముఖ్యమంత్రి పదవులుగా మార్చారు. సదర్ ఎ రియాసత్‌ను ఎన్నుకునేవారు. ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు నియమించినట్లే జమ్మూకశ్మీర్‌కూ కేంద్రం గవర్నర్‌ను నియమిస్తోంది'' అని అన్నారు.

ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న సమయంలో నెహ్రూ చెప్పిన మాటలను 'ద ఎకానమిక్స్ టైమ్స్' పత్రికకు రాసిన ఓ కాలమ్‌లో రాకేశ్ ద్వివేదీ కోట్ చేశారు.

''ఆర్టికల్ 370 రాజ్యాంగంలో శాశ్వత భాగం కాదు. దాని ప్రభావం నెమ్మదిగా తగ్గుతున్నట్లు కనబడుతోంది. ఈ ప్రక్రియ అలాగే కొనసాగాలి'' అని నెహ్రూ వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు.

''ఆర్టికల్ 370 ఒక సొరంగం, అందులో నుంచి చాలా ట్రాఫిక్ వెళ్లింది. వెళ్తుంది కూడా'' అని 1964లో ఆపద్ధర్మ హోంమంత్రి గుల్జారీ లాల్ నందా వ్యాఖ్యానించినట్లు ద్వివేదీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)