ఆర్చీ హారిసన్: ‘యువరాజు కొడుక్కి నా పేరే పెట్టారు’

డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు తమ చిన్నారికి ఆర్చీ హారిసన్ అని పేరు పెట్టడంతో బ్రిటన్‌లో ఆ పేరున్న చాలామంది ఆశ్చర్యపోయారు. యువరాజు కుమారుడి పూర్తి పేరు ఆర్చీ హారిసన్ మౌంట్‌బాటన్-విండ్సర్.

యువరాజు కుమారుడి పేరు, తమ పేరు ఒకటేనని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకుంటున్నారు.

మరికొందరికి వారి స్నేహితులు, కుటుంబసభ్యుల నుంచి అభినందనలు, జోకులు అందుతున్నాయి.

ఇంజినీరింగ్ జియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆర్చీ హారిసన్ అనే 20 ఏళ్ల యువకుడు మాట్లాడుతూ.. తాను ఆఫీసులో ఉండగా యువరాజు కుమారుడికి ఈ పేరు పెట్టారని తెలిసిందని.. ఎవరైనా జోక్ చేస్తున్నారేమో అనుకున్నానని.. కానీ, తన పేరూ అదే కావడంతో తెలిసినవారు వాట్సాప్‌లో ఈ విషయం తనకు మెసేజ్ చేయడం ప్రారంభించారని చెప్పారు.

యువరాజు కుమారుడికి ఆర్చీ హారిసన్ అని పేరు పెట్టడంతో ఇప్పుడు తన పేరుకు గుర్తింపు వచ్చిందని ఈ ఇంజినీరింగ్ జియాలజిస్ట్ చెప్పుకొచ్చాడు.

జాడీ హారిసన్ అనే మహిళ ఆరేళ్ల కుమారుడి పేరు కూడా ఇదే. ప్రిన్స్ హ్యారీ తన పేరు చెబుతున్నాడని ఆ అబ్బాయి సంబరపడ్డాడని జాడీ తెలిపారు. ''రేపు స్కూలుకి వెళ్లగానే నన్ను ఇక ప్రిన్స్ ఆర్చీ అని పిలవాలి టీచర్'' అని చెబుతానంటున్నాడన్నారామె.

పందొమ్మిదేళ్ల ఆర్చీ హారిసన్ అనే యువకుడు తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారు. ఇప్పుడు స్నేహితులు తనను ఆట పట్టిస్తున్నారని.. ఏం చెప్పినా 'చిత్తం మహారాజా' అంటూ వంగివంగి దండాలు పెడుతున్నారని తెలిపాడు.

లండన్‌కు చెందిన మరో వ్యక్తి ఓ ట్వీట్ చేశాడు. అందులో విషయమేంటంటే.. ఆయన పెంచుకుంటున్న శునకం పేరు కూడా ఆర్చీ హారిసనే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)