వీడియో: క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూడండి
ఇంగ్లండ్‌లో క్రికెట్ వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. వరుస విజయాలతో టీమిండియా జోరు మీద ఉంది.
షమి లాంటి పేసర్లు విసిరే అద్భుతమైన స్వింగర్లను, కుల్‌దీప్ యాదవ్ లాంటి స్పినర్లు చేసే మాయాజాలాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు.
ఇలా బంతితో విన్యాసాలు చేయించాలంటే బౌలర్లకు నైపుణ్యం ఉండటం ఒక్కటే సరిపోదు.

ఆ బంతికి కూడా సత్తా ఉండాలి. దాని ఆకారం, కుట్లు సరిగ్గా ఉండాలి. అప్పుడే బంతి దిశను బౌలర్ నియంత్రించగలడు. ఇన్‌స్వింగర్, ఆఫ్‌స్వింగర్, గూగ్లీ, స్పిన్.. ఇలా ఏదైనా వేయగలడు. ఆకారం మారితే, బంతి ఎలా పడుతుందన్నదీ ఎవరికీ అంతుచిక్కదు.
అందుకే బంతి తయారీ ప్రక్రియ చాలా కీలకం. ఎన్నో సాంకేతిక అంశాలు దీనితో ముడిపడి ఉంటాయి.
ఆ ప్రక్రియ ఎలా ఉంటుందన్న విషయం గురించి బంతుల తయారీ నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

తసావర్ హుస్సేన్ అనే నిపుణుడు బంతి తయారీ ప్రక్రియ గురించి బీబీసీకి వివరించారు. ఆయన కుటుంబం చాలా ఏళ్ల నుంచి ఈ వ్యాపారంలో ఉంది.
''35-40 ఏళ్ల నుంచి మా నాన్న క్రికెట్ బంతులను తయారు చేసే పనిలో ఉన్నారు. 10 ఏళ్ల కిందటే ఆయన తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు'' అని హుస్సేన్ చెప్పారు.
వివిధ ఫార్మాట్లలో వాడే బంతుల్లో ఉండే తేడాల గురించి కూడా ఆయన వివరించారు.
''ఫుల్ కార్క్‌ను వన్డే మ్యాచుల్లో వాడతారు. హాఫ్ కార్క్‌ను టీ20ల్లో వినియోగిస్తారు. బాల్ తయారీలో తోలును ఉపయోగిస్తాం. దాన్ని నాలుగు ముక్కలుగా కత్తిరించి, లోపలి నుంచి వాటిని చేతితో కుడతాం. ఆ తరువాత వీటిని లామినేషన్ చేస్తాం. మెషిన్ మీద పెట్టి, రెండు భాగాలను కలుపుతాం. ఆ తరువాత రెండు వరుసల్లో కుట్లు వేస్తారు. దాంతో బాల్ పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది'' అని హుస్సేన్ పేర్కొన్నారు.

60-70 డిగ్రీల వేడి వద్ద బాల్‌కు సరైన ఆకృతిని తీసుకొస్తామని, దాన్ని ఆకారం సరిగ్గా ఉందా, లేదా అన్ని నిర్ధారించేందుకు ఓ పరీక్ష ఉంటుందని హుస్సేన్ చెప్పారు.
ఓ ప్రత్యేకమైన రంధ్రం గుండా బంతులను దూరుస్తామని, అందులో దూరగలిగనవే ఆటలోకి వెళ్తాయని వివరించారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల ప్రకారం బంతి 156 గ్రాముల బరువు ఉండాలని, అంతకు మించి తక్కువున్నా, ఎక్కువున్నా ఆ బంతి ఆటకు పనికిరాదని చెప్పారు.
మరిన్ని వివరాలు పైవీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ వరల్డ్ కప్ 2019 : వన్డేల్లో అత్యుత్తమ భారత జట్టు ఇదేనా...
- ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ వరుసగా ఏడుసార్లు ఎలా గెలిచిందంటే..
- 'సచిన్ అందరికీ క్రికెట్ దేవుడు... కానీ, నాకు మాత్రం కొడుకులాంటి వాడు'
- కార్లోస్ బ్రాత్‌వైట్... ఈ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి...
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- సామాన్యుడి విజయాన్ని సహజంగా చూపించిన 'మల్లేశం'
- ప్రజావేదికను కూల్చేసిన అధికారులు: అసలు వివాదం ఇలా మొదలైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)