గడ్డి వంతెన ఇది... దీన్ని ఎలా కడతారో చూడండి

పెరూలోని కుస్కో ప్రాంతంలో అపురిమక్ నది ఒడ్డున ఒక గడ్డి తాళ్ళతో అల్లిన వంతెన ఉంది. ఈ వంతెనను ఏటా తొలగించి కొత్తది ఏర్పాటు చేస్తారు.

దాదాపు ఆరు వందల ఏళ్లుగా ఇక్కడ గడ్డి వంతెనను ఏర్పాటు చేస్తున్నారు.

'ఇంకా' రాజ్యంలోని పలు ప్రధాన నగరాలను, పట్టణాలను అనుసంధానించడంలో ఇలాంటి వంతెనలు కీలక పాత్ర పోషించాయి. ఈ వంతెనల విశిష్టతను గుర్తించిన యునెస్కో 2013లో వాటిని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.

తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని ఇక్కడి ప్రజలు తమ వారసత్వ సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఏటా ఈ నదికి ఇరువైపులా ఉన్న ప్రజలు కలిసి ఈ వంతెనకు కొత్త జీవాన్ని పోస్తారు.

పురుషులు మాత్రమే ఈ వంతెనను నిర్మించాలన్న సంప్రదాయం ఉంది. మహిళలు మాత్రం నదికి కొంతదూరంలో కూర్చుని చిన్న చిన్న తాళ్లను తయారుచేస్తారు.

వంతెనను నిర్మించే పద్దతిలో మొదటిరోజు మగవారు అంతా కలిసి 120 చిన్న చిన్న తాళ్లను కలిపి లావైన తాళ్లను తయారుచేస్తారు. వంతెనకు ప్రధాన బలం ఆ తాళ్లే.

'కోయా ఇచు' అనే దృఢమైన గడ్డి ఆ తాళ్ల తయారీకి వినియోగిస్తారు. ఈ గడ్డిని కోసిన తరువాత నీటిలో నానబెడతారు.

వంతెన పనిలో నిమగ్నమయ్యే జనాల కోసం చాలా మంది ఊరి జనం కోడి, పంది, చేపల మాంసంతో రకరకాల వంటకాలు వండుకుని తీసుకొస్తారు. అయితే, ప్రతి వంటకంలో స్థానికంగా పండే దుంపలను మాత్రం ఖచ్చితంగా వాడతారు.

గతేడాది నిర్మించిన వంతెనను తెంచేసి నదిలో వదిలేయడం అక్కడి ప్రజల ఆనవాయితీ.

ఆరు తాళ్లలో నాలుగింటిని వంతెనపై నడిచే భాగంలో వాడతారు. మిగిలిన రెండింటిని వంతెనకు ఇరువైపులా నడిచేవారికి సహాయంగా పట్టుకోడానికి వాడతారు.

నదికి ఇరువైపులా ఈ ఆరు తాళ్లను ముందే చెక్కిన రాళ్లకు గట్టిగా కడతారు. వంతెన బిగిసేవరకూ ఇరువైపుల నుంచి ఈ తాళ్లను లాగుతారు. ఈ ప్రక్రియ విజయవంతం అవ్వడానికి ఒక రోజంతా పడుతుంది.

ఈ వంతెనలో చెప్పుకోదగిన విషయం ఏంటంటే నిర్మాణ ప్రక్రియలో ఆధునిక సాధనాలు ఎక్కడా వాడరు. మానవ శక్తి, రాళ్లు, గడ్డి మాత్రమే ఈ నిర్మాణానికి వాడతారు.

వంతెన ఏర్పాటు చేసిన తర్వాత నాలుగో రోజు పాటలు పాడుతూ, వివిధ రకాల వంటకాలు వండుకుని పండుగ చేసుకుంటారు. ఈ నాలుగో రోజు ఏటా జూన్ నెల రెండో ఆదివారం అయ్యేలా చూసుకుని వంతెన నిర్మాణం చేపడతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)