You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సూపర్ ఓవర్ నిబంధనలేంటి? బౌండరీలు కూడా టై అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
క్రికెట్ చరిత్రలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టై అవటం ఇదే తొలిసారి. మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చాలనుకుంటే.. సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. దీంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టు విజేతగా నిలిచింది. మరి ఇరు జట్ల బౌండరీలు కూడా సమానం అయితే అప్పుడు విజేతను ఎలా నిర్ణయిస్తారు?
ఇంతకీ ఈ సూపర్ ఓవర్ ఏంటి?
సూపర్ ఓవర్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తొలుత వన్ ఓవర్ పర్ సైడ్ ఎలిమినేటర్(ఊప్సీ) అని పిలిచేది. తర్వాత దాన్ని సూపర్ ఓవర్ అనే సంబోధిస్తోంది.
2008లో ట్వంటీ 20 క్రికెట్ కోసం ఈ సూపర్ ఓవర్‌ను ప్రవేశపెట్టారు.
2004లో ప్రారంభమైన అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్ మ్యాచుల్లో ఏదైనా మ్యాచ్ టై అయితే, దాని ఫలితం తేల్చేందుకు బౌల్-ఔట్ పద్ధతిని అనుసరించేవారు. అంటే.. ఒక్కో జట్టు తరపున ఎంపిక చేసిన బౌలర్లు వికెట్లపైకి బాల్ విసరాలి.. ఎవరు ఎక్కువ సార్లు బౌల్డ్ చేస్తే వారే విజేత.
సూపర్ ఓవర్‌లో మాత్రం ఆరు బంతుల్లో ఏ జట్టు ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టే విజేత.
ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
వాస్తవానికి సూపర్ ఓవర్ అనేది ఐసీసీ వన్డే క్రికెట్ ఆట నియమ నిబంధనల్లో లేదు. కానీ, ట్వంటీ20 నియమ నిబంధనల్లో ఉంది.
2011 క్రికెట్ ప్రపంచకప్ నాకౌట్ దశలో ఈ సూపర్ ఓవర్ నిబంధనను వన్డే క్రికెట్‌లో ప్రవేశపెట్టింది ఐసీసీ. కానీ, దీనిని ఉపయోగించే అవకాశం రాలేదు. తర్వాత 2015 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే దీనిని ఉపయోగించాలని నిర్ణయించింది. 2017లో మహిళల క్రికెట్ ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ దశలకు తిరిగి సూపర్ ఓవర్ విధానాన్ని ఐసీసీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2019 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే దీన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.
అయితే, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ (పురుషుల) క్వాలిఫయర్ 2018 ఆట నియమ, నిబంధనల్లో మాత్రం సూపర్ ఓవర్ నియమ నిబంధనల్ని పేర్కొన్నారు.
16.9.4డి
ఫైనల్ మ్యాచ్ టై అయితే.. రెండు జట్లూ సూపర్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది. దీని ద్వారానే విజేతను ఎంపిక చేస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ ఆడేందుకు వాతావరణం అనుకూలించకపోతే, మ్యాచ్ ఫలితం తేలకపోతే.. సూపర్ సిక్స్ దశలో అత్యుత్తమ దశలో నిలిచిన జట్టే విజేత అవుతుంది.
అయితే, ఈ నిబంధనను మరింత స్పష్టంగా వివరించేందుకు ఒక అనుబంధ పత్రాన్ని కూడా ఐసీసీ జత చేసింది.
అనుబంధం ఎఫ్ ఏం చెబుతోంది?
- సూపర్ ఓవర్ ఎప్పుడు ఆడాలనేది మ్యాచ్ జరిగే రోజు వాతావరణ పరిస్థితుల్ని బట్టి మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తారు. సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత 10 నిమిషాలకు ఇది ప్రారంభమవుతుంది.
- సూపర్ ఓవర్ ఆడేందుకు నిర్ణయించిన సమయం.. ఎ) వాస్తవ మ్యాచ్‌కు కేటాయించిన అదనపు సమయంలో వాడుకున్న సమయం, బి) వాస్తవ మ్యాచ్ సమయం, అదనపు సమయంతో కలిపి మ్యాచ్ సమయం.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కంటే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సూపర్ ఓవర్ ఆడేప్పుడు కనుక అందుబాటులో ఉన్న అదనపు సమయం కంటే ఎక్కువ సమయం జరుగుతుంటే.. సూపర్ ఓవర్ రద్దవుతుంది.
- మ్యాచ్‌కు కేటాయించిన పిచ్‌పైనే సూపర్ ఓవర్ కూడా ఆడాలి. మ్యాచ్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు ఆ పిచ్‌పై ఆడలేని పరిస్థితి ఉందంటే పిచ్ మార్చవచ్చు.
- మ్యాచ్ పూర్తయ్యే సమయానికి అంపైర్లు ఏ వైపు ఉన్నారో సూపర్ ఓవర్లో కూడా అదే వైపు ఉండాలి.
- సూపర్ ఓవర్ రెండు ఇన్నింగ్స్‌లకూ ఫీల్డింగ్ చేస్తున్న జట్టు తమకు నచ్చిన వైపు నుంచి బౌలింగ్ చేయవచ్చు.
