జూలియన్ అసాంజ్: వికీలీక్స్ సహ-వ్యవస్థాపకుడు అరెస్ట్

వికీ లీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌ను లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అరెస్ట్ చేశారు.

అసాంజ్ గత ఏడేళ్ళుగా ఈ రాయబార కార్యాలయంలో శరణార్థిగా ఉన్నారు. లైంగిక వేధింపుల కేసులో తనను స్వీడన్‌కు అప్పగించడానికి వీల్లేకుండా ఆయన ఈక్వెడార్ రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు.

అసాంజ్‌ను అదుపులోకి తీసుకున్నామని, "వీలైనంత త్వరగా" వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తామని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

ఆయన కోర్టు ఎదుట హాజరు కాకపోవడం వల్లే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు.

అంతర్జాతీయ సదస్సుల నిర్ణయాలను పదే పదే ఉల్లంఘించిన అసాంజ్‌కు శరణార్థి హోదాను ఉపసంహరిస్తున్నట్లు ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో చెప్పారు.

అయితే, వికీలీక్స్ మాత్రం ఈక్వెడార్ చర్య చట్ట విరుద్ధమని ట్వీట్ చేసింది. "అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని" అంటూ అసాంజ్‌కు రాజకీయ ఆశ్రయాన్ని రద్దు చేయడం న్యాయం కాదని వ్యాఖ్యానించింది.

బ్రిటన్ హోం శాఖ మంత్రి సాజిద్ జావిద్ దీనిపై స్పందిస్తూ, "జూలియన్ అసాంజ్ ఇప్పుడు పోలీసుల నిర్బంధంలో ఉన్నట్లు ధ్రువీకరిస్తున్నాను. ఆయన బ్రిటన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటారు" అని ట్వీట్ చేశారు.

"ఈ విషయంలో సహకారం అందించిన ఈక్వడార్‌కు కృతజ్ఞతలు, అలాగే, యూకే మెట్రోపాలిటన్ పోలీసులు కనబరిచిన నిబద్ధతను ప్రశంసిస్తున్నాను. ఎవరూ చట్టానికి అతీతులు కాదు" అని సాజిద్ తన ట్వీట్‌లో తెలిపారు.

అసాంజ్ (47) ఈక్వడార్ రాయబార కార్యాలయం నుంచి బయటకు రావడానికి నిరాకరించారు. ఒకవేళ బయటకు వస్తే తనను వికీలీక్స్ కార్యకలాపాల గురించి విచారించడానికి అమెరికాకు అప్పగించే అవకాశం ఉందని ఆయన చెబుతూ వచ్చారు.

"మా రెండు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగిన తరువాతే అరెస్ట్ జరిగిందని బ్రిటన్ విదేశాంగ మంత్రి సర్ అలెన్ డంకన్ చెప్పారు.

ఈక్వడార్ రాయబార కార్యాలయంలోని తమ సహ-వ్యవస్థాపకుడికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో గూఢచర్యం జరుగుతున్నట్లు తాము గుర్తించామని వికీలీక్స్ ప్రకటించిన మరునాడే అసాంజ్ అరెస్ట్ కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)