- ప్రధాన మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లే సూపర్ ఓవర్‌లో ఆడేందుకు అర్హులు. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయం వల్ల కానీ, అస్వస్థత వల్ల కానీ, ఆమోదించదగ్గ కారణాల వల్ల ఆటకు దూరమైతే.. సాధారణ మ్యాచ్‌లో ఏ నిబంధనలు వర్తిస్తాయో అవే నిబంధనలు సూపర్ ఓవర్‌కు కూడా వర్తిస్తాయి.
- ప్రధాన మ్యాచ్‌కు వర్తించే పెనాల్టీ సమయం సూపర్ ఓవర్‌కు కూడా వర్తిస్తుంది.
- సాధారణ వన్డే మ్యాచ్ చివరి ఓవర్‌కు వర్తించే ఫీల్డింగ్ నిబంధనలే సూపర్ ఓవర్‌కు కూడా వర్తిస్తాయి.
- ప్రధాన మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు.. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేస్తుంది.
- సూపర్ ఓవర్ వేసేందుకు ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ కానీ, అతడు సూచించిన ఆటగాడు కానీ అంపైర్లు అందించే స్పేర్ బాల్స్ బాక్సులో నుంచి తమకు నచ్చిన బంతిని ఎంచుకోవచ్చు. ప్రధాన మ్యాచ్‌లో ఉపయోగించిన బంతులే ఈ బాక్సులో ఉంటాయి. రెండోసారి బౌలింగ్ చేసే జట్టు.. మొదటి జట్టు వాడిన బంతినే వాడొచ్చు. మార్చాలంటే మాత్రం వన్డే మ్యాచ్‌లో వర్తించే నిబంధనలే వర్తిస్తాయి.
- సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్న జట్టు రెండు వికెట్లు కోల్పోతే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసినట్టే.
- ఒకవేళ సూపర్ ఓవర్లో కూడా రెండు జట్లూ సమాన స్కోర్లు చేస్తే, ప్రధాన మ్యాచ్ డక్‌వర్త లూయిస్ పద్ధతలో టై అయితే, తక్షణం క్లాజ్ 15 అమల్లోకి వస్తుంది. లేదంటే, ప్రధాన మ్యాచ్, సూపర్ ఓవర్.. రెండింటితో కలిపి ఏ జట్టు బ్యాట్స్‌మన్ ఎక్కువ బౌండరీలు నమోదు చేస్తే ఆ జట్టే విజేత.
- ఒకవేళ రెండు జట్లూ సమానంగా బౌండరీలు నమోదు చేస్తే.. సూపర్ ఓవర్ కాకుండా ప్రధాన మ్యాచ్‌లో ఏ జట్టు బ్యాట్స్‌మన్ ఎక్కువ బౌండరీలు నమోదు చేస్తే ఆ జట్టే విజేత.
- అలాంటి సందర్భంలో కూడా సమాన బౌండరీలు నమోదైతే.. సూపర్ ఓవర్‌లో చివరి బంతి నుంచి ఏ జట్టు ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టే విజేత. ఒకవేళ ఏదైనా జట్టు రెండు వికెట్లు కోల్పోతే.. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో మిగిలిన బంతుల్ని డాట్ బాల్స్‌గా పరిగణించాలి. జట్టు చివరిసారి ఎదుర్కొన్న చట్టబద్ధమైన బంతి నుంచి సాధించిన పరుగులను లెక్కించాలి. వైడ్లు, నో బాల్, పెనాల్టీ పరుగులతో సహా.
ఉదాహరణ
పైన పేర్కొన్న ఉదాహరణలో 6, 5 బంతులకు రెండు జట్లూ సమాన పరుగులు చేశాయి. కానీ, 4వ బంతికి మాత్రం.. మొదటి జట్టు 2 పరుగులు చేస్తే, రెండో జట్టు ఒక్క పరుగే చేసింది. కాబట్టి మొదటి జట్టే విజేత.
వన్డే చరిత్రలో మొదటి మ్యాచ్
ఐసీసీ గణాంకాల ప్రకారం వన్డేల చరిత్రలో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించిన మొదటి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజీలాండ్‌ల మధ్య జరిగిన 2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే.
ఇవి కూడా చదవండి:
- బెన్ స్టోక్స్: ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన ‘న్యూజీలాండర్’
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- జిమ్మీ నీషామ్: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతూనే... డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఆల్‌రౌండర్
- చంద్రయాన్ 2: చందమామపై ఎందుకింత మక్కువ
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
- భారత జట్టు భవిష్యత్ ఏంటి... ప్రపంచ కప్ మిగిల్చిన జ్ఞాపకాలేంటి...
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- డక్‌వర్త్ లూయిస్: అసలు ఈ రూల్ ఎలా పుట్టింది... విజేతను ఎలా నిర్ణయిస్తారు...
- ప్రపంచ కప్ 2019: కోహ్లీ సేనపై అభిమానం వీరిని 17 దేశాలు దాటించింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)